ఖమ్మం, అక్టోబర్ 5: సీఎం కేసీఆర్, రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ సహాయ, సహకారాలతో ఖమ్మం నగరాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశామనిరవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్(Minister Puvvada Ajaykumar) అన్నారు. గురువారం ఆయన ఖమ్మం నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నిర్మాణం పూర్తి చేసుకున్న అభివృద్ధి పనులను ప్రారంభించారు.
అనంతరం నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో పలువురు లబ్ధిదారులకు గృహలక్ష్మి మంజూరు పత్రాలు అందించారు. పలుచోట్ల నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాల్లో మాట్లాడారు. ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధికి నిబద్ధత, చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే 2 వేల మందికి డబుల్ బెడ్ రూం ఇండ్లు అప్పగించామన్నారు.
అలాగే అర్హులైన వారికి గృహలక్ష్మి మంజూరు పత్రాలు అందజేస్తున్నామన్నారు. ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి జీవో 58 ప్రకారం ఇండ్ల పట్టాలు అందజేస్తున్నామన్నారు. నగరంలోని ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీరు అందిస్తున్నామన్నారు. గతంలో నగరంలో తీవ్ర నీటి ఎద్దడి ఉండేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే నీటి సమస్యకు పరిష్కారం దొరికిందన్నారు.
రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరం తర్వాత అంతటి ప్రగతి సాధించిన నగరం ఒక్క ఖమ్మమేనని స్పష్టం చేశారు. మున్ముందు మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామన్నారు. ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని, బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమన్నారు.
ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఖమ్మం నగర మేయర్ నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, నగరపాలకసంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.