Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): సివిల్ తగాదాల్లో తలదూర్చొద్దని ఉన్నత న్యాయస్థానాలు చెప్పినా.. సాక్షాత్తూ పోలీసు బాస్ హెచ్చరించినా కొందరు పోలీసుల తీరు మారడం లేదు. బాధితులు డీజీపీ ఆఫీసుకు క్యూ కడుతున్నారు. తాజాగా వరంగల్ జిల్లా మామునూరు ఎస్హెచ్ఓ రమేశ్ రెండెకరాల భూ కబ్జాకు అండగా ఉన్నాడని, కబ్జాకోరుల నుంచి డబ్బులు తీసుకుంటూ తమకు అన్యాయం చేస్తున్నాడని బాధితులు మంగళవారం డీజీపీ జితేందర్‌ను కలిసి గోడు వెల్లబోసుకున్నారు. బాధితుడు సీహెచ్ రత్నాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. 2005లో ఇద్దరు పట్టాదార్, ముగ్గురు అనుభవదారులతో తిమ్మాపూర్ హవేలీలోని 125 సర్వే నంబర్లో మూడెకరాలను బాధితుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఆ భూమిపై కన్నేసిన ఉతం దీపక్ నకిలీ పత్రాలు సృష్టించి.. పోలీసులు, రెవెన్యూ అధికారుల సాయంతో రికార్డులు లేని మైదం ఐలయ్యను పట్టాదారుగా చూపించి కబ్జాకు యత్నిస్తున్నాడు.
ఇందుకు మామునూరు సీఐ రమేశ్ కబ్జాదారుల పక్షాన వహిస్తూ బాధితులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. కబ్జాదారుడు దీపక్.. సీఐ సమక్షంలోనే బాధితులను ‘ఈ రెండెకరాలే కాదు.. మీకున్న ఎకరం కూడా అమ్మేస్తా. ఏం చేస్తారో చేసుకోండి. ఎదురుతిరిగితే ఏమౌతారో మీకే తెలియదు’ అంటూ బెదిరిస్తున్నా.. సీఐ రమేశ్ వారించే ప్రయత్నం చేయలేదని డీజీపీ ఎదుట వారు కన్నీటి పర్యంతమయ్యారు. వీరితోపాటు భరత్‌కుమార్ అనే ఓ మాజీ పోలీసు.. ‘ఎంతోకొంత సెటిల్ చేసుకోవచ్చు కదా..’ అంటూ బాధితుల బంధువులకు ఫోన్ చేసి బెదిరిస్తున్నట్టు తెలిపారు. కాగా.. సీఐ రమేశ్‌ను గతంలో కూడా ఓ భూతగాదా కేసులో బదిలీ చేశారు. కబ్జాదారుడైన దీపక్‌పై 2012లో హన్మకొండకు చెందిన ఓ డాక్టర్‌ను కిడ్నాప్ చేసినట్టు బాధితులు డీజీపీకి తెలిపారు. వరంగల్ కమిషనర్ ద్వారా వివరాలు తెలుసుకొని చర్యలు తీసుకుంటామని డీజీపీ హామీ ఇచ్చారు.