Vikarabad | వికారాబాద్, నవంబర్ 13, (నమస్తే తెలంగాణ): నా భర్త పేరు ప్రవీణ్. మా ఆయనను విడిచిపెట్టండి.. మేం రైతులం, ఏడాదిగా ఫార్మా కోసం మా భూములివ్వలేమని ధర్నాలు చేస్తున్నాం. మొన్న జరిగిన ఘటనలో నా భర్త ఉన్నారు. మా పొలంతోపాటు మా ఇల్లు కూడా ఫార్మా విలేజ్ భూ సేకరణలో పోతుంది. నాపై దౌర్జన్యం చేసి నా భర్తను పోలీసులు తీసుకెళ్లారు. నేను 9 నెలల నిండు గర్భిణిని. స్కానింగ్ కోసం రేపు పొద్దున వికారాబాద్ వెళ్లేది ఉన్నందున నా భర్తను తీసుకెళ్లొద్దని, నాకు అత్త, మామ ఎవరూ లేరని చెప్పి ఎంత కాళ్లా, వేళ్లా పట్టుకొని బతిమిలాడినా పోలీసులు కనికరించకుండా నా భర్తను తీసుకెళ్లారు.
నా పరిస్థితి చూసి మా అమ్మ మహారాష్ట్ర నుంచి వచ్చింది. నాకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు?’ అంటూ లగచర్లకు చెందిన ఓ నిండు గర్భిణి కన్నీటి పర్యంతమైంది. ఉదయం పంపిస్తామని చెప్పి తీసుకెళ్లి రెండు రోజులవుతున్నా నా భర్త జాడ లేదని వాపోయింది. దవాఖానకు పోవడానికి కూడా పైసలు లేవు, ఇక స్కానింగ్ కూడా చేపించుకోలేదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె రోదన గ్రామస్థులతోపాటు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తున్నది. ‘రేపు మాకు పుట్టే పిల్లలను పోషించాలంటే భూమి, ఇల్లు ఉండాలి కదా, దౌర్జన్యం చేసి రేవంతన్న ఉన్నందంతా గుంజుకుంటున్నడు. నా భర్త ఏ పోలీస్స్టేషన్లో ఉన్నడో కూడా తెల్విదు, నేను గర్భిణిని ఎక్కడని వెతకాలి’ అంటూ ఆమె బోరున విలపించింది.