మరీ ఇంత అరాచకమా?
మరీ ఇంత అన్యాయమా?
అధికారం కోసం ఏదైనా చేస్తారా?
ఎంతకైనా దిగజారుతారా?
రాజకీయ ప్రయోజనాల కోసం వివిధ రాష్ర్టాల్లో విద్వేషపు మంటలు రేపుతున్న బీజేపీ.. ఇప్పుడు మరింత నీచానికి తెగబడింది. తెలంగాణలో మత చిచ్చు ప్రయత్నాలు ఫలించకపోవడంతో లక్షలాది మంది తెలంగాణ బిడ్డల భవిష్యత్తుతో చెలగాటమాడే దుస్సాహసం చేసింది.
మొన్న టీఎస్పీఎస్సీ పరీక్షల పేపర్ల లీకేజీ.. దానిలో ప్రధాన నిందితుడు రాజశేఖర్‌రెడ్డి.. కాషాయ కండువా కప్పుకున్న బీజేపీ కార్యకర్త.
నిన్న టెన్త్ తెలుగు పేపర్ లీకేజీ చేసిన టీచర్‌కు క్రిమినల్ రికార్డు.. నేర చరిత.. అతడు పేపర్ లీక్ చేయగానే టెన్త్ పేపర్ లీకేజీ అంటూ వ్యాప్తి చేసింది బీజేపీ పరివారం, దాని అనుబంధ ఉపాధ్యాయ సంఘం..
నేడు టెన్త్ హిందీ ప్రశ్నపత్రం లీకేజీ.. చేసింది మాజీ టీవీ జర్నలిస్టు, బండి సంజయ్ అనుచరుడు ప్రశాంత్.
బీఆర్ఎస్ను, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నేరుగా ఎదుర్కొనలేక, ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించి కెమెరాల సాక్షిగా దొరికిపోయి, కేసులతో బెదిరించాలని ప్రయత్నించి విఫలమైన బీజేపీ నేతలు ఇప్పుడు తెలంగాణ పిల్లల భవిష్యత్తును రాజకీయ చదరంగంలో పావుగా పెడుతున్నారు.
‘కొలువులు, చదువులు వదిలేయండి.. బీజేపీ కోసం పనిచేయండి’ అంటూ యువతకు, విద్యార్థులకు బండి సంజయ్ పిలుపు ఇచ్చినప్పుడే అనుమానాలు తలెత్తాయి! ఆ అనుమానాలకు ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆధారాలు, నిందితులతో సంబంధాలు బయటపడుతున్నాయి.
మొన్న గ్రూప్-1.. నిన్న టెన్త్ తెలుగు పేపర్.. నేడు టెన్త్ హిందీ పేపర్! తొమ్మిదేండ్లుగా పకడ్బందీగా సాగిన పరీక్షల క్రతువు.. ఎన్నికల ముంగి ట ఇప్పుడే ఎందుకు ఒడిదుడుకులకు లోనవుతున్నది? ఎన్నికలు జరిగే రాష్ర్టాల్లో అకస్మాత్తుగా మత అల్లర్లు చెలరేగినట్టు ఎన్నికల ముందు రాష్ట్రంలో పేపర్ల లీకేజీ ఎందుకు జరుగుతున్నది? దీని వెనుక ఏ కుట్ర అల్లబడి ఉన్నది? ఎవరి ప్రయోజనాలు దాగున్నాయి?
పరీక్ష మొదలైన తర్వాత ప్రశ్నపత్రం బయటకు వస్తున్నది. దీని వల్ల ఎవరికి లాభం? ప్రశ్న పత్రం బయటకు వచ్చినంత మాత్రాన జవాబులు లోపలికి ఎట్ల పోతయ్? పోనీ, జవాబులు పంపిద్దామనే ప్రశ్న పత్రం బయటకు తెచ్చారనుకుందాం. మరి దాన్ని వాట్సాప్‌లో ఎందుకు పెడుతున్నట్టు? ఎవరు పెడుతున్నట్టు? ఎవరు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తి చేస్తున్నట్టు? దీని వల్ల ఎవరికి లాభం? విషయం సుస్పష్టం!
మాణికె నిండింది! భాండం బద్ధలైంది! టీఎస్పీఎస్సీ పేపర్ లీకంటూ నానా హంగామా చేసి రోజులు గడవక ముందే ప్రధాన నిందితుడు రాజశేఖర్‌రెడ్డి- బీజేపీ బంధాలు బయటపడ్డాయి. టెన్త్ హిందీ పేపర్ అవుట్ నిందితుడు బూరం ప్రశాంత్.. బండి సంజయ్ అనుచరుడని తేలింది. సిట్ ముందుకు రమ్మంటే రాకుండా ఆధారాలు ఇవ్వకుండా పేపర్ల లీక్‌పై నిన్నటిదాకా చవకబారు ఆరోపణలతో రెచ్చిపోయిన సంజయ్.. ఇప్పుడు తెలంగాణ ప్రజల ముందు దోషి.
టెన్త్ హిందీ పేపర్‌ను వాట్సాప్‌లో వ్యాప్తి చేసిన బండి సంజయ్ అనుచరుడు ప్రశాంత్‌ను విడుదల చేయాలంటూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ ముందు మంగళవారం రాత్రి ఆందోళన చేస్తున్న హనుమకొండ బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, అధికార ప్రతినిధి రాకేశ్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి బీజేపీ పెను కుట్రకు తెరతీసిందా? ‘పరీక్షల ప్రశ్న పత్రాల లీకేజీ’ అనే గందరగోళాన్ని సృష్టించి సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై బురద చల్లడానికి పన్నాగం పన్నిందా? తమ స్వార్థ రాజకీయం కోసం రాష్ట్ర భవిష్యత్తుతో, లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో, లక్షల మంది తల్లిదండ్రుల ఆశలతో ఆడుకొంటున్నదా? పోలీసులు, విద్యారంగ మేధావులు, వివిధ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నది. ఇటీవల టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీ వెనుక బీజేపీ హస్తం ఉన్నదని అనుమానాలు రాగా, మంగళవారం నాటి హిందీ పేపర్ లీకేజీతో కుట్ర మొత్తం బీజేపీ కనుసన్నల్లోనే సాగుతున్నదని విస్పష్టంగా బయటపడింది. ఇందుకోసం బీజేపీ తన పార్టీతోపాటు సంఘ్ కార్యకర్తలు, పార్టీ సానుభూతిపరులను వాడుకొంటున్నట్టుగా వరుస ఘటనలను చూస్తే స్పష్టంగా అర్థమవుతున్నది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ నిందితుడు రాజశేఖర్‌రెడ్డి బీజేపీ సానుభూతిపరుడుకాగా, పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం బయటకు తెచ్చిన నిందితుడు ఏకంగా బీజేపీ నేతలందరితో సన్నిహిత సంబంధాలున్న కీలక కార్యకర్త. తెలుగు పేపర్ లీకేజీ పాత్రధారులు కూడా బీజేపీకి అనుకూలురని చెప్తున్నారు. హిందీ పేపర్ లీకేజీ నిందితుడు బూరం ప్రశాంత్‌ను విడుదల చేయాలంటూ బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ వరంగల్ కమిషనరేట్ వద్ద ఆందోళన చేయడం బీజేపీకి, నిందితుడికి మధ్య సంబంధాలను తేటతెల్లం చేస్తున్నది.
ఓ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టెన్త్ పేపర్ లీకేజీ నిందితుడు ప్రశాంత్ (ఫైల్ )
మంగళవారం కమలాపూర్ నియోజకవర్గంలో పరీక్ష జరుగుతుండగానే పదో తరగతి హిందీ ప్రశ్నపత్రాన్ని బయటకు తెచ్చిన వ్యవహారం కూడా బీజేపీ కుట్రేనని స్పష్టంగా తేలిపోయింది. పేపర్ బయటకు వచ్చింది బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సొంత నియోజకవర్గమైన జగిత్యాల జిల్లా కమలాపూర్‌లో. ప్రధాన నిందితుడు బూరం ప్రశాంత్ బీజేపీ నేతలకు సన్నిహితుడు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి అనుచరుడు, ఆ పార్టీలో కీలక కార్యకర్త. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ కే లక్ష్మణ్, మాజీ ఎంపీ, గవర్నర్ దత్తాత్రేయ వంటి నేతలతో అతడికి పరిచయాలున్నట్టు తెలస్తున్నది. దీనిని బట్టి ఈ లీకేజీలు మొత్తం బండి సంజయ్ నేతృత్వంలోనే సాగుతున్నాయని, బీజేపీ శ్రేణులే సహాయం చేస్తున్నాయని స్పష్టమైనట్టు విద్యారంగ నిపుణులు చెప్తున్నారు.
పోలీసులు బయటపెట్టిన వివరాలను బట్టి చూస్తే బూరం ప్రశాంత్ ఓ బాలుడిని రెచ్చగొట్టి కమలాపూర్ నియోజకవర్గం ఉప్పల్‌లోని ప్రభుత్వ స్కూల్ పరీక్ష కేంద్రం నుంచి ప్రశ్న పత్రాన్ని బయటికి తెప్పించాడు. ఆ తర్వాత ఉదయం 10:46 గంటల నుంచి వాట్సాప్ గ్రూపులకు చేరవేశాడు. పేపర్ లీక్ అయ్యిందని స్వయంగా బ్రేకింగ్ న్యూస్ అంటూ వార్త రాసి వరంగల్ మీడియా గ్రూపుల్లో వేశాడు. హైదరాబాద్‌లోని పలువురు బ్యూరో ఇన్చార్జిలకు సైతం బ్రేకింగ్ న్యూస్ అంటూ పంపించాడు. ఉదయం 11:10 గంటలకు ప్రశాంత్ స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి వాట్సాప్‌లో హిందీ పేపర్‌ను పంపించాడు. ప్రశ్నపత్రం తన చేతికి వచ్చిన తర్వాత రెండుగంటల వ్యవధిలో ప్రశాంత్ ఏకంగా 142 ఫోన్ కాల్స్ మాట్లాడాడు. పేపర్ లీకైనట్టు వార్తలు ప్రసారం చేయాలని మీడియా ప్రతినిధులకు ఫోన్ చేసి చెప్పాడు. వందలమంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా బృందాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సమాచారాన్ని చేరవేసి, విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగేలా చేశాడు. రాష్ట్ర ప్రభుత్వానికి అప్రతిష్ఠ తెచ్చేలా వాట్సాప్, ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియాలో స్క్రిప్టులు రాసి పోస్టు చేశారు.
బీజేపీ ముఖ్య నేత లక్ష్మణ్‌తో ప్రశాంత్ (ఎడమ), టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసిన రాజశేఖర్ రెడ్డి కాషాయ కండువాలో (కుడి)
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. హిందీ పేపర్ లీక్‌కు ఒకరోజు ముందే స్కెచ్ వేసినట్టు తెలుస్తున్నది. సోమవారం సాయంత్రం 5:30 గంటల సమయంలో నిందితుడు బూరం ప్రశాంత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫోన్లో మాట్లాడుకొన్నారని సమాచారం. మంగళవారం పేపర్ లీక్ జరిగిపోవాలని, ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కుట్రలు పన్నారని ప్రచారం జరుగుతున్నది. ఇందులో ఓ మైనర్‌ను కూడా పావుగా వాడుకొన్నారని తెలుస్తున్నది. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరిగే ప్రతి రోజూ ఏదో ఒక జిల్లాలో పేపర్ లీక్ చేయాని బీజేపీ కుట్ర పన్నినట్టు అనుమానిస్తున్నారు.
ప్రశాంత్‌ను విడుదల చేయాలంటూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ఎదుట మంగళవారం రాత్ిర ఆందోళన చేస్తున్న బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ,
టీఎస్పీఎస్సీలో ప్రశ్నపత్రాల లీకేజీ కీలక నిందితుడు రాజశేఖర్‌రెడ్డి బీజేపీ కార్యకర్తే అన్నది అందరికీ తెలిసిందే. బీజేపీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ, ఆ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసిన చరిత్ర రాజశేఖర్‌రెడ్డిది. ఇది ఆధారాలతో సహా నిరూపితమైంది. అతడికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో సన్నిహిత సంబంధాలను నిరూపించే ఫొటోలు, ఆధారాలు బయటపడ్డాయి.
ప్రశాంత్‌ను విడుదల చేయాలంటూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ఎదుట మంగళవారం రాత్ిర ఆందోళన చేస్తున్న బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ,
పదో తరగతి తెలుగు పేపర్ లీక్ వెనుక కూడా బీజేపీ హస్తం ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ వ్యవహారంలో నిందితుడైన బందెప్పపై అనేక కేసులున్నాయి. నేర చరిత్ర ఉన్న బందెప్పను బీజేపీ నాయకులు నయానో, భయానో లోబరుచుకున్నట్టు సమాచారం. అతడి నుంచి ప్రశ్నపత్రాన్ని బయటికి తెప్పించి, వెంటనే లీకేజీగా చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున సర్క్యులేట్ చేశారని చెప్తున్నారు.
పదోతరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం అర్థరాత్రి కరీంనగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు, బండిని అదుపులోకి తీసుకొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకొని నానా హంగామా సృష్టించారు. దీంతో పోలీసులను భారీగా మోహరించి బండి సంజయ్‌ని అక్కడి నుంచి హైదరాబాద్ వైపు తరలించారు. కరీంనగర్ దాటిన తర్వాత ఎల్ఎండీ వద్ద వాహనం మొరాయించడంతో మరో వాహనంలో బండిని తరలించారు. హన్మకొండ జిల్లా కమలాపూర్‌లో మంగళవారం పదోతరగతి హిందీ పేపర్‌ను పరీక్ష కేంద్రం నుంచి బయటకు తెచ్చిన వ్యవహారంలో ప్రధాన నిందితుడైన బీజేపీ కార్యకర్త బూరం ప్రశాంత్.. ఆ ప్రశ్నపత్రాన్ని బండి సంజయ్‌కి వాట్సాప్‌ద్వారా పంపినట్టు పోలీసుల విచారణలో తేలింది. సోమవారం కూడా ప్రశాంత్‌తో బండి సంజయ్ ఫోన్లో మాట్లాడినట్టు ఆధారాలు లభించాయి. దీంతో బండిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నా రు. అంతకుముందు పోలీసులు అరెస్టు చేస్తారన్న అనుమానంతో బండి సంజయ్ మంగళ వారం అర్ధరాత్రి సిద్దిపేటలో ఆగకుండానే కరీంనగర్ వైపు వెళ్లిపోయారు. అర్ధరాత్రి ఆయన హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తూ సిద్దిపేటలోని రంగధాంపల్లి అమర వీరుల స్తూపం వద్ద మీడియాతో మాట్లాడతానని తెలిపారు. దీంతో మీడియా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. రంగధాం పల్లి వద్దకు రాగానే అక్కడి పరిస్థితిని చూసిన బండి సంజయ్ తనను అడ్డుకుంటారనే భయంతో ఆగకుండానే ముందుకు వెళ్లిపోయారు. దీంతో అక్కడ చేరిన వారంతా ‘బండి దొంగ.. దొంగ.. పారిపోతున్నాడు, అరెస్టు చేయండి’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. బండి తీరును నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డుపై బైఠాయించారు. చిన్నారుల జీవితాలతో ఆడుకుంటున్న బండిని శిక్షించాలని డిమాండ్ చేశారు.