MLA Vivek Venkataswamy | హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ‘చీఫ్ విప్ పదవిపై నాకు ఆసక్తిలేదు. ఆ పదవి నాకెందుకు? అని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెగేసి చెప్పారు. తనకు మంత్రి పదవి మాత్రమే కావాలని, లేదంటే ఇంకేమీ వద్దని ఆయన స్పష్టం చేశారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నలుగురు ప్రభుత్వ విప్‌లను నియమించింది. ఈ సందర్భంగా చీఫ్ విప్‌గా ఎవరిని నియమించాలన్న అంశంపై పార్టీలో చర్చ జరిగినట్టు తెలిసింది. అనుభవం, సభ్యులను సమన్వయం చేసే సమర్థత చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి ఉన్నదని ఆ పదవికి ఆయనైతేనే న్యాయం చేస్తారని సీఎం రేవంత్‌రెడ్డి సహా ఇతర మంత్రులు అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం.
అయితే వివేక్ వెంకటస్వామికి ఈ విషయాన్ని చేరవేసి ఆయనను ఒప్పించే బాధ్యతను శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు అప్పగించారు. మంత్రి శ్రీధర్‌బాబు శుక్రవారం వివేక్‌ను తన చాంబర్‌కు పిలిపించుకొని ‘మీరు చీఫ్ విప్‌గా ఉండాలని అనుకుంటున్నాం..’ అని చెప్పగానే ఆయన ‘ఆ పదవి నాకెందుకు?’ అని స్పందించినట్టు తెలిసింది. తనకు మంత్రి పదవి కావాలని మొదటి నుంచీ చెప్తున్న విషయాన్ని ఈ సందర్భంగా వివేక్ గుర్తుచేసినట్టు సమాచారం.