హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో 1,022 గురుకుల పాఠశాలలు (Gurukula Schools) ఏర్పాటుచేసిన కేసీఆర్ (KCR).. తెల్లకోటు విప్లవాన్ని తీసుకొచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు (KTR) గుర్తుచేశారు. ధాన్యం ఉత్పత్తితోపాటు డాక్టర్ల ఉత్పత్తిలోనూ తెలంగాణను నంబర్‌వన్‌గా నిలిపారని ప్రశంసించారు. ఈరోజు వేలమంది గురుకుల పాఠశాలల విద్యార్థులు ఇంజినీర్లు, లాయర్లు, డాక్టర్లు ఇతర అనేక వృత్తుల్లోకి విజయవంతంగా ప్రవేశిస్తున్నారంటే అది కేసీఆర్ దార్శనికత వల్లేనని చెప్పారు. జహీరాబాద్‌లోని ఒక్క గురుకుల సూల్ నుంచే 16మంది మెడికల్ కాలేజీల్లో (Medical Colleges) సీట్లు సాధించి ఎంబీబీఎస్ విద్యను అభ్యసిస్తుండటం గర్వకారణమని, ఈ ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దకుతుందని పేర్కొన్నారు. జహీరాబాద్‌లోని తెలంగాణ మైనారిటీ గురుకులంలో చదివి ఎంబీబీఎస్ సీటు సాధించిన మైనార్టీ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను తెలంగాణభవన్‌లో ఆదివారం కేటీఆర్, హరీశ్‌రావు శాలువాతో సత్కరించారు. అనంతరం విద్యార్థులకు స్టెతస్కోప్‌లు, ఆఫ్రాన్లు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మాజీ మంత్రి హరీశ్‌రావు ఉమ్మడి మెదక్ జిల్లాను, రాష్ట్రంలో వైద్య. ఆరోగ్యరంగాన్ని అద్భుతంగా ముం దుకు తీసుకెళ్లారని కొనియాడారు.
2014లో కేవలం నాలుగు మెడికల్ కాలేజీలు ఉంటే కేసీఆర్ చొరవతో ఈరోజు 34 మెడికల్ కాలేజీలు అయ్యాయని కేటీఆర్ వివరించారు. మంచి విద్యావకాశాలు కల్పిస్తే, ప్రతి ఒక పేద తల్లిదండ్రీ తమ బిడ్డలకు విద్య అందించేందుకు సంసిద్ధంగా ఉంటారని కేసీఆర్ గతంలోనే చెప్పారని గుర్తుచేశారు. ఆ తల్లిదండ్రుల కల నెరవేర్చే విధంగా, ఒక ఆటోడ్రైవర్ కుమార్తె, ఒక జర్నలిస్టు కుమార్తె, ఒక రైతు బిడ్డ తమ కుటుంబంలో మొట్టమొదటి మనిషిని డాక్టర్ అవుతున్నానని చెప్తుంటే, ఈ ఘనత కచ్చితంగా కేసీఆర్‌కు, ఆయన విజన్‌కు దకుతుందని అన్నారు. ‘డాక్టర్లు అయిన మీరందరూ మీ తల్లిదండ్రుల పేర్లు, తెలంగాణ పేరు నిలబెట్టాలి. ఒక దీపంతో ఇంకొక దీపాన్ని వెలిగించి చీకట్లను తరిమి వేసినట్టుగా, ఈరోజు ప్రభుత్వ సహకారంతో డాక్టర్లుగా మారిన మీరంతా ఇతరులకు సహాయం చేయాలి. గత ప్రభుత్వమే మీ తల్లీదండ్రీ అయి అన్ని రకాల విద్యా సౌకర్యాలు కల్పించి డాక్టర్లుగా తీర్చిదిద్దిన అంశాన్ని ఎప్పటికీ గుర్తుంచుకొని పేదలకు సహాయం చేయాలి. మీరంతా మీ జీవితాల్లో స్థిరపడిన తర్వాత సాధ్యమైనంత ఎకువమంది పేదవారికి సహకారం అందించేలా కృషి చేయాలి’ కేటీఆర్ ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ శివకుమార్, పార్టీ కార్యదర్శి డాక్టర్ చెరుకు సుధాకర్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, ఉపాధ్యక్షుడు తుంగబాలు, రంగనేని అభిలాశ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కేసీఆర్ గురుకుల పాఠశాలలు ఏర్పాటుచేసి మైనార్టీలకు నాణ్యమైన విద్య అందించారని మాజీ మంత్రి హరీశ్‌రావు గుర్తుచేశారు. మైనార్టీ గురుకుల విద్యాసంస్థల వల్ల మైనార్టీలకు ఎంత లాభం జరిగిందనేది మైనార్టీలకే బాగా తెలుసునని పేర్కొన్నారు. మైనార్టీ వెల్ఫేర్ సూల్లో చదివి తల్లిదండ్రుల, కేసీఆర్ కలలను నిజం చేసిన విద్యార్థులను సన్మానించుకోవడం ఎంతో సంతోషంగా ఉన్నదని చెప్పారు. దేశంలోని ఎక్కడా లేని విధంగా 203 మైనార్టీ గురుకులాలను కేసీఆర్ ఏర్పాటుచేశారని గుర్తుచేశారు. ఈరోజు తెలంగాణ భారతదేశానికి ఒక దిక్సూచిగా మారిందని చెప్పారు.
‘మేము ఈ రోజు ఎంబీబీఎస్ సీటు సాధించామంటే దానికి కారణం కేసీఆర్. ఆయనకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం’ అని ఇమామ్‌గా పనిచేసే శంషాల్ ఖమర్ కుమార్తె తహసీన్ ఖమర్ చెప్పారు. ‘నీట్లో 444 మార్కులు రావడంతో వనపర్తి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీటు సాధించాను. మైనార్టీ గురుకులాల్లో మమ్మల్ని సొంత పిల్లల్లాగా చూసుకున్నారు. ఫ్రీగా కోచింగ్ ఇచ్చారు. కేసీఆర్‌కి ధన్యవాదాలు’ అని తెలిపారు.
‘మేము అయిదుగురం అకచెల్లెళ్లం. ఒక తమ్ముడు. మా తండ్రి రైతు. తినడానికి కూడా చాలా కష్టంగా ఉండేది. అలాంటి మేము ఫీజులు కట్టి సూళ్లలో చదవలేకపోయాం. కేసీఆర్ నిర్మించిన మైనార్టీ గురుకులాల వల్లే నేను చదవగలిగాను. ఈరోజు డాక్టర్ చదువు కూడా చదువుతున్నాను. జహీరాబాద్ మైనార్టీ గురుకులంలో ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివాను. మంచి విద్యాబోధన అందించిన కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు’ అని రైతు కుమార్తె తెలిపారు.
2016లో జహీరాబాద్ మైనార్టీ గురుకులంలో అడ్మిషన్ పొంది 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉచితంగా చదువుకొని వనపర్తి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఫ్రీ ఎంబీబీఎస్ సీటు సాధించడం గర్వంగా ఉన్నదని జర్నలిస్ట్ కుమార్తె ప్రియా ఏంజెల్ తెలిపారు. ‘మా నాన్న జర్నలిస్టు. సరైన వేతనం లేక ప్రైవేట్ స్కూల్లో చదివించడానికి ఇబ్బంది పడేవారు. ఆయనను గుండెజబ్బు వేధించేది. కొన్ని సమస్యల వల్ల ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండేవాళ్లం. కేసీఆర్ నిర్మించిన గురుకులం మా జీవితాలను మార్చేసింది’ అని ప్రియా ఏంజెల్ పేర్కొన్నారు.
ఎంబీబీఎస్ సీటు సాధించిన పేదింటి బిడ్డలు మాట్లాడుతుంటే వాళ్ల తల్లిదండ్రుల కండ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. పిల్లలు ప్రయోజకులైనప్పుడు తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు. అంతకుమించిన ఆనందం తల్లిదండ్రులకు ఉండదు. అందులో కేసీఆర్ పాత్ర ఉన్నందుకు ఎంతో సంతోషపడుతున్నాం. మా గుండెలు ఉప్పొంగుతున్నాయి.
కేసీఆర్ ప్రవేశపెట్టిన మైనార్టీ గురుకులాలు తమ జీవితాలను మార్చేశాయని ఎంబీబీఎస్ సీటు సాధించి ఆటో డ్రైవర్ ఎండీ ఇబ్రహీం కుమారుడు ఒబేద్ చెప్పారు. ‘ఎంబీబీఎస్ సీటు సాధించడం ఎంతో సంతోషంగా ఉన్నది. దేశంలో ఎకడా లేని విధంగా మైనార్టీలకు గురుకులాలు నిర్మించి మాకు చదువు చెప్పడం మా అదృష్టం. 2016లో మైనార్టీ గురుకులాల్లో అడ్మిషన్ పొంది ఈరోజు ఎంబీబీఎస్ సీటు సాధించామంటే అది కేసీఆర్ వల్లే’ అని పేర్కొన్నారు.