నిజం చెప్పిన పాపానికి రైతులు క్షమాపణ చెపాల్సి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో యూరియా అడిగిన అన్నదాతలకు అవమానమే ఎదురైంది. ఎరువుల కోసం శుక్రవారం రాత్రి 10 దాకా పలువురు రైతులు నిరీక్షించారు. అక్కడికి వచ్చిన మీడియాకు కొందరు గోడు వెళ్లబోసుకోగా, ఆ అంశం ప్రసారమైంది.
ఇది కాంగ్రెస్ నేతలకు కంటగింపుగా మారింది. ఆగమేఘాలపై ఇద్దరు రైతులను శనివారం ఉదయమే పిలిపించి బెదిరించిట్టుగా తెలుస్తున్నది. వారితోనే సర్కారుకు అనుకూలంగా మాట్లాడించి రికార్డు చేయడం గమనార్హం. ‘ఏమన్నా తప్పుగా మాట్లాడి ఉంటే సారీ’ అని సదరు రైతుతోనే చెప్పించారంటే.. ప్రశ్నించేవారిపై అధికార పార్టీ నేతల దబాయింపు ఎంతలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు!
కరీంనగర్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంలోని రుద్రంగి మండల కేంద్రం ఆయన స్వగ్రామం. రుద్రంగిలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి యూరియా స్టాక్ వచ్చిందని తెలుసుకున్న రైతులు శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట వరకే అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. రుద్రంగితోపాటు దాని పరిధిలోని కొచ్చెగుట్ట తండా సహా మరికొన్ని తండాల రైతులు ఆగ్రో సేవా కేంద్రం వద్దకు వచ్చారు. నిజానికి ఈ ప్రాంత రైతులు యూరియా కోసం కొద్దిరోజులుగా ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో యూరియా వచ్చిందన్న సమాచారంతో భారీగా తరలివచ్చారు. తమ వద్ద 400 యూరియా బస్తాల స్టాక్ మాత్రమే ఉన్నదని కేంద్రం నిర్వాహకులు చెప్పడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఎలాగైనా పంటలకు యూరియా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో బారులు తీరారు. ఆ మేరకు ఆగ్రో కేంద్రం నిర్వాహకులు రైతుల నుంచి ఆధార్ కార్డులు సేకరించి దానిని ఆన్లైన్లో నమోదుచేసి కావాల్సిన ప్రక్రియను పూర్తి చేయడానికి సమయం పట్టింది.
దీంతో మధ్యాహ్నం ఒంటిగంటకు వచ్చిన మహిళలు సహా పలువురు రైతులు రాత్రి 10 గంటల వరకు పడిగాపులు ఉండాల్సి వచ్చింది. యూరియా అయిపోవడంతో చాలామంది రైతులు వెనుతిరిగినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం ఆగ్రోస్ కేంద్రం నిర్వాహకుల వద్ద యూరియా కోసం ఇంకా 200 మంది రైతులు తమ అధార్ కార్డులు ఇచ్చి వెళ్లారని తెలుస్తున్నది. సదరు నిర్వాహకులు, అధికారులు మాత్రం దీనిని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ మండల పరిధిలో దాదాపు 12,500 ఎకరాల్లో వివిధ పంటలను సాగుచేశారు. ఇందుకు 1,125 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉన్నది. ఇప్పటివరకు 800 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని అధికారులే చెప్తున్నారు. ఇదంతా నిజమే అయితే ఇక్కడ యూరియా కొరత ఎందుకు వచ్చిందన్నదే అసలు ప్రశ్న.
నిజాలు మాట్లాడిన వారిపై నిప్పులు?
మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి 10 గంటలకు వరకు యూరియా కోసం రైతులు పడిగాపులు పడిన దృశ్యాలు అక్కడ కండ్లకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి. వివిధ తండాల నుంచి వచ్చిన మహిళా రైతులు గంటల తరబడి యూరియా కోసం నిరీక్షించారు. రాత్రి కావడంతో చాలామంది ఇబ్బందులు పడ్డారు. అక్కడికి వెళ్లిన మీడియాతో రుద్రంగికి చెందిన రైతు లక్కం నర్సయ్య, కొచ్చెగుట్ట తండాకు చెందిన మహిళా రైతు లావుడియా లలిత తమ ఆవేదనను వ్యక్తంచేశారు. ఈ ఇద్దరు రైతుల వాయిస్‌తోపాటు సేవా కేంద్రం వద్ద రైతులు కూర్చొని ఉన్న వీడియోలు, ఫొటోలను పరిశీలిస్తే.. ఆ రైతులు చెప్పిన ఆవేదనలో ఎంత బాధ ఉన్నదో తెలుస్తుంది. వారు వెలిబుచ్చిన నిజాలే వివిధ మీడియాల్లో ప్రసారమయ్యాయి. విప్ స్వగ్రామంలోనే ఈ పరిస్థితులు ఉన్నట్టు వార్తలు రావడంతో వాటిని కాంగ్రెస్ నాయకులు తట్టుకోలేకపోయారు.
ఆ ఇద్దరి వాయిస్ రికార్డు చేసిన నేతలు
కొంత మంది కాంగ్రెస్ నాయకులు ఆగమేఘాలపై ఆ ఇద్దరు రైతులను శనివారం ఉదయం పిలిపించి, ఆ రైతుల ద్వారా వాయిస్ రికార్డు చేసి వివిధ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టారు. ‘మమ్మల్ని మీడియా వాళ్లు మాట్లాడమంటేనే మాట్లాడాము. వాళ్లు చెప్పమన్నదే చెప్పాము.. గంతే గానీ మాకు ఆది శీనన్న ఎప్పుడూ అండగా ఉంటారు’ అని వారితో చెప్పించారు. ఇద్దరు రైతులను ఒకేచోటకు పిలిపించి మాట్లాడించగా.. రైతు నర్సయ్య మాటల్లో చివరగా ‘సారీ’ చెప్పిన తీరు చూస్తే కాంగ్రెస్ నాయకుల నిర్వాకం ఇట్టే తెలిసిపోతున్నది. ‘ఏమన్న తప్పుగా మాట్లాడి ఉంటే సారీ’ అంటూ రైతు నర్సయ్య చెప్పి అక్కడి నుంచి వెళ్తున్న తీరు కాంగ్రెస్ నాయకుల వ్యవహారశైలికి అద్దం పడుతున్నది. అన్నదాతకు జరిగిన ఘోర అవమానం ఇట్టే తెలిసిపోతుంది. అక్కడితో ఆగకుండా అక్కడ యూరియా కొరతే లేదన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన తీరుపై విమర్శలు వస్తున్నాయి.
ఈ ప్రశ్నలకు బదులేవి?
కాంగ్రెస్ నాయకులు, అధికారులు చెప్తున్నట్టుగా అక్కడ యూరియా కొరత లేకపోతే రైతులు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి 10 గంటల వరకు ఉండాల్సిన అవసరం ఏమిటి? అందులోనూ మహిళా రైతులను అక్కడే నిలుపుకోవాల్సిన అవసరం ఏమున్నది? యూరియా కొరత లేకుంటే అడిగిన మొత్తం బస్తాలు ఇవ్వకుండా కొంతమంది రైతులకు కేవలం ఒక్క యూరియా బస్తా చొప్పున మాత్రమే ఎందుకు ఇచ్చారు? దీంతోపాటు దాదాపు ఇంకా 200 మంది రైతులు యూరియా కావాలంటూ ఆధార్ కార్డులను ఎందుకు ఇచ్చి వెళ్లారు? అన్న ప్రశ్నలకు ఎక్కడా సమాధానాలు మాత్రం ఇవ్వలేదు. ఎంతసేపూ రైతులతో మీడియా తప్పుడు విషయాలు చెప్పించారంటూ విమర్శించారే తప్ప.. సదరు రైతులు చెప్పినప్పుడు వారి వెనుకాలే ఉన్న రైతులు కూడా యూరియా అందకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్న తీరును మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. అంతేకాదు, మీడియా తప్పుడు ప్రచారం చేసిందని, కథనాలు తప్పుగా వచ్చాయని పేర్కొంటూ శనివారం రికార్డు చేసిన ఇద్దరు రైతుల వాయిస్ రికార్డులను ప్రభుత్వ విప్ గ్రూపులో స్వయంగా వారి పీఆర్వోలు పెట్టారు. అలాగే, అధికార పార్టీ గ్రూపుల్లోనూ పెట్టిన తీరుపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక రైతు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏమున్నదన్న దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతున్నది. లోతుగా చూస్తే ఈ వాయిస్‌ల రికార్డు వెనకు పెద్ద తతంగమే జరిగినట్టుగా తెలుస్తున్నది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విచిత్ర పరిస్థితి
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విచిత్ర పరిస్థితి నెలకొన్నది. సమస్యలు చెప్పుకుంటే ఇబ్బందులు తప్పవన్న పరిస్థితిని కల్పిస్తున్నారు. శుక్రవారం ఇద్దరు రైతులు.. వందలాది మంది అన్నదాతల సమక్షంలో ఆగ్రోస్ కేంద్రం వద్ద మాట్లాడారు. కానీ, శనివారం మాత్రం ఇదే ఇద్దరు రైతులను కాంగ్రెస్ నాయకులు పిలిపించి ఒక గోడ వద్ద నిలిపి ఉంచి మాట్లాడించారు. దీనిని బట్టి నిజాలను మాట్లాడే వారిని పిలిపించి అధికార పార్టీ నేతలు సర్కార్‌కు అనుకూలంగా రికార్డు చేయించడంపై జిల్లా వ్యాప్తంగా విస్మయం వ్యక్తమవుతున్నది. గతంలోనూ సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఎల్లారెడ్డిపేట మండలంలోని కొన్ని తండాల్లో తాగునీటి సమస్య గురించి మహిళలు మాట్లాడితే.. తెల్లారేసరికి అధికారులు, నాయకులు అక్కడికి చేరుకొని ఇదే తరహాలో మాట్లాడించారు. ఇవేకాదు చాలా అంశాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది.
కేసీఆర్ ఉన్నప్పుడు ఈ లైన్ ఉందా?
‘మేం ఏంజేసుడు. కష్టపడి ఎవుసం జేత్తే ఏమి లాభం. ఇప్పుడేమో పొట్టకొచ్చింది. ఆడోళ్లం ఇప్పడిదాకా ఇక్కడ ఉంటరా? వంట ఎప్పుడు జేసుడు? ఎప్పుడు తినుడు? ఎందుకు ఇట్ల జేసుడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఫోన్జేస్తే ఇంటికొచ్చేది యూరియా. ఇప్పుడెందుకు వస్తలేదు. అంత కండీషన్ ఎందుకు? దేనికి పెట్టిండు ఈ పిటింగ్. ఎవుసం చేయొద్దని పెట్టాలె పిటింగ్. అన్నింటికీ ఇబ్బంది పెడుతుండు. మేం ఇక్కడే ఉంటే చిన్నిపిల్లలకు వండి పెట్టేదెప్పుడు? ఇక్కడి నుంచి తండాకు నడుసుకుంట పోవాలె. ఆడోళ్లం మేం? ఎవ్వలు జూస్తరు మా పిల్లలకు. ఏమన్న సారబోసి సాది పండ పెడుతుండ్రా.. ఇప్పుడు ఇట్ల జేస్తుండు రేవంత్‌రెడ్డి. దీనిపై అందరూ మట్లాడాల గట్టిగ. అడుగు మందుకు, యూరియాకు ఇట్ల కండీషన్ పెట్టొద్దు. ఇంత కష్టపడి ఎవుసం జేసుడు. గంటగంటకు, మడిమడికి తిరగాల పొలాల పొంట. ఇప్పుడు మందులకే ఈ ఇబ్బంది వొచ్చింది.
(శుక్రవారం రాత్రి వందలాది మంది రైతుల సాక్షిగా మీడియా ముందు నిర్భయంగా చెప్పిన కొచ్చెగుంట తండా మహిళా రైతు లావుడియా లలిత)‘
మేం అక్కడ కూసున్నం. అమ్మా ఇటురా ఇటురా అని రెండు మూడుసార్లు అన్నడు. అన్న నేను అట్ల రాను. నన్ను పిలవకు అన్నా. అయినా మాట్లాడు మాట్లాడుమన్నడు. నాకు ఆ వీడియో గీడియో ఏమీ తెలయదన్న. నేనైతే సదువుకోలేదు. కావాలని మాట్లాడిపిచ్చిండు. మాకు పొద్దూకి యూరియా ఇంటికి పంపిండ్రు. మనిషికి ఐదు బస్తాలు ఇచ్చిండ్రు. అవి తీసుకొని పోయినం. అన్నలేకుండా మాకు ఎవుసమే ఉండదు. మా భర్త ఇక్కడ ఉండడు. నా వీడియో తీస్తున్నవా? అని అడిగిన. నా భర్త ఒప్పుకోడు అని జెప్పిన. కావాలని ఇట్ల మాట్లాడిపించి.. ఇట్ల జేస్తే మావోళ్లు ఒప్పుకుంటరా? ఇప్పుడు నాకైతై బాగా ఇబ్బంది ఉంది. ఏం జేత్తరో ఏందో నాకైతే తెలియదు.
(శనివారం ఉదయం కాంగ్రెస్ నాయకులు రికార్డు చేసిన వాయిస్‌లో లావుడియా లలిత చెప్పిన మాటలు ఇవి)
రైతులు ఏమన్నరంటే?
నాటేసి నెల దాటింది. ఇంతవరకు యూరియా లేకపాయె. రోజూ వచ్చుకుంట మర్రిపోవుడైతాంది. సచ్చుడా బతుకుడా? కాంగ్రెస్ వచ్చి గిట్ల జేయవట్టె. ఎప్పుడన్న.. గింత లైన్గట్టినమా? రాత్రిపూట కొండదోమలల్ల సత్తున్నం. ఒంటిగంటకు వచ్చి లైన్గడితే ఇప్పుడుసుత (రాత్రి 9గంటలకు)రాకపాయే.
-శుక్రవారం రాత్రి రైతు లక్కం నర్సయ్య మాటలివి..
నేను ఆల్రెడీ గద్దెమీద కూసున్న. రెండు బస్తాలిచ్చిన్రు. ఇగరా అంటే ఏ ముచ్చటో అని చెప్పి నేను మాట్లాడిన. అది ఇంత దూరమైతదని తెల్వది. మాకు ఎప్పుడైనా శీనన్న (ఆగ్రో కేంద్రం నిర్వాహకుడి సోదరుడు) పైసల్లేకున్నా ఇచ్చిండు. శీనన్న వెనుకా ముందు అందరికీ ఇత్తుండు. ఏమన్న మాట్లాడి ఉంటే తప్పొప్పులుంటే సారీ..
( శనివారం ఉదయం కాంగ్రెస్ నాయకులు చేసిన వాయిస్ రికార్డులో లక్కం నర్సయ్య మాటలు)