హైవోల్టేజ్ పవర్‌హౌస్‌లో వేలుపెడితే ఏమైతది? అసెంబ్లీలో ఈ రోజు కాంగ్రెస్‌కు అదే జరిగింది. లేని తప్పును ఎత్తి చూపడానికి ప్రయత్నంచేస్తే తానే దోషిగా నిలబడాల్సి వచ్చింది. ప్రభుత్వం పరువును కాపాడడానికి ముఖ్యమంత్రి ఆదర బాదరాగా పరిగెత్తుకొచ్చి ఆవేశపూరితంగా మాట్లాడాల్సి వచ్చింది. వ్యక్తిగత ఆరోపణలతో, అసం బద్ధ విషయాలతో, సబ్జ్యుడీషియల్ అంశాలతో సీఎం మాట్లాడితే.. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మాత్రం ‘పాయింట్ టు పాయింట్’ సమాధానమిచ్చారు. ‘తెలంగాణ-కరెంట్- కేసీఆర్’ అనే అంశానికే కట్టుబడి ఎక్కడా పక్కదారిపట్టకుండా.. తీగలో కరెంటు దూసుకెళ్లినట్టు కంటెంట్‌తో ఆయన ప్రసంగం సూటిగా, ధాటిగా సాగింది.
తెలంగాణ గురించి మాట్లాడే విషయంలో సభలో లేనని నన్ను అంటున్నరు. మీ గురువుగారు పేల్చిన తుపాకీ గుండ్లకు బలైన అమరవీరులతో ఉన్న. వాళ్లతో తిరుగుతున్న. కానీ మీరు సంచులు మోసే సమయంలో మాత్రం నేను ఇక్కడే ఈ సభలోనే ఉన్న.
ముఖ్యమంత్రి ఎందుకు పదే పదే భుజాలు తడుము కుంటున్నడు? ఎస్.. మా నాయకుడు కేసీఆర్ హరిశ్చంద్రుడే. మీలాగా సంచులు మోసే చంద్రుడు కాదు. సంచులు మోసి జైలుకు పోయింది నువ్వు.
నేను సబ్జెక్ట్ వరకే మాట్లాడుతున్న. సీఎం వచ్చినంకనే సభ డీవియేట్ అయ్యింది. కావాలంటే రికార్డులు చూడండి. మీరు మాట్లాడితే సబ్జ్యుడీస్కాదు. నేను జవాబిస్తే సబ్జ్యుడీసా?
– అసెంబ్లీలో జగదీశ్‌రెడ్డి
MLA Jagadish Reddy | హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఇకపై ప్రభుత్వం నిర్మించబోయే విద్యుత్తు ప్రాజెక్టులను అదానీకి ఇచ్చే కుట్రలో భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీహెచ్‌ఈఎల్‌పై కాంగ్రెస్ నేతలు నిందలు వేస్తున్నారని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘బీహెచ్ఈఎల్కు వద్దు.. అదానీకి ఇవ్వాలనేది మీ ఆలోచన. మొత్తం విద్యుత్తు రంగాన్ని అదానికి అప్పగించాలనే ఆలోచన మీది. డిస్కంలను తీసుకొని పోయి వాళ్లకు అప్పగించాలని చూస్తున్నారు. డైరెక్ట్‌గా మాట్లాడలేక పేపర్ల చిట్‌చాట్‌లతో దొంగ రాతలు రాయిస్తున్నారు. కానీ, మీ బాగోతం ప్రజలు చూస్తున్నారు. మా దగ్గర ఏదో మతలబు ఉందనుకుంటే చంద్రబాబు లాగే మేము కూడా నాడు ప్రైవేట్‌కే ఇచ్చేవాళ్లం కదా? రేపు కాంగ్రెస్ కట్టబోయే ప్రాజెక్టులను బీహెచ్ఈఎల్కి ఇవ్వాల్సి వస్తున్నదన్న భయంతో, మనసులో తప్పుడు ఆలోచనలు పెట్టుకొని ఇప్పట్నుంచే పథకం ప్రకారం మాట్లాడుతున్నారు.
రాబోయే కాలంలో కాంగ్రెస్ నిర్మించే ప్రాజెక్టులు ప్రభుత్వ రంగ సంస్థలకే ఇవ్వాలి’ అని విద్యుత్తు రంగంపై సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. అలాగే, వ్యవసాయ మోటార్లకు విద్యుత్తు మీటర్లు పెట్టించాలనే ఉద్దేశంతోనే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఒప్పందాన్ని సభ సాక్షిగా తప్పుదోవ పట్టించారని విమర్శించారు. బీఆర్ఎస్ కృషివల్లే పదేండ్ల పాటు తెలంగాణ విద్యుత్తు వెలుగులతో విరాజిల్లిందని తెలిపారు. తమ హయాంలో ఒక్క ఇంటిపై నుంచి కూడా విద్యుత్తు లైన్ వెయ్యలేదని గుర్తుచేశారు. 2014 కంటే ముందు వేసిన లైన్ల కింద కొందరు పేదలు ఇండ్లు కట్టుకున్నారని, కొందరు రెండంతస్తులు కట్టుకున్న చోట్ల కూడా లైన్లు తీయించినట్టు వివరించారు.
శనివారం సీఎం రేవంత్‌రెడ్డి తన ప్రసంగంలో చాలా తెలివిగా వ్యవసాయేతర మీటర్లకు మాత్రమే అనే అంశాన్ని దాచిపెట్టి వ్యవసాయ మీటర్లకు కూడా తాము కేంద్రం దగ్గర ఎఫ్ఆర్బీఎం కోసం ఒప్పుకున్నట్టు మాట్లాడిన తీరు బాగోలేదని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. మాట్లాడాల్సిన తీరులో మాట్లాడకుండా ‘రాముడితోక పివరుండిట్లనియే’ (రామునితో కపివరుండిట్లనియే) అన్న చందంగా సీఎం మాట్లాడడం బాధాకరమన్నారు. సీఎం వ్యాఖ్యల సభ రికార్డులను సవరించాలని డిమాండ్ చేశారు. ‘ఉదయ్’ పథకంలో అప్పటికే 27 రాష్ర్టాలు చేరాయని, డిస్కంల ఆర్థిక పరిస్థితిని సరిదిద్దడానికి, క్రమశిక్షణ కోసం తీసుకున్న నిర్ణయమని నాడు కేంద్రం చెప్పిందన్నారు. తమకంటే ముందే కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలు అందులో చేరాయని తెలిపారు. అయితే, ‘తల తెగినా వ్యవసాయ మోటార్లకు విద్యుత్తు మీటర్లు పెట్టబోమని నాటి సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ విషయం అందరికీ తెలియాలి. అయినా, సీఎం ఆ విధంగా మాట్లాడం బాధాకరం’ అని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్రంలోని అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తు అందాలనేది నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని జగదీశ్‌రెడ్డి తెలిపారు. అందుకే నాడు సీఎండీలను ఏర్పాటుచేసి ఆ దిశగా చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. ఈ క్రమంలో నాడు 6 నెలల్లోనే ఒక్క వ్యవసాయ రంగం మినహా అన్నింటికీ 24 గంటల విద్యుత్తు ఇచ్చినట్టు చెప్పారు. 2014 నవంబర్ నాటికే లక్ష్యాన్ని చేరుకున్నట్టు తెలిపారు. ట్రాన్స్ఫర్మేషన్, డిస్ట్రిబ్యూషన్ సమస్యలు తీర్చి రైతులకు కూడా 24 గంటల ఉచిత విద్యుత్తు ఉండాలని కేసీఆర్ ఆదేశించారని, ఆ దిశగానే రైతులకు ఉచిత కరెంటు ఇవ్వగలిగామని పేర్కొన్నారు. రాష్ర్టాన్ని ఇంతలా బాగు చేసుకోవడానికే నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పు చేయాల్సి వచ్చిందని చెప్పారు. రూ.90వేల కోట్లు పెట్టి మొత్తం డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్ఫర్మేషన్ వ్యవస్థలను బలోపేతం చేసినట్టు వివరించారు. మొదటి టర్మ్‌లో భట్టి, జానారెడ్డి అడిగిన ప్రశ్నలకు కూడా ఇవే సమాధానాలు చెప్పినట్టు తెలిపారు. ఎందులో చూసినా, ఎటు చూసినా అంతా 100 శాతం డబుల్ చేశామని అయితే, 8 నెలలుగా కాంగ్రెస్ ఒక్క లైన్ కానీ, ట్రాన్స్ఫార్మర్ కానీ ఇవ్వలేదని జగదీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
2014లో తెలంగాణ విద్యుత్తు రంగం రూ.24వేల కోట్లతో తమ చేతికి వచ్చిందని జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఇన్ని ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లు, లైన్లు, కొత్త పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలంటే ‘మంత్రాలు చేస్తే అయితయా? మంత్రాలతో అభివృద్ధి జరుగుతుందా?’ అని ప్రశ్నించారు. తప్పకుండా అప్పు చేయాల్సి వచ్చిందని, అందుకే అప్పులు తెచ్చినం, అన్నీ కట్టినం, సంపాదించినం అని చెప్పారు. ‘కలుగులోంచి ఏదో పట్టుకున్నట్టు ఎందుకు ప్రజలను భ్రమింపజేస్తున్నారు? ఇప్పటికీ చెబుతున్నాం. ఆ పెద్దమనిషి (కేసీఆర్) వీళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మేమే ఎక్కువ’ అంటూ తనదైన శైలిలో కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. ‘పిట్‌హెడ్ విజయవాడలో కడితే ఒప్పు. నల్లగొండలో కడితే తప్పా? ఎందుకంటే మీ బాసులంతా విజయవాడలో ఉన్నారనా? మాకు అలా కాదు. తెలంగాణ ప్రజలంతా మా బాస్‌లే. నల్లగొండ ప్రజలు కూడా మా బాస్‌లే. అందుకే తెలంగాణలో కట్టినం. నల్లగొండకు 60 ఏండ్లలో వెయ్యిమంది పనిచేసి ఒక్క కంపెనీ కూడా తేలేదు. ఫ్లోరైడ్‌ను నల్లగొండ నుంచి పారదోలాం. రోడ్డు, నీరు, రైలుమార్గం ఉన్న నల్లగొండలోనే యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టినం. నల్లగొండలో కట్టడం పెద్ద నేరం అన్నట్టు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఇది నల్లగొండ ప్రజలు గమనించాలి’ అని రాష్ట్ర ప్రజలను కోరారు.
‘కాంగ్రెస్ సభ్యులకు ఇప్పటికే సూపర్ క్రిటికల్, సబ్ క్రిటికల్ గురించి చాలాసార్లు చెప్పాం. అర్థంకాక నో, ప్రజలను తప్పుదోవ పట్టించడానికో మళ్లీ మళ్లీ ప్రస్తావిస్తున్నారు’ అని జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014కి ముందు ప్రపంచమంతా సబ్ క్రిటికల్ టెక్నాలజీనే వాడిందని, 800 మెగావాట్ల విద్యు త్తు ఉత్పత్తికి మించితే అది సూపర్ క్రిటికల్ అని, అంతకంటే తక్కువ ఉత్పత్తి చేస్తే దాన్ని సబ్ క్రిటికల్‌గా పిలుస్తున్నారని తెలిపారు. ‘నాడు మన లక్ష్యాన్ని చేరుకోవాలని సబ్‌క్రిటికల్ టెక్నాలజీలో నిర్మాణం కోసం బీహెచ్ఈఎల్ను సంప్రదించాం. ఓ ప్రభుత్వం, మరో ప్రభుత్వ రంగ సంస్థతో ఒప్పందం చేసుకుంటే ఇందులో అక్రమాలు ఎలా జరుగుతాయి? ప్రభుత్వానికి ఏ రకంగా మోసం చేయడానికి అవకాశం ఉంటుంది? బీహెచ్ఈఎల్ నుంచి లంచాలు ఇస్తారా? ఓ ప్రభుత్వ రంగ సంస్థ నుంచి మరో ప్రభుత్వ రంగ సంస్థకు నామినేషన్ పద్ధతిలో ఇవ్వొచ్చు అని ఆ నిబంధనల్లో ఉంది’ అని వివరించారు.
‘ఛత్తీస్‌గఢ్ పవర్‌కు ఆ నాడు మనం యూనిట్‌కు రూ.3.90 ఇచ్చాం. ఇప్పుడు కాంగ్రెస్ రామగుండం ఎన్టీపీసీ నుంచి తీసుకునేందుకు యూనిట్‌కు రూ.5.70 ఇస్తున్నది. ఇది నిజమో కాదో చెప్పాలి’ అంటూ జగదీశ్‌రెడ్డి నిలదీశారు. ‘ఈ ఛత్తీస్‌గఢ్ ఒప్పందం వల్ల నష్టం జరిగిందా? లాభం జరిగిందా? చెప్పాలి. అప్పుడు ఇచ్చింది ప్రభుత్వమే, తీసుకున్నది కూడా ప్రభుత్వమే. ఇందులో ఏం మతలబు ఉన్నది? మతలబుల సంగతి మీకే ఎరుక’ అని చురకలు అంటించారు. ‘నాడు విజయవాడలో 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణానికి చంద్రబాబు రూ.4,700 కోట్లు, కృష్ణపట్నం ప్లాంట్‌కు రూ.5వేల కోట్లకు ఇచ్చారు. మనం కొత్తగూడెం పవర్‌ప్లాంట్‌ను బీహెచ్ఈఎల్కు ఇచ్చింది రూ.3,800 కోట్లకు. ఈ చొప్పున ఎవరు డబ్బులను ఆదా చేశారు? ఎవరు వృథా చేశారు?’ అని ప్రశ్నించారు.
విద్యుత్తుపై వేసిన కమిషన్ ఎంతో నిక్కచ్చిగా ఉండాలని జగదీశ్‌రెడ్డి తెలిపారు. కమిషన్ చైర్మన్‌గా కాంగ్రెస్ నియమించిన వ్యక్తిపై నాటి పీసీసీ చీఫ్, నేటి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వీ హనుమంతురావులు అతనొక భూ కబ్జాదారుడని కేసు వేసినట్టు గుర్తు చేశారు. ‘ఆ కమిషన్ విషయంపై మాట్లాడొద్దని అంటున్నారు. ఆ విషయం సభలోకి తెచ్చింది ముఖ్యమంత్రి. దానిపై మాట్లాడొద్దా? ఆ భూమి కూడా ఎక్కడిదో కాదు స్వయంగా ఓయూకు సంబంధించిన భూమి అది. దానిపై ఎఫ్ఐఆర్ అయింది. అందుకే మేము వ్యక్తిని మార్చాలని కోరాం’ అని జగదీశ్‌రెడ్డి తెలిపారు. సాధారణ కోర్టుల్లో కూడా న్యాయం జరగదని అనుకున్నపుడు పైకోర్టులకు వెళ్లే హక్కు ఉంటుంది. అందుకే కేసీఆర్ సుప్రీంకోర్డుకు వెళ్లారు. సుప్రీంకోర్టు న్యాయంగా తీర్పు చెప్పింది అంటూ కాంగ్రెస్ కుట్రలను బయటపెట్టారు.
‘నాడు పది నిమిషాలు కరెంటు రాకపోతే నాకు ఫోన్ వచ్చేది. అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించేవాళ్లం. ఇప్పుడు కరెంటు పోతే, కరెంటు కావాలని అడిగితే కేసులు పెట్టే దుస్థితి వచ్చింది. పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీతా కృష్ణన్ అనే సామాజిక వేత్త ఎక్స్‌లో పోస్టు చేస్తే కరెంటు ఇవ్వకపోగా ఆ పోస్టు తీసెయ్యమని బెదిరించారు. ఆఖరికి జర్నలిస్టులు సైతం కరెంటుపై నిలదీస్తే కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది’ అని జగదీశ్‌రెడ్డి సభలో ఆవేదన వ్యక్తం చేశారు. నాడు సీఎం రేవంత్‌రెడ్డి తండ్రి చనిపోయినప్పుడు కరెంటు కోతలపై ఆయన చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయంటూ వాటిని ప్రస్తావించారు. ఎంజీఎం, భువనగిరి, ఆదిలాబాద్ దవాఖానల్లో కరెంటు పోతే సెల్ఫోన్ల లైట్ల వెలుతురులో ఆపరేషన్లు జరుగుతున్నాయని పత్రికల్లో వచ్చాయని తెలిపారు. జైపాల్‌రెడ్డితో కుస్తీపట్టి 53శాతం విద్యుత్తు వినియోగం చేయించామని నాటి కాంగ్రెస్ ఎంపీలు కూడా ఎప్పుడూ చెప్పుకోలేదని తెలిపారు.