హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): ‘ఉత్తర తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కాళేశ్వరం పంపులను ఆన్ చేస్తే 15 జిల్లాలకు నీళ్లు అందుతాయి. అయినా మోటర్లు ఆన్ చేయడం లేదు. ఇకనైనా మోటర్లు ఆన్ చేయాలి. లేదంటే రైతులతో కదిలివచ్చి మోటర్లు ఆన్ చేస్తాం’ అంటూ ఇటీవల బీఆర్ఎస్ ఇచ్చిన అల్ట్టిమేటంతో కాంగ్రెస్ ఎట్టకేలకు దిగొచ్చింది. బుధవారం కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన లింక్-2ను ప్రారంభించింది. నంది, గాయత్రి పంప్‌హౌస్‌ల్లోని మోటర్లను ఆన్ చేసి, ఎల్లంపల్లి నుంచి శ్రీరాజరాజేశ్వర జలాశయానికి గోదావరి జలాల తరలింపును చేపట్టింది. కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు ఎస్సారెస్పీ నిండలేదు. పూర్తిస్థాయి నీటిమట్టం 80.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 45 టీఎంసీల జలాలే ఉన్నాయి. మిడ్‌మానేరు, ఎల్ఎండీల్లోనూ జలాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.
ప్రధాన గోదావరిలో ప్రవాహాలే లేకుండాపోయాయి. మరోవైపు, ప్రాణహితలో లక్షల క్యూసెక్కులు దిగువకు తరలిపోతున్నాయి. మరోవైపు, గోదావరి బేసిన్లో, ముఖ్యంగా ఎస్సారెస్పీ ఆయకట్టులో ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో పంటల సాగు మొదలుకాలేదు. నీళ్లను ఎత్తిపోయకుండా రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నానా ఇబ్బందులకు గురిచేస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన లక్ష్మీ బరాజ్ (మేడిగడ్డ)లోని 7వ బ్లాక్‌లో తలెత్తిన చిన్నపాటి సాంకేతిక లోపాన్ని, దానిపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికను కాంగ్రెస్ ప్రభుత్వం సాకుగా చూపుతున్నది. అనవవసర రాద్ధాంతం చేస్తున్నది. కన్నెపల్లి పంప్‌హౌస్ మినిమం డ్రా డౌన్ లెవల్ 93.5 మీటర్లు కాగా, ప్రస్తుతం అంతకంటే ఎక్కువగా 96 మీటర్ల ఎత్తులో నీళ్లు పోతున్నాయి. బరాజ్ గేట్లు తెరిచి ఉన్నా కన్నెపల్లి పంప్‌హౌస్ మోటర్లు ఆన్‌చేసి రోజుకు రెండు టీఎంసీల నీళ్లను ఎత్తిపోయవచ్చని ఇంజినీర్లు చెప్తున్నారు.
మోటర్లను ఆన్ చేస్తే ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, అనంతసాగర్, రంగనాయక్‌సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లను నింపుకోవచ్చు. కానీ, కాళేశ్వరంపై కక్షతో కాంగ్రెస్ సర్కారు మోటర్లను ఆన్ చేయకుండా రైతులను ఎండబెడుతున్నది. ఇదే విషయమై బీఆర్ఎస్ ఇటీవల ప్రభుత్వాన్ని నిలదీసింది. ‘కాళేశ్వరం మోటర్లు ఆన్ చేసి నీటిని ఎత్తిపోసి మొదటి పంటకు నీరందించాలి. అప్పటివరకు ఈ ప్రభుత్వాన్ని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టబోము. లక్షలాది మందితో కదిలి వచ్చి మోటర్లు ఆన్చేస్తాం. నీరందించి చూపుతం. ప్రజాబలం అంటే ఏమిటో చూపిస్తాం’ అంటూ అల్టిమేటం జారీచేసింది. అంతేకాకుండా, మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఇటీవల ఏకంగా కన్నెపల్లికి తరలివెళ్లారు. మోటర్లను ఆన్‌చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ శ్రేణుల ఒత్తిడితో కాంగ్రెస్ సర్కారు ఎట్టకేలకు కాళేశ్వరం ప్రాజెక్టులోని లింక్-2 మోటర్లను ఆన్ చేసింది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 20 వేల క్యూసెక్కుల వరద వస్తున్న నేపథ్యంలో నంది, గాయత్రి పంపుహౌస్‌ల్లో మూడు చొప్పున మోటర్లను ఆన్ చేసింది. మొత్తంగా 9,450 క్యూసెక్కుల జలాలను శ్రీరాజరాజేశ్వర జలాశయానికి తరలించింది.