Tenth Exams | వరంగల్ : పదో తరగతి పరీక్షలకు( Tenth Class Exams ) సంబంధించి మంగళవారం హిందీ ప్రశ్నపత్రం( Hindi Question Paper ) బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. పరీక్ష ప్రారంభమైన 77 నిమిషాలకు ప్రశ్నపత్రం వాట్సాప్ ద్వారా బయటకు వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే ఈ ప్రశ్నపత్రం బయటకు రావడం వెనుక ప్రతిపక్ష పార్టీ( Opposition Party )కి చెందిన నాయకుడి పాత్ర ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ నాయకుడు గతంలో ఓ న్యూస్ చానెల్ రిపోర్టర్‌గా కూడా పని చేసినట్లు పేర్కొన్నారు.
హిందీ ప్రశ్నపత్రం వాట్సాప్‌లో వైరల్ అయిన వ్యవహారంపై వరంగల్ సీపీ రంగనాథ్( Warangal CP Ranganath ) తెలంగాణ టుడే దినపత్రికతో ప్రత్యేకంగా మాట్లాడారు. హిందీ ప్రశ్నపత్రం లీక్ కాలేదన్నారు. క్వశ్చన్ పేపర్ బయటకు మాత్రమే వచ్చిందని స్పష్టం చేశారు. పరీక్ష ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కాగా, ఉదయం 10:47 గంటలకు ప్రశ్నాపత్రం బయటకు వచ్చిందన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, ఏ పాఠశాల నుంచి పేపర్ బయటకు వచ్చిందనే అంశంపై ఆరా తీస్తున్నామని తెలిపారు. అయితే గతంలో ఓ న్యూస్ చానెల్లో పని చేసిన రిపోర్టర్ హిందీ క్వశ్చన్ పేపర్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో అతను కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. అతనికి ఎవరు ప్రశ్నపత్రం పంపారనే విషయంపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. సాయంత్రం వరకు పూర్తిస్థాయి వివరాలు వెల్లడిస్తామన్నారు.