Wee Hub | హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): అమెరికాకు చెందిన వాల్ష్ కర్రా హోల్డింగ్స్ తెలంగాణలో పెట్టుబడులకు సుముఖత వ్యక్తం చేసింది. వచ్చే ఐదేండ్లలో వీ హబ్‌లో రూ.42 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. వీ హబ్‌తోపాటు తెలంగాణలో నెలకొల్పే స్టారప్‌లలో దాదాపు రూ.839 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. వాల్ష్ కర్రా కంపెనీకి చెందిన ఫణి కర్రా, గ్రెగ్‌వాల్ష్.. వీ హబ్ సీఈవో సీతా పల్లచోళ్ల ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
వీ హబ్‌తో ఒప్పందం సందర్భంగా గ్రెగ్‌వాల్ష్ మాట్లాడుతూ పెట్టుబడులతోపాటు ప్రభుత్వంతో కలిసి వివిధ కార్యకలాపాల్లో భాగస్వామ్యం పంచుకుంటామని తెలిపారు. ఓయూ నుంచి కెరీర్ ప్రారంభించి అంతర్జాతీయ స్థాయికి చేరగలిగానని, మన దేశం, రాష్ట్రం పట్ల కృతజ్ఞతను చాటుకునే అవకాశం దొరికిందని ఫణి తెలిపారు.