Kodangal | కొడంగల్, జనవరి 17: ‘ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం భూములిచ్చి మా బతుకులు ఆగం చేసుకోవాలా?’ అని వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ దుద్యాల మండలం పోలెపల్లి రైతులు ప్రశ్నించారు. దుద్యాల మండల పరిధిలో ప్రభుత్వం ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు భూసేకరణ చేపడుతున్నది. ఇదివరకే అసైండ్ భూములను రూ.20 లక్షలతోపాటు ఇంటి స్థలం వంటి హామీలతో భూములను స్వాధీనం చేసుకుంది. ఇందులో భాగంగా పట్టా భూముల సేకరణకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
పట్టా భూములకు సంబంధించిన రైతులు భూములను అప్పగించేందుకు ససేమిరా అంటున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు భూములిచ్చే ప్రసక్తే లేదని స్పష్టంచేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎకరాకు ఒక కోటికి పైగా ధర పలుకుతుందని ఆ మేరకు చెల్లిస్తే భూములిచ్చే విషయాన్ని ఆలోచిస్తామని రైతులు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం వారు వికారాబాద్ కలెక్టరేట్‌కు వెళ్లి కలెక్టర్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.