మంచిర్యాల, ఫిబ్రవరి 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : క్యాతనపల్లి మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులకు ఎన్నికలు నిర్వహించగా బీఆర్ఎస్- సీపీఐ కూటమి కలిసి 14 వార్డుల్లో గెలుపొందాయి. బీఆర్ఎస్ 10, సీపీఐ 4 వార్డులు గెలువగా, అధికార కాంగ్రెస్ 7 వార్డుల్లోనే గెలిచింది. ఇటీవలి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అతి తక్కువ గ్రామాల్లో గెలువడం, ఇప్పుడేమో ఉన్న రెండు మున్సిపాలిటీల్లో ఒక మున్సిపాలిటీలో ఘోరమైన ఓటమి చవిచూడడంతో మంత్రి వివేక్ క్యాతనపల్లి మున్సిపాలిటీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. దీంతో క్యాతనపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరుగకుండా అడ్డుకునేందుకు కుట్రలు చేస్తూ వస్తున్నారు. 13న ఎన్నికల ఫలితాలు వెల్లడించిన తర్వాత గెలిచిన బీఆర్ఎస్-సీపీఐ కౌన్సిలర్లు భద్రాచలం వెళ్లారు.
అక్కడ రాముల వారి దర్శనం చేసుకున్న అనంతరం స్థానిక నందిని హోటల్లో క్యాంప్‌లో ఉన్నారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు, పోలీసులతో కలిసి సరిగ్గా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు ఒక రోజు ముందు 15వ తేదీ రాత్రి హోటల్‌పై దాడికి ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న బాల్క సుమన్ ముందుగానే కౌన్సిలర్లను అలర్ట్ చేసి వాహనాల్లో భద్రాచలం నుంచి మంచిర్యాలలోని క్యాతనపల్లి లోని తన నివాసానికి తీసుకొచ్చారు. ఇరు పార్టీల నుంచి గెలిచిన 14మంది కౌన్సిలర్లను తన వెంటే ఉంచుకొని మరుసటి రోజు సోమవారం ఉదయం 11 గంటలకు ఎన్నిక కోసం తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే పోలీసులు అడ్డుకున్నారు. క్యాతనపల్లి ఫ్లై ఓవర్ ఎంట్రెన్స్‌లో కౌన్సిలర్లు, నాయకులను దాదాపు అరగంట పాటు ఆపారు. బీఆర్ఎస్-సీపీఐ కౌన్సిలర్లు మున్సిపాలిటీకి వెళ్లకుండా అడ్డుకొని ఎన్నికను మరుసటి రోజుకు వాయిదా వేయించారు. మంగళవారం ఉదయం మరోసారి బాల్క సుమన్ బీఆర్ఎస్ ఎన్నికల పరిశీలకురాలు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మితో పాటు కౌన్సిలర్లను తీసుకొని, పోలీసుల సూచనల మేరకు నాలుగు వాహనాల్లో మున్సిపల్ ఎన్నికకు బయల్దేరారు.
కానీ పోలీసులు క్యాతనపల్లి ైప్లెఓవర్ ఎంట్రెన్స్‌లో మరోసారి ఆపేశారు. బీఆర్ఎస్ నాయకులకు ఎవరికీ అనుమతి లేదని, కేవలం గెలిచిన కౌన్సిలర్లు మాత్రమే వెళ్లాలని చెప్పారు. దానికి బీఆర్ఎస్ అంగీకరించినప్పటికీ.. మిస్సింగ్ కేసు పేరిట 21వ వార్డు కౌన్సిలర్ స్వర్ణలతను అక్కడే ఆపేసి, మిగిలిన 13మందిని మున్సిపాలిటీకి పంపించారు. బాల్క సుమన్ నిన్ను కిడ్నాప్ చేసినట్లు కేసు పెట్టారని రోడ్డుపైనే ఆమెను విచారించారు. దానికి సదరు కౌన్సిలర్ తన ఇష్టప్రకారమే బీఆర్ఎస్ క్యాంప్‌లో ఉన్నానని, ఎవ్వరూ కిడ్నాప్ చేయలేదని కుండబద్దలు కొట్టారు. దీంతో ఆమెను మున్సిపల్ కార్యాలయానికి పంపాలని పోలీసులను బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఆమెను టూవీలర్‌పై తీసుకెళ్లి క్యాతనపల్లి మున్సిపల్ ముందు దింపారు. మున్సిపల్ కౌన్సిల్లో కౌన్సిలర్ల ప్రమాణం పూర్తయ్యాక.. ప్రమాణ చేసే రోజే మద్యం తాగి కౌన్సిల్‌కు వచ్చిన ముగ్గురు కాంగ్రెస్ కౌన్సిలర్లు బీఆర్ఎస్-సీపీఐ కౌన్సిలర్లపై దాడికి ప్రయత్నించారు. అడ్డుకునేందుకు వెళ్లిన మహిళా కౌన్సిలర్లతో అసభ్యంగా ప్రవర్తించారు. అక్కడే ఉన్న మంత్రి వివేక్, ఎంపీ వంశీ అడ్డుకోకుండా చోద్యం చూశారు. కాసేపటికి గొడవ పేరిట ఎన్నికను మరోసారి వాయిదా వేశారు.
బీఆర్ఎస్కు ఒక రూల్.. కాంగ్రెస్‌కు మరో రూల్
బాల్క సుమన్ సహా బీఆర్ఎస్ నాయకుల అరెస్టుపై స్థానికులు మండిపడుతున్నారు. ముందు రాళ్లు విసిరి గొడవకు ప్రేరేపించిన కాంగ్రెస్ నాయకులకు వదిలేసి, కేవలం మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సహా మరో 8 మంది నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్టు చేయడాన్ని తప్పుబడుతున్నారు. ప్రజాతీర్పును గౌరవించకుండా, అధికారులు, పోలీసులతో కలిసి అధికార పార్టీ దౌర్జన్యాలకు తెరలేపడం, తప్పును నిలదీసిన బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.