హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లి గ్రామానికి చెందిన రైతులు గురువారం బీఆర్కే భవన్లో రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎర్రవల్లిలోని వ్యవసాయ భూములకు కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి సాగునీటిని విడుదల చేయాలని విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు కోదండరెడ్డి సమస్యను నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వివరించగా, ప్రాజెక్టు కింద ఉన్న భూములకు సాగునీటిని విడుదల చేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశంతో అధికారులు వెంటనే సాగునీటిని విడుదల చేశారు. దీంతో రైతులు కోదండరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రంలో ఉద్యానపంటల సాగు విస్తీర్ణం పెంపుపై ఉద్యానవన, పట్టుపరిశ్రమశాఖ అధికారులు దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ ఏ కోదండరెడ్డి సూచించారు. గురువారం వ్యవసాయ కమిషన్ చైర్మన్ అధ్యక్షతన బీఆర్కే భవన్‌లోని వ్యవసాయ కమిషన్ కార్యాలయంలో ఉద్యానవన, పట్టుపరిశ్రమశాఖ అధికారుల సంఘం నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉద్యానవన, పట్టుపరిశ్రమ బలోపేతం కోసం చేపట్టాల్సిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఉద్యానవనశాఖలో ఉద్యోగుల కొరత, కూరగాయల సాగు చేసే రైతులకు ఎదురవుతున్న సమస్యలపై అధికారులు కమిషన్ చైర్మన్, సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలను పరిష్కరించాలని కోరారు.