హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ర్టానికి రూపాయి నిధులు ఇవ్వనందుకే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బల్లలు చరిచారా? అని బీజేపీ రాష్ట్ర ఎంపీలను బీఆర్ఎస్ నేత, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి ప్రశ్నించారు. బడ్జెట్ ప్రసంగం జరిగేటప్పుడు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఇతర ఎంపీలు బల్లలు చరిచారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు రూపాయి ఇవ్వకపోయినా డ్రీమ్ బడ్జెట్ అని కిషన్‌రెడ్డి అభివర్ణించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌ను చూసి కిషన్‌రెడ్డి, బండి సంజయ్ బుద్ధి తెచ్చుకోవాలని చురకలంటించారు.
తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఢిల్లీలో ఏం చేస్తున్నారు? అని భగ్గుమన్నారు. నయాపైసా నిధులు తేనందుకు బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పట్ల బీజేపీకి చిత్తశుద్ధి లేదనడానికి కేంద్ర బడ్జెట్‌ను చూస్తేనే అర్థమవుతుందని, నిరుడు కూడా రాష్ర్టానికి నిధులు కేటాయించకుండా నిరాశపర్చారని మండిపడ్డారు. కేసీఆర్ పదేండ్లు అనేక కార్యక్రమాలు చేపట్టి నిధులు అడిగినా కేంద్రం ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులుండి ఏంసాధించారని ప్రశ్నించా రు. ఈ బడ్జెట్లో బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, సైనిక్ సూల్, నవోదయ సూల్, వరంగల్ ఎయిర్పోర్ట్ ప్రస్తావనే లేదని మండిపడ్డారు.
కేంద్ర బడ్జెట్లో పసుపు బోర్డుకు రూపాయి నిధులు ఎందుకు కేటాయించలేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌ను రావుల శ్రీధర్‌రెడ్డి ప్రశ్నించారు. ఎంపీగా, కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి తెలంగాణకు నయాపైనా తేలేకపోయారని, తెలంగాణలో మాత్రం బీజేపీ జెండా పాతుతామని బీరాలు పలుకుతున్నారని మండిపడ్డారు. నయా పైసా తీసుకురానందుకు ప్రజలు మీకు ఓట్లు వేయలా? అని నిలదీశారు. తెలంగాణ, దక్షిణాది రాష్ట్రాలు అంటే బీజేపీకి చిన్నచూపు ఎందుకని ప్రశ్నించారు.