నర్సంపేట, మే 20 : జమ్మూకశ్మీర్‌లో నర్సంపేటకు చెందిన ఆర్మీ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు రోజుల తర్వాత స్వగ్రామమైన వరంగల్ జిల్లా నర్సంపేటకు అతడి మృతదేహం చేరుకోగా, అశ్రునయనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వివరాలిలా ఉన్నాయి. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణం సర్వాపురం 4వ వార్డుకు చెందిన సంపంగి మల్లయ్య-విజయ దంపతులకు ముగ్గురు సంతానం.
చిన్న కుమారుడు నాగరాజు(28) 2016లో ఆర్మీ జవాన్‌గా ఎంపికయ్యాడు. మూడేళ్లుగా జమ్మూకశ్మీర్ సరిహద్దు ప్రాంతం సాంబ సెక్టార్లో బీఎస్ఎఫ్ జవాన్‌గా పనిచేస్తున్నాడు. మార్చిలో సెలవుపై నర్సంపేటకు వచ్చి తల్లిదండ్రులతో గడిపాడు. ఆర్మీ ఉన్నతాధికారుల పిలుపుమేరకు ఏప్రిల్ 23న విధుల్లో చేరాడు. అప్పటినుంచి నిత్యం తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడేవాడు. ఈ క్రమంలోనే మానసిక ఆందోళనకు గురైన నాగరాజు ఆదివారం బెటాలియన్‌లో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
గడిచిన 12 నెలల వ్యవధిలోనే ఇదే కుటుంబం నుంచి అన్నదమ్ములు మృతి చెందారు. ఆర్మీ జవాన్ నాగరాజు అన్నయ్య వెంకటేశ్ ఏడాది క్రితం మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అన్నదమ్ముల మృతి ఆ కుటుంబ సభ్యులను తీవ్రంగా కలచివేసింది. వృద్ధులైన తల్లిదండ్రులకు ప్రభుత్వం అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు.