హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం పరిపాలన అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం సంస్కరణలు తీసుకువచ్చిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. వాటి ఫలితంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలువుతున్నాయన్నారు. పరేడ్ గ్రౌండ్లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘భూవివాదాల పరిష్కారానికి ప్రభుత్వం తగిన సంస్కరణలు తెచ్చింది. భూ రికార్డులు ప్రక్షాళనచేసి, రైతులకు కొత్త పాస్ పుస్తకాలు అందించింది. భూ రికార్డుల్లో పారదర్శకత కోసం ధరణి పోర్టల్ రూపొందించింది. దీంతో ప్రజలకు ప్రయాస లేకుండా, సులభతరంగా నిమిషాల వ్యవధిలో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ జరుగుతున్నది. ధరణి పోర్టల్ భూ పరిపాలనలో నవశకానికి నాంది పలికింది’ అన్నారు.
రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించడంతో పాటు కొత్త డివిజన్లు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. ‘మా గూడెంలో మా పాలన – మా తండాలో మా పాలన’ అనే ఎస్టీ సామాజిక వర్గాల చిరకాల వాంఛకు అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని గూడెంలు, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చుకున్నాం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 3,146 మంది గిరిజనులు కొత్తగా సర్పంచులయ్యారు. ప్రభుత్వం ఈ పంచాయతీలకు సొంత భవనాలను కూడా నిర్మిస్తున్నది. 30 జిల్లాల్లో అన్ని హంగులతో అధునాతన వసతులతో సమీకృత కలెక్టర్ కార్యాలయాలను నిర్మిస్తున్నది. ఇందులో ఇప్పటికే కొన్ని ప్రారంభమయ్యాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో శాసనసభ్యుల కోసం క్యాంపు కార్యాలయాలు నిర్మాణమయ్యాయి’ అని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని ప్రతిబింబించే విధంగా ప్రభుత్వం నూతన సచివాలయ భవనాన్ని ప్రభుత్వం నిర్మిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. ‘ఏడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, ఏడు అంతస్తుల భవనం రూపుదిద్దుకుంటోంది. దీన్ని ఈ ఏడాదిలోనే ప్రారంభించడానికి వీలుగా నిర్మాణపనులు అత్యంత వేగంగా సాగుతున్నాయి. ఈ భవన నిర్మాణం పూర్తయితే, ప్రజలకు ఇంకా మెరుగయిన సేవలు అందుబాటులోకి వస్తాయి’ అన్నారు.
పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన యాదాద్రి క్షేత్రాన్ని అత్యంత రమ్యంగా, వైభవంగా తీర్చిదిద్దుకున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ‘వెయ్యి ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో యాదాద్రి టెంపుల్ సిటీ నిర్మాణం పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. యాదాద్రి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం చేసేందుకు భక్తులు విరివిగా విరాళాలు సమర్పిస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర పుణ్యక్షేత్రాలను కూడా ఇదే విధంగా తీర్చిదిద్దుకుందామన్నారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన జలాశయాలన్నీ ప్రకృతి రమణీయమైన ప్రదేశాలలోనే ఉండడం మన అదృష్టం. ప్రాజెక్టుల పరిధిలో ఉన్న జలాశయాలన్నింటినీ ప్రభుత్వం అద్భుతంగా తీర్చిదిద్దుతూ, పర్యాటకులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. ఇందులో భాగంగా కాళేశ్వరం సర్క్యూట్ టూరిజం అభివృద్ధికోసం ఇటీవల బడ్జెట్లో రూ.1500కోట్లు కేటాయించింది’ అని చెప్పారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి, ప్రభుత్వం ఏర్పడిన తరువాత హైదరాబాద్ మహానగరం బ్రాండ్ ఇమేజ్ మరింతగా పెరిగిపోయిందని సీఎం కేసీఆర్ అన్నారు. ‘అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్ ఐపాస్ చట్టం, నిరంతర విద్యుత్, నీటి సరఫరా, రాష్ట్రంలో పరిఢవిల్లుతున్న శాంతిభద్రతలు, సుస్థిర ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న ప్రోత్సాహంతో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. పారిశ్రామిక రంగంలో 8ఏళ్లలో మొత్తం 2 లక్షల 32 వేల 111 కోట్ల రూపాయల పెట్టుబడులు తరలివచ్చాయి. 16 లక్షల 48 వేల 956 ఉద్యోగాల కల్పన జరిగింది’ అన్నారు.
ఐటీ రంగంలో తెలంగాణ అప్రతిహతంగా ముందుకు దూసుకుపోతుందని సీఎం తెలిపారు. ‘1500కు పైగా పెద్ద, చిన్న పరిశ్రమలు నేడు హైదరాబాద్‌లో కొలువై ఉన్నాయి. ప్రపంచ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, ఐబీఎం కాగ్నిజెంట్, అమేజాన్, ఒరాకిల్ వంటి అనేక సంస్థలు హైదరాబాద్ నుంచి తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. తెలంగాణ ఐటీరంగ ఎగుమతుల విలువ 1 లక్షా 83 వేల 569 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. ఐటీ రంగంలో మనం సాధించిన అభివృద్ధి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. భారత ప్రభుత్వ పరిపాలనా సంస్కరణల శాఖ రూపొందించిన సుపరిపాలన సూచిలో మన రాష్ట్రం పరిశ్రమలు-వాణిజ్య రంగంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ 8ఏళ్లలో ఐటీ రంగంలో నూతనంగా 7 లక్షల 78 వేల 121 ఉద్యోగాల కల్పన జరిగింది. పారిశ్రామిక, ఐటీ రంగాల్లో కలిపి 24 లక్షలకుపైగా ఉద్యోగాల కల్పన జరిగింది’ అని వివరించారు.
తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యాన్ని పంచుకున్న ఉద్యోగులతో ప్రభుత్వం స్నేహపూర్వకంగా వ్యవహరిస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. ‘రాష్ట్రం అవతరించిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఇంక్రిమెంట్‌ను మంజూరు చేసింది. ఉద్యోగులకు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 43 శాతం ఫిట్మెంట్ అందించింది. కరోనా కష్టాలు వెంటాడుతున్నా సరే కొత్త పీఆర్సీలో 30 శాతం ఫిట్మెంట్ ప్రకటించి అమలుచేస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, తదితర పద్ధతుల్లో పనిచేస్తున్న యావత్ ప్రభుత్వ సిబ్బందికి ఈ 30 శాతం వేతనం పెంపును ప్రభుత్వం వర్తింపచేసింది. నేడు దేశంలో అత్యధిక స్థాయి వేతనం పొందుతున్న ఉద్యోగులు ఎవరంటే, వారు మన తెలంగాణ ఉద్యోగులని సగర్వంగా తెలియజేస్తున్నాను’ అన్నారు.
సమైక్యపాలనలో ధ్వంసమైన వృత్తులకు ప్రభుత్వం ఆర్థిక ప్రేరణనిచ్చి ప్రభుత్వం ఆదుకుంటుందని కేసీఆర్ అన్నారు. ఇందులో భాగంగా మత్స్యకారుల కోసం ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేస్తుందని తెలిపారు. ‘రాష్ట్రంలో అవకాశమున్న ప్రతి చోటా చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నది. కాళేశ్వరం,
తదితర ప్రాజెక్టుల నిర్మాణం తరువాత రిజర్వాయర్లు నిండి చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. చేపల పెంపకానికి విస్తృత అవకాశం లభిస్తున్నది. దీంతో రాష్ట్రంలో మత్స్య సంపద పెరిగి, మత్స్యకారుల ఆదాయం గణనీయంగా పెరిగింది. వారి జీవితాలలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి చేపల దిగుమతి కూడా తగ్గింది. మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్రంలోని వివిధ జలాశయాల్లో ప్రభుత్వమే రొయ్యలు, చేపపిల్లను వదలి మత్య సంపదను అభివృద్ధి చేస్తోంది. గంగపుత్ర, ముదిరాజ్ కులాలవారికి ఉచితంగా చేపలు పట్టుకొనే అవకాశం కల్పించింది.
రాష్ట్రంలో గొల్ల కుర్మల సంక్షేమం కోసం భారీ ఎత్తున చేపట్టిన గొర్రెల పంపిణీ సత్ఫలితాలనిచ్చిందని సీఎం కేసీఆర్ అన్నారు. ‘నేడు రాష్ట్రంలో గొర్రెల మందలు పెద్ద సంఖ్యలో పెరిగి, మాంసం ఉత్పత్తిలో తెలంగాణ స్వావలంబన సాధించింది. ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో గొల్ల కురుమలు మన రాష్ట్రాన్ని గొర్రెల పెంపకంలో నంబర్ వన్‌గా నిలిపారు. వారి ఆదాయం కూడా బాగా పెరిగింది. గౌడ సోదరుల సంక్షేమం కోసం తాటి చెట్లపై పాత పన్ను బకాయిలు మాఫీ చేయడమే కాకుండా, శాశ్వతంగా చెట్ల పన్ను రద్దు చేసింది. మరణించి, అంగవైకల్యానికి గురైన గీత కార్మికులకు ఇచ్చే పరిహారాన్ని తెలంగాణ ప్రభుత్వం రూ.50వేల నుంచి రూ.5 లక్షలకు పెంచిందన్నారు. మద్యం దుకాణాల కేటాయింపులో గౌడ సోదరులకు 15 శాతం రిజర్వేషన్ ఇస్తూ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం వల్ల ఇప్పటివరకు 393 మంది గౌడ సోదరులకు లైసెన్సులు లభించాయి. తాటిచెట్ల నుంచి ఉత్పత్తి అయ్యే నీరాను సాఫ్ట్ డ్రింక్‌గా ప్రవేశపెట్టడం కోసం ప్రభుత్వం ప్రత్యేక పాలసీని అమలుచేస్తోంది’ అన్నారు.
దోబీఘాట్లకు, లాండ్రీలకు, సెలూన్లకు ప్రభుత్వం 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. నేత కార్మికులకు బతుకమ్మ చీరల తయారీ పనిని అప్పగించటంతోపాటు నూలు, రసాయనాలపై 50 శాతం సబ్సిడీ ఇస్తున్నది. నేతన్నలకు కూడా రైతన్నల మాదిరిగానే
రూ.5లక్షల బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ వృత్తులకు ప్రత్యేక ప్రేరణనిస్తూ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఆయా వర్గాలవారి ఆదాయం గణనీయంగా పెరగడం సంతోషాన్నిస్తున్నదన్నారు.
తెలంగాణ ప్రాంతం సర్వమతాల, సంస్కృతుల సంగమస్థానం. ప్రభుత్వం సకలమతాలను సమభావంతో ఆదరిస్తున్నది. తెలంగాణా గంగా జమునా తెహజీబ్‌ను కొనసాగిస్తున్నది. రాష్ట్రం ఏర్పడేనాటికి తెలంగాణ ప్రాంతంలో ఉన్న మైనారిటీ గురుకులాల సంఖ్య కేవలం 12 మాత్రమే. ప్రభుత్వం కొత్తగా 192 మైనారిటీ గురుకులాలను ఏర్పాటుచేసింది. మైనారిటీ బాలికల కోసం 50 శాతం గురుకులాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. దీంతో మైనారిటీ బాలికల ఎన్రోల్మెంట్ గతంలో 18 శాతంగా ఉంటే, నేడది 42 శాతానికి పెరిగింది. బతుకమ్మ బోనాలు, రంజాన్, క్రిస్మస్ వంటి పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నది. సకల జనులలో సంతోషాన్ని నింపుతున్నది’ అన్నారు.