శాయంపేట, డిసెంబర్ 15 : రాష్ట్రంలో మళ్లీ రాబోయేది కేసీఆర్ రామరాజ్యమేనని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తిలో బీఆర్ఎస్ బలపర్చిన చెన్నబోయిన ధనలక్ష్మీ అజయ్‌కుమార్, నర్సింహులపల్లిలో బీఆర్ఎస్ బలపర్చిన గోనె నాగరాజును సర్పంచ్‌లుగా గెలిపించాలని కోరుతూ సోమవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిరికొండ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాలు నాశనమయ్యాయని ఆవేదన చెందారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేస్తే గోసపడటం ఖాయమని చెప్పారు. మూడేండ్లలో వచ్చేది కేసీఆర్ సర్కారే అని, బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపిస్తే రామకృష్ణాపూర్ నుంచి గట్లకానిపర్తి, సూరంపేట మీదుగా మల్లంపల్లి వరకు రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు. నర్సింహులపల్లిని గ్రామ పంచాయతీగా మార్చి స్వయం పాలన ఇచ్చామని గుర్తుచేశారు. మార్పు అనేది గ్రామం నుంచే మొదలు కావాలని.. సర్పంచ్‌లుగా బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడ్తాయని తెలిపారు.
వేల్పూర్, డిసెంబర్ 15: హామీల అమలులో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలమైందని, కాంగ్రెస్ చేసిన మోసాన్ని గుర్తు చేసుకుని సర్పంచ్ ఎన్నికల్లో ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఓడించాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. మానాల సర్పంచ్‌గా గెలుపొందిన బుర్రా శంకర్‌గౌడ్, ఉప సర్పంచ్ వినోద్‌తోపాటు పాలకవర్గ సభ్యులను సోమవారం నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లోని తన నివాసంలో వేముల అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండేండ్లలో కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీ కూడా సక్రమంగా అమలు చేయక ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. మానాలను స్ఫూర్తిగా తీసుకుని 3వ విడత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఓడించి, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ కాంగ్రెస్ నాయకులు గ్యారెంటీ కార్డులు తీసుకుని ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అడిగారో, ఇప్పుడు వారే మళ్లీ సర్పంచ్ ఎన్నికల్లో ఓట్ల కోసం ఇంటింటికీ వస్తున్నారని గుర్తుచేశారు. 2,500 పింఛన్‌ను 4 వేలకు పెంచుతామని, కల్యాణలక్ష్మి చెక్కుతోపాటు తులం బంగారం, రైతులకు రుణమాఫీ, రైతుభరోసా, వరికి రూ.500 బోనస్, విద్యార్థులకు 5 లక్షల గ్యారెంటీ కార్డు, 2 లక్షల ఉద్యోగాలు ఇలా అనేక హామీలిచ్చి ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని దుయ్యబట్టారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడిలో జరిగిన తప్పిదాలను సరిదిద్దాలని బీఆర్ఎస్ నాయకుడు చిరుమళ్ల రాకేశ్‌కుమార్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లాలో జరిగిన ఎన్నికల్లో అక్రమాలకు పాల్ప డ్డ కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరారు. సోమవారం ఆయనతోపాటు పార్టీ నల్లగొండ జిల్లా నాయకులు హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో నాలు గు వినతిపత్రాలను అందజేశారు. నల్లగొండ జిల్లాలో అధికార కాంగ్రెస్ నేతల ఒత్తిడితో స్థానిక అధికారులు ఫలితాలను తారుమారు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తప్పిదాలను సరిదిద్దాలని కోరారు.