HomeTelanganaWater Levels In Srisailam And Nagarjunasagar Reservoirs Are Decreasing Due To The Diversion Of Water From Ap
Krishna Water | జల దోపిడీ.. అందినకాడికి కృష్ణా జలాలను తరలించుకుపోతున్న ఏపీ
ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి జలాలను ఏపీ మళ్లించుకుపోతున్న ఫలితంగా శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో నీటినిల్వలు అడుగంటుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మండు వేసవికి ముందే ప్రాజెక్టులు ఖాళీ అయ్యి, తెలంగాణకు తీరని నష్టం వాటిల్లనున్నది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సైతం ఏపీని నిలువరించకుండా మీనమేషాలు లెక్కిస్తున్నది.
25 రోజులుగా రోజుకు 2 టీఎంసీలు తరలింపు.. రాష్ట్ర ప్రభుత్వం చోద్యం
ఇప్పటికే 646 టీఎంసీలు మళ్లింపు.. వేసవికి ముందే ప్రాజెక్టులు ఖాళీ
నిర్ధారిత నీటి కోటా 512 టీఎంసీలు
దాన్ని మించి జలాలు తరలిస్తున్న ఏపీ
మీనమేషాలు లెక్కిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
వారించని కృష్ణా మేనేజ్మెంట్ బోర్డు
త్రిసభ్య కమిటీ సమావేశం ఊసే లేదు
అడుగంటుతున్న నాగార్జునసాగర్
యాసంగికి కష్టమేనంటున్న నిపుణులు
ఇండెంట్లు లేవు.. ఇదేమని అడిగేవారు లేరు.. అడ్డుకునే వారేలేరు.. కృష్ణాబోర్డుకు చెప్పినా పట్టించుకోదు. ఏపీ సర్కార్ మాత్రం యథేచ్ఛగా అందినకాడికి, వాటాకు మించి కృష్ణా జలాలను తరలించుకుపోతూనే ఉన్నది. ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి 646 టీఎంసీల నీటిని ఏపీ మళ్లించుకుపోయింది.
Krishna Water | హైదరాబాద్, ఫిబ్రవరి16 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి జలాలను ఏపీ మళ్లించుకుపోతున్న ఫలితంగా శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో నీటినిల్వలు అడుగంటుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మండు వేసవికి ముందే ప్రాజెక్టులు ఖాళీ అయ్యి, తెలంగాణకు తీరని నష్టం వాటిల్లనున్నది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సైతం ఏపీని నిలువరించకుండా మీనమేషాలు లెక్కిస్తున్నది. ఈ ఏడాది ఇప్పటివరకు త్రిసభ్య కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయనేలేదు. ఇం తటి విపత్కర పరిస్థితి నెలకొన్నా తెలంగాణ సర్కార్ మాత్రం నిమ్మకు నీరెత్తిన్నట్టు వ్యవహరిస్తున్నది. సామర్థ్యం మేరకు సైతం నీటిని వినియోగించకుండా చేష్టలుడిగి చూస్తున్నది. బోర్డును నిలదీయకుండా, ఏపీని నిలువరించకుండా చేతులేత్తిసింది.
కృష్ణా నదీ జలాల్లో ఏపీ తాత్కాలిక కోటా 512 టీఎంసీలు. కానీ, ఇప్పటికే 646 టీఎంసీలను మళ్లించుకుపోయింది. జనవరి 21వ తేదీ వరకు 590 టీఎంసీలను తరలించుపోగా, గత 25 రోజుల్లోనే 60 టీఎంసీలను మళ్లించుకుపోయిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రోజుకు దాదాపు 2 టీఎంసీలకు మించి జలాలను ఏపీ మళ్లిస్తున్నది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒక్క పోతిరెడ్డిపాడు ద్వారానే ఎనిమిది నెలల్లో 240 టీఎంసీలకుపైగా పెన్నా బేసిన్‌కు తరలించింది. పెన్నా బేసిన్లో దాదాపు 350 టీఎంసీలను ఇప్పటికే నిల్వ చేసింది. అంతేకాకుండా, హెచ్ఎన్ఎస్ఎస్, జీఎన్ఎస్ఎస్, ముచ్చుమర్రి, మల్యాల తదితర ఎత్తిపోతల ద్వారా కూడా జలాలను తరలించింది.
దిగువన నాగార్జునసాగర్ వద్ద కుడికాలువ, పంప్‌హౌజ్ ద్వారా కూడా కృష్ణా జలాలను ఏపీ నిరంతరాయంగా తరలిస్తూనే ఉన్నది. మొత్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు 646 టీఎంసీలకుపైగా జలాలను ఏపీ తరలించినట్టు అధికారిక గణాంకాలే వెల్లడిస్తున్నాయి. మళ్లిస్తున్న జలాలకు సంబంధించిన లెక్కలను కూడా ఖచ్చితంగా వెల్లడించని దుస్థితి నెలకొన్నది. నీటి గణాంకాల వివరాలను కూడా సరిగా నమోదు చేయడం లేదు.
వేసవికి ముందే రిజర్వాయర్లు ఖాళీ!
ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిశాయి. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ పొంగిపొర్లాయి. అక్టోబర్ 25 నాటికి శ్రీశైలం రిజర్వాయర్ 215 టీఎంసీలతో కళకళలాడింది. కానీ, ప్రస్తుతం వేసవి రాకముందే పరిస్థితి తారుమారవుతున్నది. శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో నీటినిల్వలు అడుగంటి పోయాయి. ఇప్పటికే శ్రీశైలం రిజర్వాయర్‌ను ఏపీ సర్కార్ ఖాళీ చేసింది. శ్రీశైలంలో ప్రస్తుతం 82 టీఎంసీలే ఉండటం గమనార్హం. ఇందులో డెడ్‌స్టోరేజీ కింద 54 టీఎంసీలను తీసేస్తే, ఇక అందుబాటులో ఉన్నవి 28 టీఎంసీలే. రిజర్వాయర్‌పై ఆధారపడి ఉమ్మడి మహబూబ్‌నగర్‌తోపాటు మొత్తంగా ఏడు జిల్లాలకు సాగునీరు అందించాల్సి ఉన్నది.
యాసంగి తాగునీటి అవసరాలను కూడా తీర్చాల్సి ఉన్నది. నాగార్జునసాగర్‌లోనూ ప్రస్తుతం 180 టీఎంసీలే ఉన్నాయి. ఇందులో డెడ్‌స్టోరేజీ కింద 131 టీఎంసీలు మినహాయిస్తే అందుబాటులో నిండా 50 టీఎంసీలు కూడా లేవు. ఈ విధంగా రెండు రిజర్వాయర్లలో కలిపి నికరంగా 78 టీఎంసీలు కూడా లేవు. మరోవైపు సాగర్ ఎడమ కాలువ కింద 6.5 లక్షల ఆయకట్టుతోపాటు హైదరాబాద్ సహా ఇతర జిల్లాల తాగునీటి అవసరాలు తీర్చాల్సి ఉన్నది. సాగర్ కుడి కాలువ నుంచి ఏపీ గత మూడు నెలలుగా నికరంగా రోజుకు 10 వేల క్యూసెక్కులను నిరంతరాయంగా తరలించిపోతున్నది. ఈ ఏడాది పొంగిన కృష్ణమ్మను ఏపీ అడ్డంగా మళ్లించుకుపోయింది.
త్రిసభ్య కమిటీ సమావేశం ఊసేలేదు
ఏపీ అడ్డూ అదుపు లేకుండా రిజర్వాయర్ల నుంచి అనుమతి లేని ఔట్లెట్ల ద్వారా జలాలను తరలించుకుపోతున్నా కేఆర్ఎంబీ నోరెత్తడం లేదు. వాస్తవంగా ప్రతి నీటి సంవత్సరం అంటే జూన్ నుంచి మే 31వ తేదీ వరకు ఉమ్మడి రిజర్వాయర్లలో నీటినిల్వలను ఏ రాష్ట్రం, ఏ మేరకు వినియోగించుకోవాలనేది త్రిసభ్య కమిటీ నిర్ణయిస్తుంది. బోర్డు మెంబర్ సెక్రటరీ, ఇరు రాష్ర్టాల ఈఎన్సీ (ఇంజినీర్ ఇన్ చీఫ్)లతో కూడిన ఈ కమిటీ ఏటా సీజన్ల వారీగా ఎప్పటికప్పుడు సమావేశాలను ఏర్పాటుచేస్తుంది.
రాష్ర్టాల డిమాండ్లను, అందుబాటులో ఉన్న నీటినిల్వలను పరిగణనలోకి తీసుకొని ఇరు రాష్ర్టాలకు నీటి వాటాలను కేటాయిస్తుంది. కానీ, ఈ ఏడాది యాసంగి సీజన్ ప్రారంభమైనా, నీటి సంవత్సరం ముగిసేందుకు మరో నాలుగు నెలల సమయమే ఉన్నా ఇప్పటికీ త్రిసభ్య కమిటీ సమావేశం జరగలేదు. గత నెల 21న నిర్వహించిన బోర్డు సమావేశంలోనూ నీటివాటాలపై చర్చించలేదు. రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగినంతగా లేవని, వచ్చే ఏడాది వరకు తాగునీటి అవసరాలు ఉన్న నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడుకోవాలంటూ ఉచిత సలహాలు ఇస్తున్న కేఆర్ఎంబీ ఏపీని మాత్రం నిలువరించడం లేదు.
నీటి వినియోగంలో రేవంత్ సర్కార్ విఫలం
ఒకవైపు నాగార్జునసాగర్ ఎడమకాలువకు సంబంధించిన చివరి ఆయకట్టు రైతులు సాగునీరు సరిగా అందడం లేదని ఆందోళనకు దిగుతున్నారు. మరోవైపు, ఏపీ యథేచ్ఛగా నీటిని తరలించుకుపోతున్నది. బోర్డు సైతం ఏపీ సర్కార్‌కు అనుకూలంగా చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నది. ఇంతజరుగుతున్నా రేవంత్ సర్కార్ నోరెత్తడం లేదు. ఏపీని నిలువరించేందుకు ప్రయత్నించడంలేదు. త్రిసభ్య కమిటీ సమావేశం కోసం బోర్డుపై ఒత్తిడి తేవడంలేదు. కృష్ణమ్మను ఒడిసిపట్టడంలోనూ, జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలనే ఆలోచన కూడా రేవంత్ సర్కార్‌కు లేకుండా పోయింది. ఏపీ 650పైగా టీఎంసీలను తరలించుకుపోగా, తెలంగాణ సర్కార్ 210 టీఎంసీలను మాత్రమే వినియోగించుకున్నది.
శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్ల నుంచి ఎంతమేరకు సాధ్యమైతే అంతమేరకు కృష్ణా జలాలను తరలిస్తూ, రిజర్వాయర్లను ఏపీ నింపుకుంటుండగా తెలంగాణ సర్కార్ మాత్రం మొద్దునిద్ర పోతున్నదని నీటిరంగ నిపుణులు మండిపడుతున్నారు. సాగర్ ఎడమకాలువ పూర్తిస్థాయి సామర్థ్యం ఎనిమిది వేల క్యూసెక్కులు కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు గరిష్ఠంగా ఆరువేల క్యూసెక్కులకు మించి నీటిని విడుదల చేయడం లేదని చెప్తున్నారు. ఎడమకాలువతో అనుసంధానించిన చెరువులను నింపే అవకా శం ఉన్నా ప్రభుత్వం ఆ పని కూడా చేయడం లేదని రైతాంగం మండిపడుతున్నది. ఏపీని కట్టడి చేయడంలోనే కాదు కృష్ణా జలాలను ఒడిసిపట్టే అంశంలోనూ సర్కార్ అడుగడుగునా విఫలమైంది. ప్ర భుత్వం స్పందించకపోతే వేసవి కష్టాలు తప్పవని నీటిరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.