హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ యథేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సిరికొండ మధుసూదనాచారి ఆరోపించారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ దొడ్డిదారిలో ఓట్లు కొల్లగొట్టే ఎత్తుగడలకు తెరలేపిందని ధ్వజమెత్తారు. దీనిపై బీఆర్ఎస్ నాయకులు పల్లె రవికుమార్‌గౌడ్, అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి, కే కిశోర్గౌడ్తో కలిసి సోమవారం ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం యూసూఫ్‌గూడ పోలీస్‌గ్రౌండ్‌లో సినిమా వర్కర్ల సన్మానం పేరిట నిర్వహిస్తున్న సభ అనుమతులను రద్దు చేయాలని విజ్ఞప్తిచేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ సభను నిర్వహిస్తే ముఖ్యమంత్రిపై క్రిమినల్ కేసు, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్‌పై ఎన్నికల కోడ్ ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నామినేషన్ ర్యాలీ మొదలు ఇప్పటివరకు అనేకసార్లు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిందని ఆరోపించారు. కొందరు అధికారులు వారికి వత్తాసు పలుకుతున్నట్టు అనుమానం ఉన్నదని అన్నారు. రాజ్యాంగబద్ధంగా ఉపఎన్నిక జరగాలంటే ఎన్నికల సంఘం పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కోరారు.