CM KCR | (సర్కోలి నుంచి నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి) : భారత రాష్ట్ర సమితి అంటే ప్రజల టీమ్.. ఇది ఏదోఒక పార్టీకి ‘ఏ’ టీమ్‌గానో.. ‘బీ’ టీమ్‌గానో ఉండే ప్రసక్తే లేదు. ఇది ప్రజల టీమ్‌గా ఉంటుంది. బాధితుల టీమ్‌గా ఉంటుంది. పీడితుల పక్షాన ఉంటుంది.. రైతుల పక్షాన ఉంటుంది.. దళితుల పక్షాన నిలబడుతుంది.. వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటుంది. మహిళలకు రక్షణగా నిలబడుతుంది అని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. భారత ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు.. భారతదేశ పరివర్తన బీఆర్ఎస్ లక్ష్యమని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ అంటే ఒక రాజకీయ పార్టీ కాదని, ఇదో మిషన్ అని పునరుద్ఘాటించారు. మంగళవారం మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా పండరిపూర్ నియోజకవర్గం పరిధిలోని సర్కోలి గ్రామంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
పండరీపూర్‌కు చెందిన ప్రముఖ నాయకుడు భగీరథ్ బాల్కేతోపాటు ఆయన అనుచరులు వందలాది మంది కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. దేశంలోని 40 శాతం మం ది రైతులు సంఘటితమైతే మార్పును ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. దళితులు, పీడితులు, అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేయాల్సిన ప్రభుత్వాలు.. ఆ వర్గాలను విస్మరించడం వల్లే దేశానికి ఈ గతి పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితిని మార్చేందుకే బీఆర్ఎస్ పుట్టిందని పేర్కొన్నారు. అనతికాలంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో పురోగమిస్తున్నపుడు దేశంలోని మిగిలిన రాష్ర్టాలు ఎందుకు పురోగమించడంలేదని ప్రశ్నించారు. చిత్తశుద్ధిలేని పాలకులు, విధానరహిత పాలనే దీనికి కా రణమని విమర్శించారు. నేతలను దివాలా తీయించి.. రైతులకు దీపావళి తేవడమే తమ లక్ష్యమని తేల్చి చెప్పారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనేది తమ నినాదం మాత్రమే కాద ని, అది తమ విధానమని తెలిపారు. మహారా ష్ట్ర పవిత్ర భూమికి.. పవిత్ర పుణ్యక్షేత్రం పండరీనాథుడి చరణాలకు నమస్కారం అని అన్నా రు. కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
భారతదేశ లక్ష్యం ఏమిటి? అది తన లక్ష్యానికి చేరుతున్నదా? ఈ విషయంలో ఇప్పటివరకు ఎవరికీ సమాధానం దొరకలేదు. ఎవ్వరూ సమాధానం చెప్పే ప్రయత్నం చేయడంలేదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్ల్లు గడుస్తున్నా ఇంకా అనేక వర్గాలు అంధకారంలోనే ఉన్నాయి. ఆ వర్గాలు ఎప్పుడు వెలుగులోకి రావాలి? మనకంటె చిన్నవైన సింగపూర్, మలేషియా వంటి దేశాలు అభివృద్ధిలో మనకంటే ఎంతో ముందున్నాయి. అంతెందుకు హిమాలయాలకు ఆవల ఉన్న చైనా 1982 వరకు మనకంటే వెనుకబడి ఉండేది. ఈ రోజు ఆదేశ స్థితి ఏమిటి? మనదేశంలో ఎన్నికల్లో గెలుపే లక్ష్యం గా మారింది. ఎన్నికలు వస్తాయి.. పోతాయి. గెలువాల్సింది పార్టీలు కాదు.. ప్రజలు. ఇటీవలే కర్ణాటకలో ఎన్నికలు జరిగాయి. అక్కడ బీజేపీ పోయి కాంగ్రెస్ గెలిచింది. ఏం మార్పు వచ్చింది? మహారాష్ట్రలో 50 ఏండ్ల్లు కాంగ్రెస్ పాలించింది. కొంతకాలం ఎన్సీపీ, మరికొంత కాలం బీజేపీ పాలించింది. ఇప్పుడు షిండే పాలిస్తున్నారు.
మహారాష్ట్ర ప్రజల జీవితాలు, రైతుల పరిస్థితి ఏమైనా మారిందా? తెలంగాణలో తక్కువ కాలంలోనే రైతులు సుఖంగా, సంతోషంగా ఉండేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టాం. ఇక్కడెందుకు సాధ్యమవ్వడంలేదు? తెలంగాణకంటే మహారాష్ట్ర ఎందులో తక్కువ? మహారాష్ట్రలో అన్నీ ఉన్నాయి. మహారాష్ట్రతో పోలిస్తే తెలంగాణ చాలా చిన్నది. అయినా నేడు దేశం గర్వంగా తెలంగాణ గురించి చెప్పుకొనేలా తయారు చేశాం. చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధించవచ్చు అనడానికి తెలంగాణ ఒక ఉదాహరణగా నిలిచింది. మహారాష్ట్రలో ఇది ఎందుకు సాధ్యం కాలేదు? తెలంగాణలో జరుగుతున్న పనులు మహారాష్ట్రలో జరిగితే ఈ రాష్ట్రం దివాలా తీస్తుందని కొత్త వాదన చేస్తున్నారు. చిత్తశుద్ధి, చేయాలన్న సంకల్పం ఉంటే కచ్చితంగా మార్పులు జరుగుతాయి. అనుకున్నది అనుకున్నట్టు చేస్తే నాయకులు దివాళా తీసి రైతులు దీపావళి జరుపుకుంటారు. అందు కోసమే బీఆర్ఎస్ మహారాష్ట్రలో అడుగుపెట్టిం ది. ఇదే విషయాన్ని నేను రెండుమూడు నెలల కింద నాందేడ్‌కు వెళ్లినపుడు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన. అయితే, ఇక్కడి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మహారాష్ట్రలో తెలంగాణ సీఎంకు ఏం పని అని అడిగారు.
తెలంగాణలో రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలను మహారాష్ట్రలో వందకు వంద శాతం అమలు చేస్తే నేను మహారాష్ట్రకు రానని చెప్పిన. కానీ, ఇప్పటివరకు మళ్లీ మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు. సంకల్పం ఉంటే సమాధానం వచ్చేది. సమాధానం రాకపోగా పండరిపురం రండి దర్శనం చేసుకోండి కానీ, రాజకీయాలు చేయవద్దు అంటే కుదరదు. ఈ విషయాన్ని పండరీనాథుడి సన్నిధిలోనే చెప్పేవాడిని. కానీ, ఇప్పుడు చెప్తున్న. మాపై వందల ఆరోపణలు చేసినా పట్టించుకోను. రైతులకు, ప్రజలకు అన్నాయం జరిగితే మాత్రం ఊరుకోబోం. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పెరుగుతున్న తీరును చూసి సహించలేక బీఆర్ఎస్ను బీజేపీకి ఏ టీం అని, బీ టీం అని చెప్తున్నారు. బీఆర్ఎస్ ఏ పార్టీకి ఏ టీం, బీ టీం కాదు. ముమ్మాటికీ మాది ప్రజల టీం, రైతుల టీం, దళితుల టీం, పీడితుల టీం.
మహారాష్ట్ర సుసంపన్నమైన నేల. అపారమైన వనరులున్న రాష్ట్రం. కానీ, రైతులు నేటికీ అనేక ఇబ్బందులు పడుతున్నారు. నాసిక్ నుంచి ముంబై వరకు రైతులు తమను ఆదుకోవాలంటూ పాదయాత్రలు చేస్తున్నారు. రైతుల ఆత్మహత్యలు లేని రోజు మహారాష్ట్రలో లేదు. రైతులకు విద్యుత్తు, నీళ్లు ఇవ్వడంలేదు. పంటలకే కాదు.. తాగేందుకు కూడా నీళ్లు దొరకడంలేదు. వారానికి ఒకరోజు కూడా తాగునీళ్లు దొరకడంలేదు. ఔరంగబాద్ (శంభాజీనగర్)లో వారానికి ఒకసారి నీళ్లు ఇస్తున్నారట. ఇదేక్కడి పద్ధతి? ఎందుకీ దుస్థితి? నీటి ప్రణాళికలు మన ప్రభుత్వాల వద్ద లేవు. దేశానికి సమగ్ర జలవిధానం అవసరం. మేం అధికారంలోకి వస్తే సమగ్ర జలవిధానం.. సమగ్ర విద్యుత్తు విధానాన్ని తీసుకువస్తాం.
అనతికాలంలోనే రైతు సమస్యల పరిష్కారానికి తెలంగాణ సర్కారు చర్యలు తీసుకొన్నది. రైతులకు 24 గంటలపాటు ఉచిత, నాణ్యమైన విద్యుత్తు ఇస్తున్నాం. ఎకరానికి ఏటా రూ.10 వేల చొప్పున రైతుబంధు పేరుతో పంటపెట్టుబడి అందిస్తున్నాం. ఏ కారణంతో రైతు చనిపోయినా రూ.5 లక్షల రైతు బీమా ఇస్తున్నాం. ఈ చర్యలతో రైతు ఆత్మహత్యలను తెలంగాణ నివారించగలిగింది. మీ పండరిపురం నుంచి కూడా రైతులు ఎవరైనా తెలంగాణ మాడల్ గురించి తెలుసుకోవాలంటే ఒకసారి వచ్చి చూడండి. భగీరథ్ బాల్కే రైతులు తెలంగాణలో పర్యటించేందుకు.. అక్కడి పథకాలను చూసేందుకు వస్తే అవసరమైన వసతి ఏర్పాట్లు చేస్తాం.
బీఆర్ఎస్ సాధారణ రాజకీయ పార్టీ కాదు. బీఆర్ఎస్ అంటే ఒక మిషన్. మిగతా రాజకీయ పార్టీలకు, బీఆర్ఎస్కు ఎంతో తేడా ఉన్నది. ప్రజలు ఆందోళనలు చేసిచేసి అలసిపోయారు. 75 ఏండ్ల్లుగా ప్రజలు పోరాటా లు చేస్తూనే ఉన్నారు. అయినా రైతుల కష్టా లు కడతేరలేదు. ప్రజల బాధలు తీరలేదు. దేశంలోని ఏ మూలన చూసినా ఇదే పరిస్థితి. ఇదేనా ప్రజాస్వామ్యం? దీని కోసమేనా మన స్వాతంత్య్ర సమరయోధులు కలగన్న ది? ఇందుకోసమేనా వాళ్లు మనకు స్వాతం త్య్రం తెచ్చింది? రాజకీయాల్లో ఈసారి ప్రజలు గెలవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది అసాధ్యం కాదు. ముమ్మాటికీ సాధ్యమే. ‘భారత్ పరివర్తనే బీఆర్ఎస్ మిషన్’. కేవలం మహారాష్ట్ర రాజకీయాలను.. పరిస్థితులే కాదు.. యావత్ దేశ గతిని మార్చటమే బీఆర్ఎస్ లక్ష్యం. భారత్ తన గమ్యాన్ని మర్చుకోనంత వరకు పరివర్తన చెందదు.
దేశంలో దళితుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నది. దళితులపై అన్యాయాలు.. అక్రమాలు ఎప్పటి వరకైతే ఆగవో అప్పటివరకు దేశం పరిస్థితి మారదు. శ్వేతజాతీయులు, రెడ్ ఇండియన్స్, నీగ్రోస్ ఇలా అమెరికాలోనూ ఘోరమైన జాతి అహంకారం ఉండేది. అమెరికా మొత్తం చైతన్యవంతమైంది. నల్లజాతీయు డు బరాక్ ఒబామాను అధ్యక్షుడిగా ఎన్నుకొని అమెరికా తన పాపాన్ని కడిగేసుకొన్నది. మనదేశంలోని దళితుల్లో అటువంటి చైతన్యం రావా లి. సమాజంలో దళితులు పీడితులు.. వంచితులుగా ఉన్నంత కాలం మనం కంటినిండా నిద్ర పోలేము. సమాజంలో ఒకరు కడుపునిండా తిని మరొకరు ఆకలితో ఉంటే పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఎస్సీ, ఎస్టీలు ఎంతకాలం తమ హక్కుల సాధన కోసం పోరాటం చేయాలి?
రైతులకు న్యాయం చేయటం కోసం తలాటీ (వీఆర్వో) వ్యవస్థను తెలంగాణలో రద్దు చేశాం. ఫలితంగా రైతులు, ఇతర వర్గాలకు ఉపశమనం కలిగింది. ఇక్కడా ఇలానే కావాల్నా? (సభా ప్రాంగణం మొత్తం ‘రద్దుచేయాలి. రద్దుచేయాలి’ పెద్దపెట్టున నినాదాలు మారుమోగాయి). తెలంగాణలో వీఆర్వో వ్యవస్థను రద్దుచేసి వారి పొట్టకొట్టలేదు. ఆ ఉద్యోగులను ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేశాం. భూమి రికార్డులన్నింటినీ డిజిటలైజ్ చేశాం. రైతులు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరంలేకుండా పోయింది. రైతుబంధు, రైతుబీమా, పంట కొనుగోళ్ల సొమ్ము, భూముల డిజిటలైజేషన్ ఇలా అనేక రకాలుగా ప్రయోజనం కలిగింది. డిజిటలైజ్ కావడంతో రైతుబీమా సొమ్ము నేరుగా రైతు బ్యాంకు ఖాతాలోనే పడుతున్నది. పంట కొనుగోళ్ల విషయంలోనూ పేచీ లేకుండా పోయింది. దేశంలోనేకాదు అమెరికాలో ఉన్నా.. ఆస్ట్రేలియాలో ఉన్నా.. తన భూమిని ఆన్లైన్లో చూసుకొనేలా ‘ధరణి’ పేరుతో అద్భుత సంస్కరణ తెచ్చాం. దీంతో అందరూ సంతోషంగా ఉన్నారు. డిజిటలైజేషన్ వల్ల 5 నుంచి 10 నిమిషాల్లోనే భూమి రిజిస్ట్రేషన్ పూర్తయ్యి.. పట్టాదార్ పాస్ బుక్ చేతికి వస్తున్నది. పాస్‌పోర్ట్ లెక్క అందమైన పాస్‌బుక్‌ను రైతులకు ఇచ్చాం. ఇటువంటి చర్యలు తీసుకోవటం వల్ల తెలంగాణ నుంచి ఒకప్పుడు బతుకుదెరువు కోసం వలసబాట పట్టిన వాళ్లు తిరిగొచ్చారు. భూ సంస్కరణల విషయంలో దేశంలో మరే రాష్ట్రంలో లేని విధమైన పారదర్శక విధానం ధరణి.
రైతులు తమ ఓటు తాము వేసుకోవాలి. గాడిదకు గడ్డి వేసి బర్రెకు పాలు పిండుతామం టే ఎట్లా? ఇన్నేండ్లు మన పేరుతో రాజకీయ పక్షాలు ఓట్లు వేయించుకొన్నాయి. ఈ పరిస్థితి మారాలి. రైతులు జంగ్ సైరన్ మోగించాలి. కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం ఇంకోళ్లను చేయమంటే చేస్తరా? మన హక్కుల కోసం.. మన భవిష్యత్తు కోసం మనం పోరాటం చెయ్యాలి. పండరిపురం నియోజకవర్గం నుంచి గతంలో పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన భగీరథ్ బాల్కీకి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఆయన తండ్రి భరత్ బాల్కీ గొప్ప నాయకుడు. మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. భగీరథ్ బాల్కేకి నా ఆశీస్సులు ఎళ్లకాలం ఉంటాయి. రాజకీయంగా అండదండలు అందిస్తాం. భగీరథ్ బాల్కే వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలువడం ఖాయం. గెలిచిన తర్వాత ఆయన ఎమ్మెల్యేగనే ఉండరు.. మంత్రి అవుతారు. ఆయన పేరులోనే భగీరథ్ ఉన్నది. ఈ ప్రాంతానికి నీళ్లు తెస్తారు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
తండ్రి చనిపోయిన నాకు సీఎం కేసీఆర్ తం డ్రిలాగా వచ్చారని భగీరథ్ బాల్కే అన్నారు. ‘మా నాన్న భరత్ బాల్కే పశ్చిమ మహారాష్ట్ర రైతుల బాగు కోసం పనిచేశారు. ఆయన మార్గా న్ని నేను అనుసరించాలని ప్రయత్నం చేస్తున్న క్రమంలో నాకు కేసీఆర్ రూపంలో తండ్రిలా వచ్చారు’ అని ఉద్వేగానికి లోనయ్యారు. తెలంగాణ ప్రజల జీవితాలను మార్చిన తరహాలోనే మహారాష్ట్ర ప్రజల జీవితాలను బాగుచేయాలని కేసీఆర్ వచ్చారని తెలిపారు. పండరిపురం చరిత్రలో సీఎం కేసీఆర్ కొత్త చరిత్ర లిఖించారని పేర్కొన్నారు. పండరినాథుని సేవకు సీఎం కేసీఆర్ ఒక ముఖ్యమంత్రిగా కాకుండా తెలంగాణ కుటుంబ పెద్దగా సమస్త మంత్రివర్గాన్ని, ఎంపీలను, ఎమ్మెల్యేలను పార్టీ ప్రముఖులను అందరినీ వెంటపెట్టుకొని రావడం గొప్ప విషయమని అన్నారు. మహారాష్ట్రలోని ఏ సర్కారూ ఇలా పండరినాథుని సేవకు రాలేదని తెలిపారు. పండరినాథుడి ఆశీస్సులతో బీఆర్ఎస్ కచ్చితంగా మహారాష్ట్రలో జెంగా ఎగురవేయటం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.
మహారాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న కష్టాలను కడతేర్చేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చారని బీఆర్ఎస్ మహారాష్ట్ర సీనియర్ నేత శంకరన్న దోండ్గే పేర్కొన్నారు. మూడు నాలుగు నెలలుగా కేసీఆర్ ఇస్తున్న సందేశం, దేశం బాగుపడాలనే తన ఆకాంక్ష మహారాష్ట్ర అంతటా మారుమోగిపోతున్నదని తెలిపారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదం మహారాష్ట్ర భూమిని పవిత్రం చేసిందని అన్నారు.
తెలంగాణ రైతుల జీవితాలను మార్చి, దేశానికి రైతుల జీవితాలు ఎలా ఉండాలో చెప్పిన నాయకుడు కేసీఆర్ అని మహారాష్ట్ర బీఆర్ఎస్ రాష్ట్ర కిసాన్ సమితి అధ్యక్షుడు మాణిక్ కదం చెప్పారు. పార్టీ విస్తరణకు, బీఆర్ఎస్కు మహారాష్ట్ర ప్రజలు చూపుతున్న ఆదరణను ఎవరూ అడ్డుకోలేరని తేల్చిచెప్పారు.
దేశంలో రైతుల పక్షాన నిలబడి రైతు ప్రభుత్వం తెస్తామని చెప్పిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ ఒక్కటే. దేశంలో 40 శాతం ఉన్న రైతులను విస్మరించి పాలించిన పార్టీలు అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని ఎందుకు చెప్పలేదు. రైతు రాజ్యం నినాదం కాదు.. విధానంగా ఉండాలి. తెలంగాణలో రైతు రాజ్యం నెలకొల్పినం కనుకనే అదే స్ఫూర్తితో దేశవ్యాప్తంగా అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అన్న నినాదాన్ని ఎత్తుకున్నం. దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆకలితో అలమటించవద్దు. ఆవేదనతో కలత చెందవద్దు. రైతుల కలతను తీర్చడమే బీఆర్ఎస్ లక్ష్యం.
సీఎం కేసీఆర్ రెండు రోజుల మహారాష్ట్ర పర్యటనలో రాష్ట్రంలో అసామాన్యులందరూ సామాన్యుల వలె మారిపోయారు. తమతమ నియోజకవర్గాలను, జిల్లాలను, ప్రాంతాలను ప్రభావితం చేయగలిగే స్థితిలో ఉన్న ఎంతోమంది నాయకులు.. ప్రత్యేకించి మంత్రులు సామాన్య కార్యకర్తల వలే ఒదిగిపోయారు. హోదాలను మరచి ప్రజలతో మమేకమయ్యారు. మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు తెలంగాణ ఉద్యమ కాలంలో సామాన్యులతో కలిసిపోయినట్టుగానే మహారాష్ట్ర పర్యటనలోనూ వ్యవహరించారు. మంత్రి హరీశ్‌రావు, ఎంపీ సంతోష్‌కుమార్, బాల్క సుమన్ తదితరులు సీఎం పర్యటన ఆసాంతం కార్యకర్తలుగా వ్యవహరించారు. పండరినాథుడి దర్శనం అనంతరం భగీరథ్ బాల్కే స్వగ్రామం సర్కోరీలో నిర్వహించిన కార్యక్రమాన్ని చూస్తే ఉద్యమ సమయం నాటి సన్నివేశాలు గుర్తుకు వచ్చాయి. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వర్రావు, మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, ఎంపీలు సంతోష్‌కుమార్, దీవకొండ దామోదర్‌రావు.. ఇలా సమస్త ప్రజాప్రతినిధులు జనంతో కలిసిపోయి సీఎం కేసీఆర్ ప్రసంగానికి సభికుల నుంచి వచ్చిన ప్రతిస్పందన చూసి ముగ్ధులయ్యారు.