Wanaparthy | వనపర్తిలో ఘరానా మోసం బయటపడింది. ఇంటి పత్రాలను ఫోర్జరీ చేసి బ్యాంకులు, ఫైనాన్షియల్ కంపెనీల నుంచి రూ.2.61 కోట్లను కొట్టేసిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ప్రజలను మోసాల నుంచి కాపాడాల్సిన పోలీస్ కానిస్టేబుల్‌నే ఈ మోసాల వెనుక ఉండటం కలకలం రేపింది. కాగా మోసపోయిన కంపెనీల్లో పోలీసుల ఇంటి నిర్మాణానికి లోన్లు ఇచ్చే “భద్రత” విభాగం కూడా ఉండటం గమనార్హం.
సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ ఆర్.గిరిధర్ వివరాలు వెల్లడించారు. బండారు రాకేశ్ అనే కానిస్టేబుల్ ఐదేళ్లుగా లాంగ్ లీవ్‌లో ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో కొత్త మోసానికి తెరతీశాడు. ఫోర్జరీ ఇంటి పత్రాలను సృష్టించి వాటితో గృహ రుణాలు తీసుకోవడం మొదలుపెట్టాడు. ఇందుకోసం పి.హరీశ్ కుమార్, టి.మల్లేశ్, జి.సందీప్ ఎస్.శేఖర్, బి.కిశోర్ కుమార్‌తో కలిసి ఒక ముఠాను ఏర్పాటు చేశాడు. ఈ ఆరుగురు ఓ ముఠాగా ఏర్పడి.. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఎల్ఐసీతో పాటు భద్రత విభాగంలోనూ గృహరుణాలు తీసుకున్నారు.
ఒక కేసులో ఎస్.శేఖర్ అనే వ్యక్తి ఇంటిని రాకేశ్ కొనుగోలు చేసినట్లుగా నకిలీ పత్రాలు రూపొందించారు. ఆ పత్రాలతో రూ.89.30 లక్షల రుణం తీసుకున్నారు. ఇదే తరహాలో శ్రీనివాసులు అనే వ్యక్తి ఇంటిని ఎస్.శేఖర్ కొనుగోలు చేసినట్లుగా పత్రాలను ఫోర్జరీ చేశారు. అనంతరం హెచ్డీఎఫ్సీ, భద్రత విభాగం నుంచి రూ.57.59 లక్షల రుణం పొందారు. ఆ తర్వాత అవే డాక్యుమెంట్స్‌తో ప్రతాప్ అనే వ్యక్తికి రూ.40 లక్షలకు ఇంటిని అమ్మేశారు. అలాగే శివశంకర్ అనే వ్యక్తిని స్వాతి కొనుగోలు చేసినట్లుగా దొంగ పత్రాలు సృష్టించి ఎల్ఐసీ నుంచి రూ.38 లక్షలు హౌసింగ్ లోన్ తీసుకున్నారు. ఆ ఇంటిని అరుణ్ భాషా అనే వ్యక్తికి అమ్మి, భద్రత విభాగం నుంచి రూ.37 లక్షల రుణం తీసుకున్నారు. ఇలా మొత్తంగా రూ.2,61,89,000 మోసం చేశారు.
తాజాగా ఈ మోసం బయపడటంతో నిందితులను వనపర్తి పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో బ్యాంకు అధికారులు, భద్రత విభాగం అధికారుల పాత్రపై విచారణ జరుపుతామని తెలిపారు. దర్యాప్తులో మరిన్ని మోసాలు వెలుగు చూసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ కేసు ను చేధించిన వనపర్తి సీఐ ఎం. కృష్ణయ్య, ఎస్సైలు హరిప్రసాద్, రామరాజు, విజయ్ కుమార్ తదితరులను ఎస్పీ అభినందించారు.