Congress | హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు మేకపోతు గాంభీర్యమేనని తెలుస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ గ్రామాలలో కనీసం వార్డు మెంబర్ స్థాయి నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరటానికి ఆసక్తి చూపటం లేదని ఆ పార్టీ గ్రామ స్థాయి వర్గాల్లోనే చర్చ జరుగుతున్నది. ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో ఇతర పార్టీల కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరటానికి ఆసక్తి చూపించారని, కానీ ఇప్పడా పరిస్థితి లేదని క్షేత్రస్థాయిలోని ఆ పార్టీ శ్రేణులే చెప్తున్నారు. ప్రభుత్వం స్థానిక ఎన్నికల కోసం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితిని అంచనా వేయడానికి ‘నమస్తే తెలంగాణ’ ప్రయత్నించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదని పరిపాలనలోనూ విఫలమైందని గ్రామాల్లో చర్చ జరుగుతున్నది. వృద్ధులు రూ. 4000 పింఛన్ కోసం, మహిళలు రూ.2000 పెన్షన్ కోసం హామీలను నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని, తాము కూడా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశామని కార్యకర్తలు తెలిపారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత నాయకులు ప్రజలను మోసం చేశారని కార్యకర్తలు భావిస్తున్నారు.
సంక్రాంతి పండుగ తరువాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనతో ఉన్నట్టు మంత్రులు లీకులిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు గ్రామాలలో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో గెలువగలిగే నేతల కోసం ఆరా తీస్తున్నారు. కానీ ఈ సమావేశాలకు తగిన స్పందన లేదని ఆ పార్టీ కార్యకర్తలే చెప్తున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా.. ఇప్పటివరకు ఎమ్మెల్యేలకు రూపాయి నిధులు ఇవ్వలేదని, గ్రామాల్లో అభివృద్ధి పనుల కింద తట్టెడు మట్టి కూడా పోయలేదని వారు అంటున్నారు. ఎమ్మెల్యేలకు నిధులు లేకపోవటంతో గ్రామీణ వనరుల మీద దృష్టి పెట్టి అవినీతికి పాల్పడుతున్నట్టు చెప్తున్నారు.
గ్రామం, మండలం, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు చేయగలిగిన ప్రతి పనికో రేటు ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నారని కరీంనగర్ జిల్లా తిమ్మాపురం మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ దిగువ శ్రేణి నేత తన అనుభవాన్ని వివరించారు. రైతులు తోడుకునే ఇసుక, మట్టికి కూడా ట్రిప్పుకు రూ.1000 చొప్పున వసూలు చేస్తున్నట్టు చెప్తున్నారు. గతంలో ట్రిప్పుకు రూ.200 నుంచి రూ.300 వరకు గ్రామ సర్పంచ్ వసూలు చేసేవారని, ఇప్పుడు ప్రజాప్రతినిధులే నేరుగా అడుగుతున్నారని చెప్పారు. పోలీసుస్టేషన్లో ఇరుగుపొరుగు పంచాయితీలు, భార్యభర్తల పంచాయితీలలో ఎస్ఐకి ఒక మాట చెప్పమని ఎమ్మెల్యేలకు ఫోన్ చేస్తే మనకు ఏమన్నా ఇస్తారా అని అంటున్నారని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకుచెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వాపోయారు.
బీసీ సామాజిక యువకులు ప్రభుత్వం మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. బీసీ సంక్షేమం కోసం 65 హమీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని చెప్పారని, ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్ కాంట్రాక్టుల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారని కానీ ఒక్కటి కూడా అమలు చేయలేదని వారు మండిపడుతున్నారు. బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్వయం ఉపాధి, ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు వడ్డీ రహిత తాకట్టు లేని రుణాలు ఇస్తామని చెప్పి మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పాలకులు హైదరాబాద్‌లో ఉండి మాట్లాడటం కంటే గ్రామాల్లోకి వచ్చి చూస్తే కాంగ్రెస్ పాలన ఎట్లా ఉందో అర్థం అవుతుంది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వృద్ధాప్య పింఛన్ టంచన్‌గా వచ్చేది. కాంగ్రెస్ రూ.4000 పింఛన్ అని హామీ ఇవ్వటంతో అవ్వాతాతలు కాంగ్రెస్ వైపు చూశారు. రూ.4000 సంగతి దేవుడెరురు రూ.2016 కోసమే కళ్లలో ఒత్తులు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. అన్ని వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక సన్న వడ్లకే ఇస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చింది. కేసీఆర్ రైతుల మీద ఈగ వాలనియ్యలేదు.
-మెంతబోయిన సింహాద్రి, కర్విరాల కొత్తగూడెం, సూర్యాపేట జిల్లా
పెండింగ్‌లో ఉన్న కాంట్రాక్టు బిల్లులు ఇప్పిస్తామంటూ మాజీ సర్పంచులు, ఉప సర్పంచులను, ఎంపీటీలు, జెడ్సీటీలను ఎర వేసి లాగాలని కాంగ్రెస్ పార్టీ నేతలు చూస్తున్నారు. ఎన్నికలకు అయ్యే ఖర్చుకూడా భరిస్తామని హామీలు ఇస్తున్నారు. కానీ ఒక్కరు కూడా ఆ పార్టీలోకి వెళ్లటానికి ఇష్టపడటం లేదు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు. జనం మళ్లీ కేసీఆర్ రావాలె అంటున్నారు.
– గూడెల్లి అంజనేయులు, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు గునుకులకొండాపూర్, కరీంనగర్ జిల్లా
మా దగ్గర కాంగ్రెస్‌కు అభ్యర్థులే దొరకరు. మెజార్టీ గ్రామాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులనే ఏకగ్రీవంగా ఎన్నుకోవటానికి జనం సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చింది. రెసిడెన్షియల్ స్కూల్ పిల్లలకు కనీసం పరిశుభ్రమైన ఆహారం పెట్టలేకపోతున్నది. ఈ ప్రభుత్వం నిలబెట్టిన అభ్యర్థులకు ఓటు వేస్తే స్కూల్ పిల్లల మరణాలకు మద్దతు తెలిపినట్టే.
– పర్శ కృష్ట, దుబ్బాక, సిద్దిపేట జిల్లా