హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): ప్రజాతీర్పుపై అధికార కాంగ్రెస్ కత్తిగట్టింది. అధికారమే పరమావధిగా బరితెగించింది. మున్సిపల్ పీఠాల కోసం అంతులేని దౌర్జన్యాలకు దిగుతున్నది. పట్టపగలే రాజ్యాంగ విలువలకు పాతరేస్తున్నది. మున్సిపల్ చైర్మన్ ఎన్నికల వేళ హస్తం పార్టీ గూండాగిరీ పరాకాష్టకు చేరింది. ఇప్పటికే అధికార, ధన బలంతో కొన్ని హంగ్ మున్సిపాలిటీలను అడ్డదారిన ఖాతాలో వేసుకున్నది. మిగిలిన చోట్ల కూడా దొడ్డిదారిన గద్దెనెక్కేందుకు కుట్రలు చేస్తున్నది. ఇష్టారాజ్యంగా రెచ్చిపోతూ ప్రజాస్వామ్య హననానికి ఒడిగడుతున్నది. బీఆర్ఎస్కు చెందిన దళిత, మహిళా నేతలపై దాడులకు దిగుతూ వారి గొంతునొక్కుతున్నది. అక్రమ కేసులు, అరెస్ట్‌లతో రాజ్యాంగ విలువలను మంటగలుపుతున్నది. గతంలో ఎన్నడూలేని విధంగా స్థానిక ఎన్నికల్లో దాష్టీకాలకు పాల్పడుతూ, దుర్మార్గాలకు తెగబడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నది. ప్రతిపక్ష కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ఇండ్లపై అర్ధరాత్రి వేళ దాడులకు దిగి కిడ్నాప్ చేస్తున్నది. అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు దిగుతూ పట్టపగలే ‘పట్టణ’ నడిబొడ్డున ప్రజాస్వామ్యాన్ని హతమారుస్తున్నది. మున్సిపల్ పీఠాలను దక్కించుకొనేందుకు కాంగ్రెస్ చేస్తున్న అక్రమ పర్వాన్ని చూసి తెలంగాణ సమాజం నివ్వెరపోతున్నది.
క్యాతనపల్లిలో మంత్రి కనుసన్నల్లో దౌర్జన్యకాండ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకొనేందుకు అధికార పార్టీ అడ్డదారులు తొక్కుతున్నది. పీఠమెక్కెందుకు ప్రజాతీర్పును కాలరాసే పన్నాగానికి దిగింది. మంత్రి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కనుసన్నల్లో అక్రమార్గంలో కైవసం చేసుకొనేందుకు యత్నిస్తున్నది. మొత్తం 22 వార్డుల్లో బీఆర్ఎస్ 14 స్థానాల్లో గెలుపొందింది. దీంతో సునాయాసంగా ఇక్కడ చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలను దక్కించుకొనే అవకాశమున్నది. అయితే కేవలం 7 చోట్ల గెలిసిన కాంగ్రెస్ మున్సిపాలిటీని దొడ్డిదారిన తన ఖాతాలో వేసుకొనేందుకు కుట్రలకు తెరలేపింది. గొడవలు సృష్టించి ఇప్పటికే రెండుసార్లు వాయిదా వేయించింది. ఎలాగైనా పీఠం దక్కించుకోవాలనే కసితో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై దాష్టీకానికి ఒడిగట్టింది. మంగళవారం అర్ధరాత్రి క్యాతనపల్లిలోని ఆయన ఇంటిని పోలీసు బెటాలియన్లు చుట్టుముట్టాయి. వివేక్ వాహనం ధ్వంసం చేశారనే నెపంతో, అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో బాల్క సుమన్‌పై అక్రమ కేసు బనాయించారు. బుధవారం మధ్యాహ్నం బలవంతంగా అరెస్ట్‌చేశారు. ఆయనను నిలువరించి క్యాతనపల్లి మున్సిపాలిటీని గెలుచుకొనేందుకు అధికార కాంగ్రెస్ గూండాగిరీకి పాల్పడిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
జనగామలో దళిత మహిళా కౌన్సిలర్‌పై దాడి
వరంగల్ జిల్లా జనగామలో అడ్డదారిలో మున్సిపల్ పీఠం కైవసం చేసుకున్న కాంగ్రెస్ నాయకులు ఈ క్రమంలో అంతులేని అరాచకాలకు పాల్పడ్డారు. బీఆర్ఎస్కు మద్దతుగా చేతి ఎత్తిన దళిత మహిళా కౌన్సిలర్‌పై అధికారుల సమక్షంలోనే కాంగ్రెస్ గూండాలు దాడులు చేశారు. అక్కడే ఉన్న పోలీసులు గుడ్లప్పగించి చూశారే తప్ప కనీసం నిలువరించలేదు. అలాగే తొర్రూరులోనూ అధికార పార్టీ నాయకులు బరితెగించారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురిచేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును అడ్డుకొని దొడ్డిదారిలో మున్సిపల్ పీఠాన్ని గెలుచుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే జహీరాబాద్, ఇస్నాపూర్లోనూ కాంగ్రెస్ పార్టీ ప్రజాతీర్పును పరిహసిస్తూ తమ ఖాతాలో వేసుకున్న తీరును ప్రజాస్వామికవాదులు ఆక్షేపిస్తున్నారు.