చెన్నారావుపేట, డిసెంబర్ 13 : వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో సర్పంచ్ అభ్యర్థి బ్యాలెట్ పత్రం బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నదని ఆ పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు బ్యాలెట్ పత్రం మార్చాలంటూ మండల ఎన్నికల అధికారి వెంకట శివానంద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ చెన్నారావుపేటలో 9 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉండగా, వారి గుర్తులు ఉన్న బ్యాలెట్ పేపర్ వరుసగా కాకుండా పక్కపక్కన వచ్చేలా రూపొందించారని తెలిపారు. బ్యాలెట్ పేపర్ మడిచినప్పుడు సిరా మరకలు మరో గుర్తుపై పడి ఓటు చెల్లకుండా పోతుందని తెలిపారు.
7వ నంబర్ గురు,్త 2వ నంబర్ పక్కనే రావడంతో ఓటరు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉన్నదని, బీఆర్ఎస్ అభ్యర్థికి నష్టం కలుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ నేతల ఒత్తిడితోనే ఇలా చేశారని పేర్కొన్నారు. ఇది తమ పరిధిలో అంశం కాదని, డీపీవో, కలెక్టర్‌ను సంప్రదించాలని ఎంపీడీవో సూచించారు.