నందిపేట్/మోర్తాడ్, జనవరి 15: ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గానికి రావొద్దంటూ నందిపేట్‌లో బుధవారం పోస్టర్లు వెలిశాయి. నిజామాబాద్ జిల్లా నందిపేట్‌లోని వైన్స్, బస్టాండ్‌తోపాటు పలు ప్రధాన కూడళ్ల వద్ద పోస్టర్లు దర్శనమిచ్చాయి. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తూ ఈ పోస్టర్లను ముద్రించారు. రూపాయికి వైద్యం, సొంత ఖర్చుతో ఇండ్ల నిర్మాణం, యువతకు ఉపాధి మార్గాలు తదితర అంశాలపై గోడలకు పోస్టర్లు అతికించారు. ఎమ్మెల్యే హామీలపై ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ప్రస్తుతం పోస్టర్లు వెలిశాయి. ఎమ్మెల్యే ఫొటోతో కూడిన పోస్టర్లు గోడలపై కనిపించడం మండలంలో చర్చనీయాంశమైంది. పోస్టర్లు అతికించిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజలు కోరుతుంటే.. పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని, నియోజక వర్గానికి రావొద్దంటూ నందిపేట్‌లోని పలు ప్రధాన కూడళ్ల వద్ద పోస్టర్లు వెలిశాయని తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు పలువురిని అరెస్టు చేయడాన్ని ఖండించారు. రాష్ట్రంలో అక్రమ అరెస్టులు, అక్రమ కేసుల పర్వం కొనసాగుతున్నదని విమర్శించారు.
నందిపేట్‌కు చెందిన ఇద్దరు బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ బుధవారం రాత్రి బీఆర్ఎస్ నాయకులు బాల్కొండ పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. హామీలను నెరవేర్చాలని ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డిని అడిగితే అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు.