నెన్నెల, డిసెంబర్ 8 : ప్రేమ పెం డ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోక పోగా.. పెద్దల సమక్షంలో తనకు ఇష్టమైన వాడిని మనువాడిని ఆ నవ వధువు అర్ధాంతరంగా తనువు చాలించిం ది. కాళ్లపారాని ఆరకముందే కరెంట్ షాక్ రూపంలో ఆమెను మృత్యువు కబళించింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెలలో ఆదివారం తీవ్ర విషాదాన్ని నింపింది. మారమ్మవాడకు చెందిన స్వప్న (22), అదే గ్రామానికి చెందిన పల్ల సిద్ధు (టింకు) రెండేండ్లుగా ప్రేమించుకున్నారు. పెండ్లి చేసుకుందామని తల్లిదండ్రులను ఆశ్రయించగా వారు నిరాకరించారు. ఏం చేయాలో తోచక ఇరువురు గ్రామ పెద్దలను కలిశారు. వారి సమక్షంలో ఈ నెల 4న బెల్లంపల్లిలోని శివాలయంలో పెండ్లి చేసుకున్నారు. ఆదివారం ఉ దయం స్వప్న స్నానం చేసేందుకు వాటర్ హీటర్‌ను బకెట్లో ఉంచింది. అదే సమయంలో కరెంట్ కోత విధించారు. కరెంట్ లేదనే నమ్మకంతో నీటిలో నుంచి హీటర్‌ను తీస్తుండగా, ఒక్కసారిగా కరెంట్ సరఫరా అయ్యింది. షాక్‌తో కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక పీహెచ్‌సీకి తరలిస్తుండగా మృతి చెందింది. ఈ విషాద ఘటన చూసిన స్థానికులు కన్నీరు పెట్టారు. స్వప్న తల్లిదండ్రుల వేదన అక్కడున్న వారిని కలిచివేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్సై ప్రసాద్ తెలిపారు.