కెరమెరి, జూన్ 23: ‘సారూ.. మీ కాళ్లు మొక్కుతాం..మాకు తాగునీళ్లు అందించండి’ అంటూ గిరిజనులు ఎస్సై కాళ్ల మీద పడి వేడుకున్నారు. ఈ ఘటన సోమవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండల కేంద్రంలో జరిగింది. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, తాగునీటి ఎద్దడి తీర్చాలంటూ కెరమెరిలోని ప్రధాన రహదారిపై జోడేఘాట్, పాట్నాపూర్, బాబేఝరి, శివాగూడ, పాటగూడ, పిట్టగూడ, కొలాంగూడ గ్రామాలకు చెందిన సుమారు వంద మంది గిరిజనులు బైఠాయించి ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు.
నెల రోజుల నుంచి మిషన్ భగీరథ నీటి సరఫరా లేక గోస పడుతున్నామని, అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే దారిలో అదనపు కలెక్టర్ దీపక్ తివారీ రాగా ఆయనకు విన్నవించేందుకు ప్రయత్నించగా వాహనం ఆపకుండా వెళ్లిపోయారు. అనంతరం ఎస్సై మధుకర్ కాళ్లపై పడి నీళ్లందించాలని వేడుకున్నారు. అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కారమయ్యేలా చూస్తానని ఎస్సై హామీ ఇవ్వడంతో అక్కడి నుంచి మండల పరిషత్ కార్యాలయం వద్దకు వెళ్లి ఆందోళన కొనసాగించారు. నీటి సరఫరా ఏఈ విశ్వేశ్వర్ వచ్చి ట్యాంకర్ల ద్వారానైనా నీటిని అందిస్తామని హామీ ఇవ్వడంతో గిరిజనులు శాంతించారు.
నీళ్లివ్వాలని కాళ్లు పట్టుకుని…
‘సారూ.. మీ కాళ్లు మొక్కుతం.. తాగడానికి నీళ్లియ్యండి’ అంటూ పోలీసుల కాళ్ల మీద పడి గిరిజనులు వేడుకున్న ఘటన సోమవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండల కేంద్రంలో జరిగింది. మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేయడంతో నెల రోజులుగా గొంతెండుతున్నదని పేర్కొంటూ ఏడు గ్రామాలకు చెందిన వంద మంది గిరిజనులు ఆందోళనకు దిగారు.