ఇల్లెందు, మే 9 : ఇందిరమ్మ ఇల్లు వస్తదని ఉన్న ఇల్లు కూల్చుకున్నామని, ఇప్పుతు తమ పరిస్థితి ఏమిటని పలువురు పేదలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం చంద్రుతండా పరిధిలోని రాజుతండా, చంద్రుతండా, సూర్యాతండా, గోప్యాతండాకు చెందిన గిరిజనులు శుక్రవారం చంద్రుతండా పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు గిరిజనులు మాట్లాడుతూ.. తమ తండాల్లో అర్హులైన వారికి ఇండ్లు కేటాయించకుండా..
అనర్హులకు, ఆర్థికంగా ఉన్న వారికి ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఇందిరమ్మ కమిటీలు ఉన్నా నిరుపేదలకు న్యాయం జరగడం లేదని మండిపడ్డారు. ఇంటికి రూ.50 వేల చొప్పున కమిటీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. తొలిజాబితాలో రాజుతండాకు చెందిన జర్పుల రమేశ్-లలిత దంపతుల పేరుండటంతో ఇల్లు వస్తుందనే ఆశతో ఉన్న గుడిసెను తొలగించుకున్నారని, ఇప్పుడు ఇండ్ల జాబితాలో పేరు లేకపోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడిందని ఆందోళన వ్యక్తంచేశారు. ఇలా ఎంతో మంది నిరుపేదలు ఇండ్లు కూల్చుకొని ఎదురుచూస్తున్నా అధికారులు, ప్రభుత్వం కనికరం చూపడం లేదని మండిపడ్డారు.