హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో మహిళల హక్కులకు భంగం కలుగుతున్నదని మహిళా సమాఖ్య (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి నిషాసిద్ధు విమర్శించారు. మహిళలకు నాణ్యమైన విద్య, వైద్యాన్ని దూరం చేస్తున్నదని దుయ్యబట్టారు. రానున్న కేంద్ర బడ్జెట్లో విద్య, వైద్య రంగాలకు బడ్జెట్ పెంచాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూంభవన్ ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించే గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని కేంద్రం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు.
నగరాల పేర్లను మార్చినంత మాత్రాన మోదీ విశ్వగురువు కాలేరని, మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించాలని కోరారు. మణిపూర్ అల్లర్లలో మహిళలు, బాలికలపై దాడులు జరిగితే మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్లు 2030 నాటికి అమలు చేస్తామనడం విడ్డూరంగా ఉన్నదని విమర్శించారు. ‘సర్’ పేరుతో తమకు అనుకూలంగా లేని వారిని ఓటరు జాబితా నుంచి తొలగిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మద్యాన్ని నియంత్రించడంతోపాటు, డ్రగ్స్‌ను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలోఎన్ఎఫ్ఐడబ్ల్యు నాయకురాళ్లు ఎన్ జ్యోతి, ఎస్ ఛాయాదేవి, ఎం సదాలక్ష్మి, ఎండీ ఫమీద, జీ హైమావతి, మాధవి తదితరులు పాల్గొన్నారు.