Kaleshwaram | ధర్మారం, జనవరి 19 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలోని నంది, కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని నారాయణపూర్ రిజర్వాయర్లకు ఎల్లంపల్లి నీటిని తరలించేందుకు మళ్లీ కాళేశ్వరం ప్రాజెక్టులోని నంది పంప్‌హౌస్ మోటర్లే దిక్కయ్యాయి. కాంగ్రెస్ హయాంలో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు అనుబంధంగా నిర్మించిన వేమునూర్ వద్ద ఎల్లంపల్లి పంప్‌హౌస్‌లో రెండు మోటర్లు మొరాయించడంతో మళ్లీ నంది పంప్‌హౌస్ మోటర్లనే వినియోగిస్తున్నారు.
నంది రిజర్వాయర్‌లో పూర్తి స్థాయి నీటి మట్టం 233 మీటర్లు కాగా, ప్రస్తుతం 225 మీటర్లకు పడిపోయింది. దీంతో దీని కింద ఉన్న 650 ఎకరాల్లో యాసంగి సాగుకు సరిపడా నీరందని పరిస్థితి ఏర్పడటంతో రైతులు ఆందోళన చెందారు. స్థానిక ప్రజాప్రతినిధు లు, అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టులోని నంది పంప్‌హౌస్‌ను వినియోగించకుండా, ఉమ్మడి రాష్ట్రంలో పాలకుర్తి మండలం వేం నూరు వద్ద నిర్మించిన ఎల్లంపల్లి పంప్‌హౌస్‌లో మోటర్లను ఆన్‌చేసి పంపింగ్ చేయాలని సంకల్పించారు.
ఈ నెల 16న ఇందులోని 1వ మోటర్‌ను ఆన్‌చేసే ప్రయత్నం చేయగా మొరాయించగా. 2వ మోటర్‌ను ఆన్‌చేశారు. దాని ద్వారా కేవలం 247 క్యూసెక్కులు మాత్రమే నంది రిజర్వాయర్‌లోకి పంపింగ్ చేశారు. ఓ వైపు విద్యుత్తు సరఫరాలో అంతరాయం, మరో వైపు ఆ మోటర్ కూడా మొరాయించడంతో అదే రాత్రి నిలిపేశారు. రెండు మోటర్లు కూడా నడవకుండా మొరాయించడంతో ఎల్లంపల్లి పైపులైన్ ద్వారా నీటి పంపింగ్ అర్ధాంతరంగా నిలిచిపోయింది.
నంది, అక్కడి నుంచి నారాయణపూర్ రిజర్వాయర్లలో నీటిని నింపడానికి బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుబంధంగా నిర్మించిన నంది పంప్‌హౌసే ఇప్పుడు దిక్కయింది. ఇక అధికారులు దాని ద్వారానే నీటిని ఎత్తిపోయాలని నిర్ణయించారు. శనివారం రాత్రి 9 గంటల నుంచి నంది పంప్‌హౌస్‌లోని 6వ మోటర్‌ను ఆన్ చేయడంతో గోదావరి జలాలు ఎగిసి పడుతూ నంది రిజర్వాయర్‌లోకి చేరుకుంటున్నాయి.
ఎల్లంపల్లి పైప్‌లైన్ మార్గం ద్వారా ఒక మోటర్తో కేవలం 247 క్యూసెక్కులు రావడం వల్ల రెండు రిజర్వాయర్లు నిండటానికి రోజుల తరబడి సమయం పట్టేది. నంది పంప్‌హౌస్‌లోని మోటర్ ద్వారా 3,150 క్యూసెక్కులు వస్తుండటంతో తొందరగానే నిండే అవకాశం ఉన్న ది. రైతుల పొలాలు ఎండక ముందే నీళ్లందుతాయి. నంది రిజర్వాయర్‌లోకి నీరు రావడంతో ఆదివారం మధ్యాహ్నం ఇక్కడి ఎల్లంపల్లి పంప్‌హౌస్‌లోని రెండో నంబర్ మోటర్ ఆన్ చేసి నారాయణపూర్ రిజర్వాయర్‌కు 247 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు.