Telangana | హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): నిజామాబాద్ జిల్లాలో మైనార్టీ గురుకులానికి చెందిన ఓ ఉన్నతాధికారి గెస్ట్ ఫ్యాకల్టీలుగా ఉద్యోగావకాశం కల్పిస్తామని చెప్పి అభ్యర్థుల నుంచి డబ్బు వసూలు చేశారని బయటకు పొక్కింది. కేసులదాకా వెళ్లినట్టు ఇటీవలే వెలుగుచూసింది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ గురుకులంలోనూ ఇదే రీతిన పోస్టులను భర్తీ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా కొందరు గురుకులాల ఆర్సీవోలు అవినీతి దందాకు తెరలేపినట్టు తెలుస్తున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో గెస్ట్, పార్ట్‌టైం ఉద్యోగులుగా పదేండ్లపాటు విద్యాబోధన చేసి న వారిని ఇటీవలే తొలగించారు. పర్మినెంట్ ఉద్యోగాల భర్తీ చేపట్టడంతో పాతవారిని వద్దని పక్కనపెట్టారు. సొసైటీల్లో నియామక ఉత్తర్వులు తీసుకున్న వారిలో 1,700 మంది అభ్యర్థులు ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరలేదని తెలుస్తున్నది. పదుల సంఖ్యలో అభ్యర్థులు గురుకుల పోస్టులను వదులుకున్నట్టు సమాచారం. మొత్తంగా అన్ని సొసైటీల్లో అన్ని క్యాడర్లలో 2,500 నుంచి 3,000 పోస్టులు ఖాళీగా మిగిలినట్టు సమాచారం. ఖాళీల స్థానంలో ఏండ్ల తరబడి పనిచేసిన పాతవారిని కాదని కొత్తవారితో భర్తీ చేస్తుండటం గమనార్హం. కొందరు ఆర్సీవోలు చేతివాటం ప్రదర్శిస్తూ ఇదంతా చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బోధన అవకాశాలున్న చోట బోధనానుభవమున్న తమ సేవలనే కొనసాగించాలని పాతవారు కోరుతున్నారు.
సుదీర్ఘ బోధనానుభవం, గురుకులాలకు తాము అందించిన సేవలకు గుర్తింపుగా ఖాళీల భర్తీలో తమకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని గెస్ట్, పార్ట్‌టైం ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తమను పరిగణనలోకే తీసుకోకుండా కొత్తవారిని నియమించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. రెగ్యులర్ నియామకాలను అడ్డం పెట్టుకుని ఆర్సీవోలు చేతివాటం ప్రదర్శిస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. ఇప్పటికీ గత జూన్, జూలై నెలల వేతన బకాయిలు తమకు చెల్లించలేదని వివరిస్తున్నారు.
ఖాళీలున్న చోట అప్పటికే పనిచేసిన, సుదీర్ఘ బోధన అనుభవమున్న అభ్యర్థులను కాదని, తిరిగి కొత్తగా డెమోలను నిర్వహిస్తూ కొత్త అభ్యర్థులతో ఆయా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఒక్కో పోస్టుకు 50 వేల నుంచి లక్ష వరకు వసూలు చేస్తూ కొత్తవారితో ఆయా ఖాళీలను నింపుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పేరుకే డెమోలను నిర్వహిస్తూ, చివరికి డబ్బులిచ్చిన వారినే ఎంపిక చేస్తున్నారని బాహాటంగానే ప్రచారం కొనసాగుతున్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మైనార్టీ గురుకులానికి చెందిన ఓ ఉన్నతాధికారి ఇదే రీతిన ఉద్యోగావకాశం కల్పిస్తామని చెప్పి నిరుద్యోగ అభ్యర్థుల నుంచి డబ్బు వసూలు చేశారని, అది బయటకు పొక్కడంతో కేసుల వరకూ దారితీసింది. కమలాపూర్ గురుకులంలోనూ డబ్బులు తీసుకొనే పోస్టుల భర్తీ చేపట్టారని గతంలో పనిచేసిన గెస్ట్ ఫ్యాకల్టీలు ఆరోపణలు చేస్తున్నారు.