వరంగల్/జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ)/మహదేవపూర్/కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టుపై రీడిజైన్, నిర్మాణం, నిర్వహణ, ఆయకట్టు కల్పనపై కాంగ్రెస్ నేతలు మరోమారు రాజకీయం చేసేందుకు ప్రయత్నించారు. మేడిగడ్డ బరాజ్‌ను మహా హంగామాకు వేదికగా మార్చుకున్నారు. మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో పలువురు మంత్రులు, కాంగ్రెస్, ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీపీఐ ఎమ్మెల్యే మేడిగడ్డను సందర్శించారు. ప్రాజెక్టుపై ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ సుధాకర్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన అనంతరం మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రులు మరోసారి కేసీఆర్ ప్రభుత్వంపై తమ అక్కసును వెళ్లగక్కారు. కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా చూపేందుకు మరోసారి ప్రయత్నించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం ద్వారా కోటి ఎకరాలకు సాగునీళ్లిచ్చామని మాజీ సీఎం కేసీఆర్ చెప్పింది పచ్చి అబద్ధమని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణానికి ఇప్పటివరకు రూ.97 వేల కోట్లు ఖర్చయ్యిందని, కానీ లక్ష ఎకరాలకు కూడా నీరివ్వలేదని అన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో సమస్య ఉన్నదని అధికారులు ఎల్ అండ్ టీ సంస్థకు లేఖ రాసినా అది స్పందించలేదని చెప్పారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారంలో ఎక్కడా నీళ్లు స్టోరేజీ చేసే పరిస్థితి లేదని చెప్పారు. గత ఐదేండ్లలో 160 టీఎంసీలు కూడా ఎత్తిపోయలేదని అన్నారు. కేసీఆర్ వ్యూహాత్మకంగా కాంగ్రెస్‌పై ఎదురుదాడి చేస్తున్నారని, ఆయన అసెంబ్లీకి వచ్చి సలహాలివ్వాలని సూచించారు. కేఆర్ఎంబీపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని అసెంబ్లీకి వచ్చి డిమాండ్ చేయాలని అన్నారు. ఇరిగేషన్‌పై తాము శ్వేతపత్రం విడుదల చేస్తామని, దానిపై చర్చకు రావాలని కోరారు. కృష్ణా నది నీళ్లపై కేంద్రానికి అధికారం అప్పగించింది కేసీఆర్ అని ఆరోపించారు. బీజేపీ నాయకులు కేసీఆర్‌ను కాపాడటానికి ప్రయత్నిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ప్రాజెక్టులపై తాము జ్యుడీషియల్ విచారణను కోరుతుంటే బీజేపీ మాత్రం కేంద్రానికి అప్పగించాలని అంటున్నదని చెప్పారు. కేసీఆర్‌ను కాపాడటానికే బీజేపీ ఎమ్మెల్యేలు తమతోపాటు మేడిగడ్డకు రాలేదని అన్నారు.
కేసీఆర్ ప్రసంగం అయ్యేవరకు ఆగి..
బరాజ్ సందర్శన అనంతరం ఎమ్మెల్యేలు, మంత్రులు వేదికపైకి రాగా సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం తన వాహనంలోకి వెళ్లారు. నల్లగొండలో మాజీ సీఎం కేసీఆర్ ప్రసంగం అయిపోయిన అనంతరం ఆయన వేదికపైకి చేరుకున్నారు. ఇంతకుముందే మంత్రి ఉత్తంకుమార్రెడ్డితోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు గురించి పూర్తి స్థాయిలో సమావేశం నిర్వహించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ విన్నారు. మరోమారు సీఎం రేవంత్‌రెడ్డి ఇన్చార్జి ఈఎన్సీ సుధాకర్‌రెడ్డితో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇప్పించారు. అలాగే విజిలెన్స్ డీజీ రాజీవ్ రంజన్ బరాజ్ పరిస్థితిపై విచారణకు సంబంధించి మరో ప్రజంటేషన్ ఇచ్చారు. సుమారు రాత్రి 7 గంటల వరకు సమావేశం కొనసాగింది. సమావేశానికి మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు డుమ్మా కొట్టారు.
సాగునీటి ప్రాజెక్ట్‌లు ఆధునిక దేవాలయాలు
సాగునీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలని పెద్దలు చెప్పారని సీఎం రేవంత్ అన్నారు. దేవాలయాలు ఎంత పవిత్రమైనవో సాగునీటి ప్రాజెక్టులు కూడా అంతే పవిత్రమైనవని చెప్పారు. మేడిగడ్డకు బయలుదేరడానికి ముందు సీఎం రేవంత్ అసెంబ్లీలో మాట్లాడారు. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి రూపకల్పన చేసిందని అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఏం జరిగిందో ఎవరికీ తెలియదని, కొంతమంది సీనియర్లు ఉన్నా.. వారికి పూర్తి అవగాహన ఉందో లేదో తనకు తెలియదని చెప్పారు. అందుకే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను బ్యారేజీ సందర్శనకు రావాలని కోరామని అన్నారు. వాస్తవ పరిస్థితులను ప్రజల ముందుంచేందుకే అన్ని పార్టీలను ఆహ్వానించామని చెప్పారు.
కాంగ్రెస్ హయాంలో 38వేల కోట్లతో ప్రారంభించాం : ఉత్తమ్
కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ హయాంలో రూ.38వేల కోట్లతో ప్రారంభించామని ఇరిగేషన్‌శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. మేడిగడ్డ వద్ద ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ రీడిజైన్ పేరుతో రూ.97వేల కోట్లు ఖర్చు పెట్టి కట్టారని తెలిపారు. ఇందులో భారీ కుంభకోణం జరిగిందని, దీనిపై విచారణ చేసి క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పారు. మేడిగడ్డ ప్రాజెక్టును తప్పుగా డిజైన్ చేశారని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మోతాదుకు మించిన నీటిని నిల్వచేసి ప్రాజెక్టును నాశనం చేశారని విమర్శించారు.
పరస్పర విరుద్ధమైన నివేదికలు
బరాజ్ కుంగుబాటు ఘటనపై చేపట్టిన విచారణ అంశాలను విజిలెన్స్ డీజీ రాజీవ్త్రన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తెలిపారు. ఇంజినీరింగ్ అధికారులు బరాజ్ కుంగుబాటునకు ఇంకా కారణాలు పూర్తిగా తెలియవని, ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నదని, మరో 4-5రోజుల్లో ఒక స్పష్టత వచ్చే అవకాముందని తెలపగా, అందుకు పూర్తి విరుద్ధంగా విజిలెన్స్ అధికారులు తమ నివేదికను సమర్పించారు. విజిలెన్స్ డీజీ రంజన్ అవినీతి అక్రమాలపై కాకుండా బరాజ్‌లోని టెక్నికల్ విషయాలపై ఇంజినీర్లా స్క్రీన్‌పై ప్రజంటేషన్ ఇవ్వడం ఇంజినీర్లను అసహనానికి గురిచేసింది. నాణ్యతా లోపం, డిజైన్ లోపం వల్లే బరాజ్ కుంగుబాటునకు గురైందని విజిలెన్స్ అధికారులు వెల్లడించారు.ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తి కాకముందే విజిలెన్స్ అధికారులు ఏ ప్రాతిపాదిక లోపాలను తేల్చారన్నది తెలియని పరిస్థితి. వాటిని ఆధారంగా చేసుకొని ప్రతిపక్షపార్టీ తరహాలోనే రొడ్డకొట్టుడు ఆరోపణలకు కాంగ్రెస్ ప్రభుత్వం దిగింది. కుంగుబాటుకు కారణాలపై ఇంకా స్పష్టత రాకుండానే, ఆ దిశగా పరీక్షలు చేపట్టకముందే అవినీతి, డిజైన్, తదితర లోపాలే కారణమంటూ సీఎం రేవంత్‌రెడ్డి నిర్ధారించడం కొసమెరుపు.
అడ్డగోలు ఆరోపణలే..
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైన్ ఎందుకు చేయాల్సి వచ్చిందో విన్న తరువాత కూడా గ్రావిటీ ప్రాజెక్టును కేసీఆర్ నిర్వీర్యం చేశారని, డబ్బంతా వృథా చేశారంటూ ఇష్టారీతిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్ విరుచుకుపడ్డారు తప్ప ఇతర అంశాల జోలికి వెళ్లలేదు. ప్రాజెక్టుపై, కేసీఆర్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగడమేతప్ప నిర్దిష్ట కారణాలు వెల్లడించలేదు. ప్రాజెక్టు అప్పులపై అధికారులు ఒకటి చెబితే వీరు తమ వ్యక్తిగత వాదనలను వినిపించారు. నిర్మాణ వ్యయం, ప్రాజెక్టు నిర్వహణ తీరు, కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్, బరాజ్ కుంగుబాటు, పునరుద్ధరణ తదితర అన్ని అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్ చేసిన వ్యాఖ్యలన్నీ వారి అవగాహన రాహిత్యాన్ని బయటపెట్టాయి. ప్రాజెక్టుపై ఇప్పటివరకు 97వేల కోట్లకు పైగా ఖర్చుచేశారని రేవంత్, ఉత్తమ్‌లు చెప్పగా, అధికారులు 94వేల కోట్లు ఖర్చయిందని వెల్లడించడం గమనార్హం. సూటిగా చెప్పాలంటే రాజకీయ ప్రయోజనాల కోసమే మేడిగడ్డ సందర్శన పెట్టారని తేలిపోయింది. సమావేశం ఆద్యంతం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని బదునాం చేసే కోణంలోనే సీఎం అధికారులతో అడిగి మరీ సమాధానాలు చెప్పించుకున్నారు. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా చివరికి ఎటూ తేల్చకుండా వెళ్లిపోయారు. బరాజ్‌ను రిపేరు చేయిస్తారా.. మొత్తానికే వదిలేస్తారా.. అసలు టెక్నికల్ విచారణ ఎందుకు ప్రారంభం కావడంలేదు.. ఎల్ అండ్ టీతో పనులు చేయిస్తారా?.. అని విలేకరులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. ఎన్డీఎస్ఏ విచారణ అనంతరం నిర్ణయం తీసుకుంటాం.. అవసరమైతే తుమ్మిడిహట్టి నిర్మిస్తాం అంటూ దాటవేస్తూ వెళ్లిపోయారు.