హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): సర్కార్ బడుల్లో పనిచేస్తున్న వొకేషనల్ ట్రైనర్స్ ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. సంక్రాంతి పండుగపూట పస్తులు ఉండాల్సిన దీనస్థితిలో ఉన్నారు.రాష్ట్రంలోని జిల్లా పరిషత్, మాడల్ స్కూల్స్, కేజీబీవీల్లో వొకేషనల్ విద్యను అందిస్తున్నారు. ఆయా ట్రేడ్స్ బోధనకు ఔట్సోర్సింగ్ పద్ధతిలో 1,917 మంది వొకేషనల్ ట్రైనర్స్‌ను నియమించారు. సమగ్రశిక్ష ప్రాజెక్ట్ ద్వారా వీరికి వేతనాలు చెల్లించాల్సి ఉంది. రాష్ట్రంలో మొత్తం 10 ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు ఉండగా, ఏడు ఏజెన్సీల కింద పనిచేస్తున్న వారి వేతనాలు పెండింగ్‌లో ఉన్నట్టు ట్రైనర్లు వాపోయారు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభమైన నాటి నుంచి వేతనాలు అందకపోవడంతో ట్రైనర్లు సోమవారం సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగి, వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.