KTR | నీళ్లున్నా ఇవ్వకుండా రైతులకు కాంగ్రెస్ సర్కార్ ఇబ్బంది పెడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కన్నెపల్లి నుంచి నీటిని విడుదల చేస్తే లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చని తెలిపారు. వ్యవసాయానికి నీళ్లివ్వాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి తమను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
కన్నెపల్లి నుంచి నీరు వృథాగా సముద్రంలోకి పోతుందని కేటీఆర్ తెలిపారు. కన్నెపల్లి వద్ద నీటి లభ్యతను ప్రజలకు చూపించేందుకు వెళ్తుంటే తమను అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. మేడిగడ్డతో సంబంధం లేకుండా కన్నెపల్లి నుంచి కూడా నీళ్లు ఇవ్వవచ్చని చెప్పారు. కన్నెపల్లి సందర్శనకు వెళ్తుంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. సాగునీరు ఇస్తే యూరియా ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వం భయపడుతుందని తెలిపారు. పంట బాగా పండితే ధాన్యం మద్దతు ధర ఇచ్చి కొనాల్సి వస్తుందని భయపడుతుందని అన్నారు.
హైదరాబాద్ నుంచి కన్నెపల్లికి చేరుకునేందుకు 4 గంటల సమయం పడుతుందని కేటీఆర్ తెలిపారు. కానీ తమను పెంబర్తి, జనగామ, ఘన్పూర్, పరకాల, భూపాలపల్లి, కాటారం, మహదేవ్‌పూర్‌లో అడ్డుకున్నారని పేర్కొన్నారు. అడుగడుగునా తమను అడ్డుకున్నారని చెప్పారు. పైనుంచి ఆదేశాలు ఉన్నాయని పోనివ్వమని పోలీసులు అడ్డుకున్నారని వివరించారు. ఎల్‌నినో, వర్షాభావంతో ప్రజలు బాధపడుతున్నారని వారికి వివరించామని తెలిపారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు పునాది పడిన గడ్డ వద్ద కూర్చున్నామని అన్నారు. రాజకీయ కక్ష తీర్చుకునేందుకు ఇక్కడకు రాలేదని స్పష్టం చేశారు.
దశాబ్దాలుగా నీళ్ల కోసం పోరాటాలు జరిగాయని కేటీఆర్ గుర్తుచేశారు. గోదావరి నుంచి వేలాది టీఎంసీలు సముద్రంలో కలుస్తూనే ఉన్నాయని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల అంశాలపై పోరాటం సాగిందని పేర్కొన్నారు. తెలంగాణలో భౌగోళికంగా గోదావరి, కృష్ణా నదులు పారుతున్నాయని చెప్పారు. నీళ్లు కిందున్నాయి.. భూములు పైనున్నాయని తెలిపారు. కింద ఉన్న నీటిని లిఫ్ట్ ద్వారా తరలిస్తే తప్ప నీళ్లు రాని పరిస్థితి ఉందని అన్నారు. అయితే ఆ పల్ల ప్రాంతాల నుంచి ఎగువకు నీటిని తరలించిన ఘనత కేసీఆర్‌ది అని ఆయన కొనియాడారు. గోదావరి నీటిని ఒడిసిపట్టి ఎగువ ప్రాంతానికి తీసుకెళ్లాలని పరిశోధించి బృహత్తర ప్రణాళిక చేసింది కేసీఆర్ ప్రభుత్వమని తెలిపారు.
తుమ్మిడిహట్టి డ్యాం ఎత్తు పెంపు ప్రయత్నం చేయలేదని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో అప్పటి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను సంప్రదించామని తెలిపారు. 150 మీటర్ల ఎత్తు పెంచితే నా ప్రాంతం మునుగుతుందని కేటీఆర్ ఆయనకు వివరించారని పేర్కొన్నారు. తుమ్మడిహట్టి వద్ద ఎత్తు పెంచవద్దని ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డికి ఉత్తరం రాశారని చెప్పారు. తెలంగాణ ఏర్పడి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడున్నరేళ్ల స్వల్ప సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును కట్టామని తెలిపారు. ఎంతటి కరువులోనైనా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలని అధికారులు సూచించారని పేర్కొన్నారు. మేడిగడ్డ వద్ద బరాజ్ కట్టుకున్నామని చెప్పారు.