Revanth Guest House | హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : ఓ వైపు పేదలకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లను రకరకాల సాకులు చెప్తూ రద్దు చేస్తున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం… అతిథి గృహం పేరుతో అవసరం లేకున్నా చేపట్టిన సీఎం క్యాంపు కార్యాలయం నిర్మాణ పనులు మాత్రం ఆగమేఘాలపై చేస్తున్నది. భవనానికి ఇంకా ఎలాంటి అదనపు హంగులు కల్పించాలి? అదనంగా ఎన్ని నిధులు అవసరమవుతాయి? అతిథిగృహం ఎప్పటిలోగా అందుబాటులోకి రావొచ్చు? అనే అంశాలపై ఇటీవల ఓ నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేయడం గమనార్హం. ఎంతో కాలంగా సీఎం అధికారిక నివాసంగా ఉన్న ప్రగతిభవన్‌ను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉప ముఖ్యమంత్రి, మరో మంత్రి నివాసాలకు ఉపయోగిస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో రేవంత్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం కోసం వివిధ భవనాలను పరిశీలించారు. నానక్‌రామ్‌గూడలోని గ్రోత్ కారిడార్ భవనం, బేగంపేటలోని మెట్రో భవన్, పైగా ప్యాలెస్, కమాండ్ కంట్రోల్ సెంటర్ తదితర భవనాలు ఇందులో ఉన్నాయి.
అనంతరం చాలాసార్లు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో కూడా సీఎం పలు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడే వీవీఐపీ అతిథిగృహం పేరుతో సరికొత్త భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. అది సీఎం నివాసానికి అతి దగ్గరలో ఉండటంతో దాన్ని క్యాంపు కార్యాలయంగా ఉపయోగిస్తారనే ప్రచారం కూడా జరిగింది. ఆ నిర్మాణం కోసం నిరుడు మార్చిలో ప్రభుత్వం రూ.7 కోట్లు మంజూరు చేసింది. రెండు అంతస్థుల్లో దాదాపు 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాన్ని నిర్మించాలని మొదట నిర్ణయించారు. సుమారు ఎకరం విస్తీర్ణంలో చేపట్టిన ఈ భవన నిర్మాణం వ్యయం ఇప్పుడు మూడు రెట్లు పెరిగినట్టు సమాచారం. భవనాన్ని మరింత విస్తరించడంతోపాటు అందులో ఫైవ్‌స్టార్ హోటల్ తరహాలో సకల సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇందులో భాగంగా భవనంలో ఏర్పాటుచేయాల్సిన అత్యాధునిక ఫర్నిచర్, ఇతర సౌకర్యాలు, పెరగనున్న వ్యయం, త్వరితగతిన పూర్తిచేయడం వంటి అంశాలపై నివేదిక సమర్పించేందుకు నిపుణుల కమిటీ కసరత్తు చేస్తున్నదని ప్రభుత్వవర్గాలు చెప్తున్నాయి. భవన నిర్మాణ వ్యయం మూడు రెట్లకుపైగా పెరుగుతున్నట్టు సమాచారం.
పేదలదందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని ఎన్నికల సందర్భంగా ప్రకటించిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత మంజూరు చేసిన ఇండ్లను కూడా రద్దు చేసేందుకు కారణాలను వెతుకుతున్నదని ప్రజలు మండిపడుతున్నారు. సుమారు 450-600 చదరపు అడుగుల వరకు నిర్మాణం చేసుకోవచ్చని మొదట ప్రకటించిన ప్రభుత్వం.. ఇంటి నిర్మాణం మొదలయ్యాక స్థలం తక్కువ ఉందని, ఎక్కువగా ఉందనే చిన్నచిన్న కారణాలతో ఇండ్లను రద్దుచేస్తున్నది. ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో చాలా మంది లబ్ధిదారులు.. తమ పాత ఇండ్లను కూలగొట్టుకొని కొత్త ఇంటి నిర్మాణానికి సిద్ధమయ్యారు. ప్రభుత్వం తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయాలతో ఇల్లు ఉంటుందో.. రద్దు అవుతుందో అర్థం కావడంలేదని వారంతా లబోదిబోమంటున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 20వేల పైచిలుకు ఇండ్లు రద్దు కావడం వారి ఆందోళనకు కారణంగా చెప్పవచ్చు. అంతేకాదు, హైదరాబాద్ సహా పట్టణ ప్రాంతాల్లో స్థలాలు లేవనే కారణంతో జీ+3 పద్ధతిలో ఇండ్లు నిర్మిస్తామని ప్రకటించినప్పటికీ, ఇంతవరకు ఎక్కడా స్థలాల గుర్తింపు కూడా పూర్తికాలేదు. నిధుల విషయానికొస్తే.. ప్రభుత్వం ప్రకటించిన 4.5లక్షల ఇండ్లకు రూ. 22,500 కోట్ల నిధులు అవసరం కాగా.. ఇప్పటివరకు ప్రభుత్వం లబ్దిదారులకు విడుదల చేసింది కేవలం రూ. 300 కోట్ల లోపే కావడం గమనార్హం. అలాగే ఇప్పటివరకు కేవలం 3 లక్షల ఇండ్లను నామమాత్రంగా మంజూరు చేసిన ప్రభుత్వం.. అందులో ఒక్క ఇంటి నిర్మాణాన్ని కూడా పూర్తిచేయలేదు. పేదలకు కేటాయించిన ఇందిరమ్మ ఇండ్లను రద్దు చేసేందుకు ప్రభుత్వం సాకులు వెతుకుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీవీఐపీ అతిథిగృహం పేరుతో నిర్మిస్తున్న సీఎం క్యాంపు కార్యాలయాన్ని మాత్రం సర్వహంగులతో ఆగమేఘాలపై అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పనులు చేస్తుండడం అనుమానాలకు తావిస్తున్నదని పలువురు చెప్తున్నారు.
ప్రభుత్వ ఆధీనంలోని చాలా గెస్ట్‌హౌస్‌లు ఇప్పటికే నిరుపయోగంగా ఉన్నాయి. గ్రీన్‌ల్యాండ్, దిల్కుషా, ఇందిరాపార్క్ గెస్ట్హౌస్లతోపాటు పర్యాటకశాఖకు చెందిన తారామతి బారాదరి, హరిత ప్లాజా, శిల్పారామం తదితర భవనాలను గెస్ట్‌హౌస్‌లుగా ఉపయోగించుకునే వీలున్నది. అంతేకాదు, కొత్తగా నిర్మించిన సచివాలయంలో కూడా ముఖ్యమైన అతిథుల కోసం పైఅంతస్థుల్లో అత్యాధునిక హంగులతో గెస్ట్‌హౌస్‌లు నిర్మించారు. రాష్ట్ర విభజన తర్వాత పలువురు మంత్రుల బంగ్లాలను ప్రభుత్వ సలహాదారులకోసం కేటాయించారు. వీటిని కూడా గెస్ట్‌హౌస్‌లుగా ఉపయోగించుకునే వీలున్నది. ప్రస్తుతం ప్రజాభవన్‌గా ఉపయోగిస్తున్న భవనం కూడా నగరం నడిమధ్యన ఉండి, గెస్ట్‌హౌస్‌కు ఎంతగానో అనుకూలత కలిగి ఉంటుంది. ఇన్నిరకాల అవకాశాలున్నప్పటికీ ప్రత్యేంగా ఎంసీఆర్ హెచ్ఆర్డీలో గెస్ట్‌హౌస్ నిర్మాణం ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇది సీఎం నివాసానికి అతి సమీపంలో ఉన్నది. అంతేకాకుండా పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల నివాసాలు అదే ప్రాంతంలో ఉండటంతో క్యాంపు కార్యాలయాన్ని అక్కడ ఏర్పాటు చేయాలని రేవంత్‌రెడ్డి భావించినట్టు సమాచారం. ప్రభుత్వం అవసరం లేకున్నా అతిథి గృహం పేరుతో సీఎం క్యాంపు కార్యాలయం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని రాజకీయవర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.