హైదరాబాద్ : రాహుల్ గాంధీ.. రాష్ట్ర పర్యటనకు వస్తున్న మీకు వ్యవసాయ రంగంపై కనీసం అవగాహన ఉందా? వరంగల్ జిల్లా సభలో మీరు ప్రకటించనున్న వ్యవసాయ విధానం తెలంగాణ రాష్ట్రానికా ? లేదంటే దేశానికా? అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ ప్రశ్నించారు. రాష్ట్ర పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ, మీ విధానం స్పష్టం చేయాలని ఆయన సూచించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న వ్యవసాయ విధానం దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వ్యవసాయ విధానం దారుణంగా ఉందని ఆరోపించారు.
కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఎకరం భూమిలో ఆవరేజ్‌గా 30 క్వింటాళ్లు రైతులు పండించిన పంటలో కేవలం 15 క్వింటాళ్ల ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తున్నారన్నారు. కూట్లో రాయి తీయనోల్లు.. ఏట్లో రాయి తీస్తారా..? అనే చందంగా కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఉందని విమర్శించారు. ముందుగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వ్యవసాయ విధానం అమలు చేయాలని, ఆ తర్వాత ఇతర రాష్ట్రాల గురించి మాట్లాడాలని వినోద్ కుమార్ హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుకు వ్యవసాయానికి పెట్టుబడి కోసం రైతుబంధు పథకం కింద ఆర్థిక సహాయం చేస్తున్నామని, రైతు చనిపోతే రైతు బీమా కింద రూ.5లక్షల ఆర్థిక సహాయం అందజేస్తున్నమని, ఇలాంటి పథకాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా..? అని వినోద్ కుమార్ ప్రశ్నించారు.
వ్యవసాయానికి 24 గంటల పాటు నిరంతరాయంగా ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి కార్యక్రమం ఉందా..? అని ఆయన ప్రశ్నించారు. వ్యవసాయానికి పుష్కలంగా సాగు నీరు అందిస్తున్నామని, సాగునీటి లభ్యతతో పంటలు లక్ష్యానికి మించి చేతికి వచ్చిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సాగు నీటి లభ్యత ఉందా..? అని ఆయన ప్రశ్నించారు. మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలో దాదాపు 45వేల చెరువుల్లో పూడిక తీసే కార్యక్రమాన్ని అమలు చేశామని, తద్వారా భూగర్భ జలాలు పెరిగాయని, నిపుణుల అంచనా ప్రకారం భూగర్భంలో సుమారు 500 టీఎంసీ నీళ్లు ఉన్నాయని, ఇలాంటి పరిస్థితి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా..? అని వినోద్ కుమార్ ప్రశ్నించారు.
మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ప్రతి నివాసానికి తాగు నీరు అందిస్తున్నామని, ఇలాంటి కార్యక్రమం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా..? అని ఆయన ప్రశ్నించారు. రైతులు పండించిన పంటను ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని, కొవిడ్ కాలంలో కూడా రైతుల ముంగిట వెళ్లి ధాన్యం కొనుగోలు చేశామని, ఇలాంటి కార్యక్రమం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా..? అంటూ మండిపడ్డారు. ఇలా చెప్పుకుంటే అనేక కార్య్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని, కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా సభలో ప్రకటించనున్న వ్యవసాయ విధానం తెలంగాణకా?.. దేశానికా..? అనే విషయం రాహుల్ గాంధీ స్పష్టం చేయాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.