రాజన్న సిరిసిల్ల, జూన్ 30 (నమస్తే తెలంగాణ): అధికార దాహంతో ప్రజా ప్రభుత్వాలను బీజేపీ కూలుస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తున్న తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు అనవసరంగా నోరు పారేసుకుంటూ నిందలు మోపుతున్నారని మండిపడ్డారు. వినోద్‌కుమార్ తన దత్తత గ్రామమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లిలో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.5.75 కోట్లతో నిర్మిస్తున్న మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాల అదనపు గదులు, అంగన్వాడీ భవన నిర్మాణాలకు గురువారం టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ప్రతిమ ఫౌండేషన్ చైర్మన్ బోయినపల్లి హారిణితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వినోద్ మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను చూసి ఓర్వలేని కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీలు దొందూ దొందేనని దుయ్యబట్టారు.
కేంద్ర మంత్రులు రాత్రి పూట హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీలను సందర్శించి అభివృద్ధిని చూడాలన్నారు. ప్రతి నియోజకవర్గానికి వస్తున్న మంత్రులు ప్రతిపల్లెల్లో పర్యటించి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ, నర్సరీలు, వైకుంఠధామాలు, రహదారులను కళ్లారా చూసి ఇక్కడి ఆ పార్టీ నేతలకు బుద్ధి చెప్పాలని సూచించారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి బీజేపీ పాలిత రాష్ర్టాల్లో జరిగి ఉంటే తనతో చర్చకు రావాలని వినోద్‌కుమార్ కేంద్ర మంత్రులకు సవాల్ విసిరారు. కేటీఆర్ సారథ్యంలో రాజన్న సిరిసిల్లలో జరిగిన అభివృద్ధిని సిరిసిల్లకు వచ్చిన చూసి అక్కడి నియోజకవర్గంలో ఇలాంటి పనులు జరిగాయో లేదో పోల్చి చూసుకోవాలని హర్యానా మంత్రికి సూచించారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ తదితరులు పాల్గొన్నారు.