సంగెం, ఆగస్టు 3: ఓ వైపు ఉపాధి లేకపోవడం.. మరోవైపు ఆటో కిస్తీలు కట్టకపోవడంతో ఫైనాన్షియర్ల వేధింపులతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఓ ఆటో డ్రైవర్ శనివారం గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా సంగెం మండలం కాట్రపల్లిలో జరిగింది. కుటుంబ సభ్యులు, గ్రామస్థుల కథనం ప్రకారం.. కాట్రపల్లికి చెందిన ఆటో డ్రైవర్ చింతిరెడ్డి రాంరెడ్డి(55) న్యూకాకతీయ ఆటో యూనియన్లో సభ్యుడు. కాంగ్రెస్ సర్కార్ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో ఆటోకు గిరాకీ లేక కొన్ని నెలలుగా ఇబ్బంది పడుతున్నాడు.
ఈ క్రమంలో మూడు నెలలుగా డబ్బులు ఎల్లక ఆటో ఫైనాన్స్ కిస్తీలు కట్టలేదు. దీంతో ఫైనాన్షియర్లు ఇంటికి వచ్చి డబ్బులు కట్టకపోతే ఆటో గుంజుకుపోతామని హెచ్చరించారు. రోజూ ఫోన్లు చేస్తూ డబ్బులు చెల్లించాలని, లేకపోతే ఆటో ఎక్కడ కనిపిస్తే అక్కడ గుంజుకుంటామని బెదిరించారు. చేతిలో చిల్లి గవ్వ లేక, కుటుంబం గడవని పరిస్థితిలో కిస్తీలు ఎలా కట్టాలని తీవ్ర మానసిక ఒత్తిడికిలోనైన రాంరెడ్డి శనివారం ఉదయం గుండెపోటుతో మృతిచెందాడు. ఆయనకు తల్లి, భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆటోడ్రైవర్ రాంరెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు.