కరీమాబాద్/సంగెం, ఆగస్టు 16 : మామునూరు విమానాశ్రయ భూసేకరణ పూర్తి కావచ్చిందని ఊదరగొడుతున్న రాష్ట్ర ప్రభుత్వంపై వరంగల్ జిల్లా సంగెం మండలం గుంటూరుపల్లి రైతులు తిరగబడ్డారు. శనివారం బాధిత రైతులు గుంటూరుపల్లిలోని గవిచర్ల-నెక్కొండ రహదారిపై బైఠాయించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మాయమాటలు చెప్పి తమ భూములు ఇచ్చేందుకు ఒప్పుకునేదాకా వెంటపడ్డారని, తీరా ధర నిర్ణయం విషయంలో చేతులెత్తేస్తున్నారని మండిపడ్డారు. సమావేశాలను పెడుతూ కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని అన్నారు. ప్రభుత్వం ఎకరాకు రూ.2కోట్ల నుంచి రూ.3 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. నిరసనలు, అనేక పర్యాయాల చర్చల అనంతరం వ్యవసాయ భూములకు సర్కారు ఎకరాకు రూ.1.20 కోట్లు చెల్లిస్తామని ఒప్పుకొన్నది.
ఈ మేరకు కొంతమంది రైతులకు పరిహారం అందజేస్తున్నది. ఈ క్రమంలో గుంటూరుపల్లి వాసులు మాత్రం రోడ్డు సైడ్, లోపలి భూములకు ఒకే ధర చెల్లిస్తే ఒప్పుకొనేది లేదని తేల్చిచెప్పారు. గుంటూరుపల్లికి చెందిన 40మంది రైతులు 75 ఎకరాలను కోల్పోతున్నారు. రోడ్డుకు సమీపంలో ఉన్న తమ భూములకు ఎకరానికి రూ.3కోట్ల వరకు పలుకుతున్నదని ప్రభుత్వం కేవలం రూ.1.20 కోట్లు మాత్రమే చెల్లించడం దారుణమని అన్నారు. గతంలో ప్రజాప్రతినిధులు ఎయిర్పోర్టు నిర్మాణానికి అవసరమైన భూమిని ఇచ్చేవారికి ఆ మేరకు ఇతర ప్రాంతాల్లో భూమిని ఇస్తామని, లేదంటే రైతుల అభిప్రాయాలు, మార్కెట్ విలువకు అనుగుణంగా నష్టపరిహారం ఇస్తామని వాగ్దానం చేశారని వారు గుర్తుచేశారు. మంత్రిని, ఎమ్మెల్యేను కలిసేందుకు వెళ్తే వారు తమ బాధలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. తమకు న్యాయం చేయకపోతే ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేసుకుంటామని హెచ్చరించారు.