Mission Bhagirathaవనపర్తి, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) : వనపర్తి జిల్లాలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. ఐదు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తాగునీటి కోసం తంటాలు పడుతున్నారు. భగీరథ పైపులైన్‌కు అదనంగా పెద్దమందడి మండలం బుగ్గపల్లితండా వద్ద ప్రత్యేక ప్లాంటేషన్ ఏర్పాటు చేశారు. ఈ పథకంలోనే దాదాపు 57 కిలోమీటర్ల ప్రత్యేక లైన్‌కు ఆరుచోట్ల వాల్వ్‌లు ఏర్పాటు చేయలేదు. వేసవిలో చేయాలనుకున్నా నీటిఎద్దడి ఏర్పడుతుందన్న కారణంతో అప్పట్లో అధికారులు విరమించుకున్నారు.
ప్రస్తుతం ఈ పనులు చేపట్టడంతో జిల్లాలోని సగభాగానికిపైగా పట్టణాలు, గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. దీనికితోడు రాజపేట సమీపంలో భగీరథ పైపులైన్ పగలడంతో నీటి సమస్య మరింత తీవ్రమైంది. కొన్ని ప్రాంతాల్లో అధికారులు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నా ప్రజలకు సరిపోవడం లేదు. స్థానికంగా అందుబాటులో ఉన్న వ్యవసాయ బోరుమోటర్లను ఆశ్రయిస్తున్నారు. భగీరథ పథకంలో పలు పోస్టులు ఖాళీలు ఉండటంతో పర్యవేక్షణ కొరవడిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిషన్ భగీరథ ఈఈ మేఘారెడ్డి మాట్లాడుతూ పైపులైన్లను అనుసరించి కొన్ని వాల్వ్‌లు ఏర్పాటు చేయడం కోసం నీటి సరఫరాను నిలిపివేసినట్టు తెలిపారు. రెండు రోజుల్లో పూర్తి చేయాలనుకున్నా వర్షాల కారణంగా ఆటంకం ఏర్పడిందని పేర్కొన్నారు.