న్యూఢిల్లీ, జూన్ 12: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఈవీఎంలు వాడటం చూశాం. కానీ, రాష్ట్రపతి ఎన్నికలో మాత్రం బ్యాలెట్ విధానాన్నే కొనసాగిస్తున్నారు. 2004 నుంచి ఇప్పటి వరకు 4 లోక్సభ, 127 అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలను వాడారు. కానీ, రాష్ట్రపతి ఎన్నికకు వచ్చేసరికి ఎన్నుకొనే విధానం పూర్తి భిన్నంగా ఉండటం వల్ల ప్రస్తుతం ఉన్న ఈవీఎంలు పనికిరావు. ఒక ఎమ్మెల్యేను, ఎంపీని ఎన్నుకోవాలంటే.. ఈవీఎంపై అభ్యర్థి పేరు పక్కన ఉండే బటన్ నొక్కితే సరిపోతుంది.
కానీ, రాష్ట్రపతి ఎన్నికలో అభ్యర్థి ప్రాధాన్య సంఖ్యను నమోదు చేయాలి. రాష్ట్రపతి అభ్యర్థులకు 1, 2, 3, 4, 5.. ఇలా ప్రాధాన్య క్రమంలో నంబర్లు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఈవీఎంలు దానికి తగ్గట్టు తయారు చేసి లేవు. దానికోసం ప్రత్యేక టెక్నాలజీని రూపొందించాలి. దీంతో రాష్ట్రపతి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ విధానాన్నే ఎన్నికల సంఘం కొనసాగిస్తున్నది.