భైంసా టౌన్, మే 10 : ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే నిర్వాహకులు ఇబ్బందులు పెడుతున్నారని నిర్మల్ జిల్లా భైంసా మండలం వానల్పాడ్ రైతులు ఆందోళన చెందుతున్నారు. కేసీఆర్ పాలనలో కొనుగోలు కేంద్రాలు బాగా నడిచాయని రైతులు రాజు, సాయన్న, గౌతం గుర్తుచేసుకుంటున్నారు. తమ బాధలు తీర్చడానికి కేసీఆర్ మళ్లీ రావాలంటూ భావోద్వేగానికి లోనయ్యారు. పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే, తేమ శాతం ఉన్నా ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి సర్కార్ అమలు చేయడం లేదని విమర్శించారు. కేసీఆర్ కోసం తాము ప్రాణాలైన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని వారు చెప్తున్నారు. నాలుగైదు రోజులుగా సాయంత్రం పూట గాలిదుమారంతో కూడిన జల్లులు పడుతుండటంతో ధాన్యం తడిచిపోతుందేమోనని ఆందోళన చెందుతున్నట్టు వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని కోరారు.
ధాన్యం కొనుగోలులో సర్కారు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ శనివారం వనపర్తి జిల్లా శ్రీరంగాపురం, పెబ్బేరు మండలాలకు చెందిన రైతులు శ్రీరంగాపురంలోని కొల్లాపూర్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని తూకం వేసి నాలుగైదు రోజులైనా లారీలు లేక మిల్లులకు తరలించడంలో జాప్యం జరుగుతున్నదని ఆరోపించారు. తూకమైన వడ్లకు తరుగు పేరిట నాలుగైదు కిలోలు తగ్గిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తాము నష్టపోతున్నామని ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు. దాదాపు గంటపాటు చేపట్టిన ఆందోళనతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
– పెబ్బేరు
తరుగు పేరుతో మిల్లర్లు నిలువు దోపిడీ చేస్తున్నారని ఆరోపిస్తూ రైతులు శనివారం వనపర్తి జిల్లా గోపాల్పేట బస్టాండ్ సమీపంలోని రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ పదిరోజులుగా లారీల కొరత ఉండటంతో ధాన్యం కొనుగోలు చేయడంలేదని, రైస్ మిల్లర్లు తరుగు, తాలు పేరుతో క్వింటాకు 3 కిలోలపైగా తరుగు తీస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లా సివిల్ సైప్లె అధికారి విశ్వనాథం వచ్చి రోజుకు 5 లారీలు పంపిస్తామని చెప్పడంతో రైతులు శాంతించారు.
– గోపాల్పేట
ధాన్యం కొనుగోలు చేయాలంటూ కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం తుజాల్పూర్లో శనివారం రైతులు ధర్నా చేపట్టారు. వడ్లను కొనుగోలు చేయడంలో జాప్యం చేస్తున్నారని, తరలించిన ధాన్యాన్ని రైస్‌మిల్లుల్లో అన్లోడింగ్ చేయడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. లారీలను అందుబాటులో ఉంచి, కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సై ప్రభాకర్ చేరుకొని రైతులను అధికారులతో మాట్లాడించి ఆందోళన విరమింపజేశారు.
– బీబీపేట్