కొమురవెల్లి, ఫిబ్రవరి 24 : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం గురువన్నపేటలో గత పదేండ్లలో ఎన్నడూ లేని విధంగా నీటి కష్టాలు మొదలయ్యాయి. పక్కనే కూత వేటు దూరంలో తపాస్‌పల్లి రిజర్వాయర్ ఉన్నా గురువన్నపేట రైతుల పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొన్నది. గ్రామానికి చెందిన పుట్ట వెంకట్ అనే రైతు 3 ఎకరాల్లో వరి వేయగా, నీళ్లు అందకపోవడంతో పంట ఎండిపోతున్నది. వరిని ఎలాగైనా బతికించుకోవాలని నీళ్ల ట్యాంకర్ ద్వారా సోమవారం పంటకు నీళ్లను పెట్టిండు. తాను ఆరేండ్ల క్రితం బోరు వేశానని, మొత్తం 3 ఎకరాలు నీరు పారేదని, ఈ సారి మాత్రం కండ్ల ముందే పంటకు నీళ్లు అందడం లేదని రైతు వాపోయాడు.
సంగెం, ఫిబ్రవరి 24 : పంట రుణం చెల్లించలేదని బ్యాంకు అధికారులు రైతు భూమిలో ఎర్ర జెండాలు పాతిన ఘటన వరంగల్ జిల్లా సంగెం మండలంలో సోమవారం చోటుచేసుకుంది. బ్యాంకు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్గూర్‌స్టేషన్ తండాకు చెందిన రైతు గుగులోత్ మురళి మూడేండ్ల క్రితం రూ. 2లక్షల పంట రుణం తీసుకున్నాడు. ఎన్నిసార్లు వెళ్లినా రుణం చెల్లించకపోవడంతో భూమిని ఐడెంటిఫై చేసి జెండాలు పాతినట్టు పేర్కొన్నారు.
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రేపల్లి శివారులో భూసర్వే చేపట్టిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. కాట్రేపల్లి రైతు వెంకటేశ్‌గౌడ్ పెట్రోల్ బాటిల్తోవచ్చి సర్వే ఆపకుంటే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. తమ భూములను ఇండస్ట్రియల్ పార్కు కోసం ఇచ్చేది లేదని పెద్దపల్లి జిల్లా రత్నాపూర్ రైతులు ఎంజాయిమెంట్ సర్వేను అడ్డుకున్నారు. ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం మేడిపల్లి శివారులోని భూములను తీసుకునేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఫీల్డ్ మీదకు వచ్చిన రెవెన్యూ అధికారులను రైతులు మూకుమ్మడిగా అడ్డుకున్నారు. దీంతో అధికారులు వెళ్లిపోయారు. – రామగిరి/ మక్తల్