Tata Sons AGM : ప్రముఖ వ్యాపార సంస్థ టాటా సన్స్ ఏజీఎం (యాన్యువల్ జనరల్ మీటింగ్) వాయిదా పడింది. తగినంత కోరం లేకపోవడంతో ఏజీఎం వాయిదా పడింది. ఆగష్టు 18, మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బాంబే హౌజ్‌లో ఏజీఎం జరగాల్సి ఉంది. టాటా సన్స్ సంస్థ 1917లో ఏర్పాటుకాగా, వందేళ్లలో ఇలా ఏజీఎం వాయిదా పడటం ఇదే మొదటిసారి. ఏజీఎంకు ప్రస్తుత టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ ప్రత్యక్షంగా హాజరయ్యారు. ఆయన త్వరలోనే ఈ బాధ్యతల నుంచి తప్పుకోనున్న సంగతి తెలిసిందే.
ఆయనతోపాటు సౌరభ్ అగర్వాల్, అనితా మారంగోలి నేరుగా హాజరుకాగా.. మరికొందరు వర్చువల్‌గా హాజరయ్యారు. ఇక, కోరం లేకపోవడానికి ప్రధాన కారణం టాటా సన్స్‌లో సభ్యత్వం ఉన్న సర్ రతన్ టాటా ట్రస్ట్ (ఎస్‌ఆర్‌టీటీ)తోపాటు, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ తరఫున సభ్యులు లేకపోవడమే. ఈ రెండు ట్రస్టుల నుంచి సభ్యుల్ని ప్రతిపాదించాల్సి ఉంది. కానీ, ఇటీవల ఈ ట్రస్టులను పర్యవేక్షించే ప్రభుత్వ అథారిటీ అయిన ‘ద మహారాష్ట్ర చారిటీ కమిషనర్’ విధించిన రెగ్యులేటరీ నిబంధనల వల్ల సభ్యుల్ని నామినేట్ చేయలేదు. సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ కూడా ఈ విషయాన్ని ముందే తెలిపింది. రెండు ట్రస్టుల తరఫున ఉమ్మడి సభ్యుడు బోర్డులో లేకపోవడంతో కోరమ్ సరిపోలేదు. దీంతో ఏజీఎం వాయిదాపడింది.
అయితే, ఈ విషయం టాటా సన్స్ సభ్యులుగా ముందుగానే అవగాహన ఉందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. టాటా సన్స్ సంస్థ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ప్రకారం కంపెనీ కార్పొరేట్ వ్యవహారాలపై నిర్ణయం తీసుకోవాలంటే ఏజీఎంలో తగిన కోరమ్ ఉండాల్సిందే. ఇండియాస్ కంపెనీ యాక్ట్ ప్రకారం ప్రతి సంస్థ తప్పనిసరిగా ఏడాదికోసారి ఏజీఎం నిర్వహించాల్సిందే. అది కూడా ఒక ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు నిర్ణీత కాల వ్యవధిలో ఏజీఎం నిర్వహించాలి. సాధారణ పరిస్తితుల్లో ఇలాంటి వాటిని రద్దు చేయరు. అత్యవర పరిస్థితుల్లో మత్రమే నిబంధలకు అనుగుణంగా ఏజీఎం రద్దు చేయాలి. ఈ రోజు జరగాల్సింది కంపెనీ 108వ ఏజీఎం.
మళ్లీ ఏజీఎం ఎప్పుడు నిర్వహించాలి అనే అంశంపై బోర్డు సభ్యులతో చైర్మన్ సంప్రదించిన తర్వాత నిర్ణయిస్తారు. టాటా సన్స్ సంస్థలో సర్ రతన్ టాటా ట్రస్ట్ (ఎస్‌ఆర్‌టీటీ)తోపాటు, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ వాటాలు కలిపి 51.5 శాతం ఉన్నాయి. అంటే, సంస్థలో ఈ రెండు ట్రస్టులే అత్యధిక వాటా కలిగి ఉన్నాయి. ఈ రెండు ట్రస్టులు కలిసి ఉమ్మడిగా సభ్యుడిని నామినేట్ చేసిన తర్వాత కోరమ్ జరిగే అవకాశం ఉంది.