హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/బంజారాహిల్స్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): ‘మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమైనా హైకమాండా? స్థానికుడికే జూబ్లీహిల్స్ టికెట్ అని చెప్పడానికి ఆయనకున్న అర్హతలేమిటి? పార్టీలో ఆయన నాకన్నా జూనియర్. కాంగ్రెస్ అభ్యర్థిని ఆయన ఎలా నిర్ణయిస్తారు’ ఇవీ మంత్రి పొన్నం ప్రభాకర్‌పై మాజీ ఎంపీ, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్‌ను ఆశిస్తున్న ఆ పార్టీ సీనియర్ నేత అంజన్‌కుమార్ యాదవ్ వదిలిన విమర్శల బాణాలు. ఒక యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంజన్‌కుమార్ యాదవ్ చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఇప్పటికే జూబ్లీహిల్స్ టికెట్ కోసం రగిలిన కాంగ్రెస్ వైరివర్గాల రచ్చ అంజన్‌కుమార్ వ్యాఖ్యలతో తారస్థాయికి చేరింది. ఒకవైపు నవీన్‌యాదవ్, అంజన్‌కుమార్ యాదవ్ ప్రధానంగా టికెట్ కోసం పోటీపడుతుండగా.. ఎమ్మెల్సీతో సరిపెట్టుకుందామనుకున్న అజారుద్దీన్ మనసు మార్చుకొని జూబ్లీహిల్స్ టికెట్ బరిలో ఉండేందుకు సమాయత్తమయ్యారు. దీంతో కాంగ్రెస్‌లో మూడు ముక్కలాటగా మారింది. ఇటీవల ‘స్థానికుడికే జూబ్లీహిల్స్ టికెట్’ అన్న మంత్రి పొన్నం ప్రకటనపై తాజాగా అంజన్‌కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
‘ఎవడ్ని గంప కింద కమ్మేందుకు ఈ స్థానిక నినాదం’ అంటూ సంచలన విమర్శ చేశారు. అసలు పొన్నం ప్రభాకర్ ఏమైనా హైకమాండా? అని ప్రశ్నించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి హోదాలో ఆ ప్రకటన చేసి ఉంటే జూబ్లీహిల్స్ అభ్యర్థిని కూడా ఆయన్నే ప్రకటించమనండి అని వ్యాఖ్యానించారు. పొన్నం తనకంటే జూనియర్ అన్న అంజన్… అసలు స్థానికత అనే వాదనను ఎందుకు తెరపైకి తెచ్చారో తనకూ అర్థం కావడం లేదని చెప్పారు.
తాను జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉన్న సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి రెండు పర్యాయాలు ఎంపీగా ప్రాతినిథ్యం వహించానని, గతంలో కాంగ్రెస్ నగర అధ్యక్షుడిగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఇలా అనేక పదవులు చేపట్టానని, అసలైన స్థానికుడిని తానేనని తేల్చి చెప్పారు. ఈ వాదాలు తనకు వర్తించబోవని స్పష్టంచేశారు. జూబ్లీహిల్స్ టికెట్ అనేది అంజన్‌కుమార్ హక్కు అని పరోక్షంగా పొన్నంకు సవాల్ విసిరారు. నవీన్‌యాదవ్, సీఎన్ రెడ్డి వంటి కొత్త నేతల పేర్లు తరచూ వినిపించడం వెనుక తనకు వ్యతిరేకంగా ఏవైనా శక్తులు పని చేస్తున్నాయేమోనని అంజన్‌కుమార్ యాదవ్ అనుమానం వ్యక్తం చేశారు.
తనకు టికెట్ రాకుండా చేస్తున్నారన్న అనుమానంతో కాంగ్రెస్ ముఖ్యనేతపైనా అంజన్‌కుమార్ మరోసారి స్వరం పెంచారు. మంత్రి పొన్నంపై విమర్శలు గుప్పిస్తూనే, పనిలో పనిగా తాను ప్యారాచూట్ నాయకుడిని కాదంటూ పరోక్షంగా ‘ముఖ్య’నేత వర్గానికి చురక అంటించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో కాంగ్రెస్ అంతర్గత పోరు మరింత ముదిరేలా కనిపిస్తున్నది. గత కొన్నిరోజులుగా హస్తం గూటిలో అంతర్గత కుమ్ములాటలు ముమ్మరమయ్యాయంటూ ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనం నిజమని మరోసారి రుజువైంది.
ఇందుకు అనుగుణంగానే తాజాగా వరుస పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేతల మాటల్లో చెప్పాలంటే.. ఒక ప్యారాచూట్ నేతకు సీఎం వర్గం పూర్తి మద్దతుగా నిలుస్తుండటంతో ఆది నుంచి పార్టీని నమ్ముకొని ఉన్న సీనియర్లు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. కష్టకాలంలో పార్టీని నమ్ముకున్న వాళ్లను వదిలి ప్యారాచూట్ నేతకు టికెట్ ఇప్పించేందుకు సీఎం వర్గం ప్రయత్నిస్తుండటం వెనుక డబ్బు ప్రభావం ఉన్నదా? ఇంకేదైనా ఉన్నదా? అని సదరు నేతలు ఆరోపణలు కూడా రుజువు చేస్తున్నాయి.
మంత్రివర్గం కూర్పుపై కాంగ్రెస్ తీరును కూడా అంజన్‌కుమార్ ఎండగట్టారు. గతం లో కేసీఆర్ ప్రభుత్వంలో హైదరాబాద్‌కు రాజకీయంగా చాలా ప్రాధాన్యం ఇచ్చారని గుర్తుచేశారు. ఒకవైపు పద్మారావు, తలసాని వంటి వాళ్లు మంత్రివర్గంలో ఉన్నప్పటికీ నగర ప్రాముఖ్యం దృష్ట్యా మైనార్టీ నేత మహమూద్ అలీ, మరో కార్మిక, ఉద్యమ నేత నాయిని నర్సింహారెడ్డికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకున్నారని గుర్తుచేశారు.
నగర కాంగ్రెస్‌లో ఇప్పుడున్న వాళ్లు ఎవరూ గతంలో లేరని, కానీ తమ కుటుంబం మాత్రం పార్టీని పట్టుకొని ఉండి సేవ చేసిందని తెలిపారు. కష్ట సమయాల్లో తాము పని చేసినపుడు స్థానికవాదం గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. గతంలో దానం నాగేందర్‌కు రెండోసారి టికెట్ ఇచ్చే సమయంలో వైఎస్ తనను అడిగితే టికెట్ ఇవ్వాల్సిందిగా తాను చెప్పానని, అంత విశాల హృదయమున్న తన విషయానికొచ్చేసరికి కొందరు ఇలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
జూబ్లీహిల్స్ టికెట్ అడుగుతున్న తనపై వ్యతిరేకులు మరో వాదనను తెరపైకి తీసుకొస్తున్నారని మాజీ ఎంపీ అంజన్‌కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికే తన కుమారుడు అనిల్‌కుమార్‌కు రాజ్యసభ ఇచ్చారని, మళ్లీ తనకు రెండోది ఎలా ఇస్తారని ప్రశ్నించడం వెనుక కుట్ర దాగి ఉన్నదని తెలిపారు. ప్రస్తు తం కాంగ్రెస్‌లోని చాలా మంది నేతల కుటుంబాల్లో ఇద్దరు, ముగ్గురికి పార్టీ అవకాశాలు ఇవ్వలేదా? అని ప్రశ్నించారు.
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆయన సతీమణి పద్మావతి, కోమటిరెడ్డి బ్రదర్స్, డిప్యూటీ సీఎం భట్టి, ఆయన సోదరుడు ఎంపీ మల్లు రవి, సీనియర్ నేత జానారెడ్డి ఇద్దరు కుమారుల్లో ఒకరు ఎంపీ, మరొకరు ఎమ్మెల్యే, మంత్రి వివేక్ ఇంట్లో ఆయన కుమారుడు ఎంపీ కాగా, సోదరుడు ఎమ్మెల్యే అంటూ జాబితాను వివరించా రు. రాహుల్ కోటాలో తన కుమారుడు అనిల్‌కుమార్‌కు రాజ్యసభ వచ్చిందని, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారే తప్ప అనిల్ ప్యారాచూట్ నేత కాదని తేల్చి చెప్పారు.