వరంగల్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘ట్రాక్టర్ట ఓనర్లు, డ్రైవర్లు అందరికీ నమస్కారం. దయచేసి నేను ఒకటే చెప్తున్న. ఇప్పటికే మెసేజ్ పెట్టి మూడు రోజులవుతున్నది. మీరు ఫోన్‌పే అయినా కొట్టండి. క్యాష్ అయినా తెచ్చి ఇయ్యండి. ఇయ్యాల లాస్ట్ రోజు. నేను చెప్పలేదని అనుకోవద్దు. ఆయన బండి ఆపిన తరువాత మళ్లా.. ‘అయ్యా.. ఆపిండ్రంటే’ మనమేం సమాధానం చెప్పలేం. ఆయన మూడు రోజులబట్టి ‘ఏమైంది?’ అని టార్చర్ పెడుతుండు. అర్థం చేసుకుంటలేరు. అర్థం చేసుకొని అందరూ సహకరించాలని కోరుతున్నా..’ ఇదీ వాగుల్లో ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల డ్రైవర్లకు వచ్చిన ఆడియో హెచ్చరిక. ఈ ఆడియో వరంగల్ జిల్లాలో సోమవారం వైరల్ అయింది. ఇది రాష్ట్రంలో అడ్డూఅదుపులేని ఇసుకాసురుల దందాకు మచ్చుతునక.
పోలీసులను ముందుపెట్టి అధికార కాంగ్రెస్‌కు చెందిన బడానేత ఒకరు ఏర్పాటుచేసుకు న్న వసూల్ నెట్వర్క్. వరంగల్ జిల్లాలో ఓ ప్రజాప్రతినిధి కొడుకు ఆకేరువాగు పరీవాహక ప్రాంతంలో ఇసుక అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ యజమానుల నుంచి నెలనెలా పోలీసులను ముందుపెట్టి నడిపిస్తున్న, బాజాప్తా చేస్తున్న వసూళ్ల దందా ఇలా ఆడియో రూపంలో బట్టబయలైంది. గొలుసుకట్టు చెరువులకు ఆలవాలమైన వరంగల్‌లో ఊరికి ఒకరిని పెట్టుకొని ట్రా క్టర్‌కు రూ.2 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు మండలాల పరిధిలోని ఆకేరువాగు పరీవాహక ప్రాంతంలో ఈ వసూళ్ల బాగోతం న డుస్తున్నది. ఆకేరువాగు పరీవాహక ప్రాంతంలో వందల ట్రాక్టర్లు ఉన్నాయని, ట్రాక్టర్‌కు రూ.2 వేల చొప్పున ఎంతలేదన్నా కనీసం రూ.20 నుంచి రూ.25 లక్షలు ‘మాములూ’గానే వసూలు అవుతాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
క్రమం తప్పకుండా నిర్దేశిత మొత్తం ట్రాక్టర్ల డ్రైవర్ లేదా యజమాని చెల్లించా రా సరే సరి.. లేదంటే వారికి ఇసుక మాఫియా చుక్కలు చూపిస్తున్నది. ప్రతి గ్రా మంలో ఉన్న ట్రాక్టర్ల యజమానుల నుంచి ఒక మనిషి వచ్చి మామూళ్లు వసూ లు చేసుకొని వెళ్తాడు. వాటిని తనకు అటా చ్ చేసిన మండల ప్రతినిధికి ఇచ్చి వెళ్లాలి. మామూళ్లు ఇవ్వని యజమాని ట్రాక్టర్ నంబర్ సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిపోవడం, పోలీసులు సదరు ట్రాక్టర్‌ను పట్టుకోవడం, సీజ్ చేయడం, ఆపై మైనింగ్, రెవెన్యూ శాఖలకు అప్పగించడం చకచకా జరిగిపోతాయట. దీంతో రోజుల తరబడి, కొన్నిసార్లు వారాలు, నెలల తరబడి సదరు ట్రాక్టర్ల యజమానులు అష్టకష్టాలు పడాల్సిందేనట. దీంతో గతానుభవాలను దృష్టిలో ఉంచుకొని అక్కడిదాకా వెళ్లొద్దనే ఉద్దేశంతో ట్రాక్టర్ల యజమానులు అడిగినంత ముట్టజెప్తున్నట్టు తెలుస్తున్నది.