అక్కన్నపేట, నవంబర్ 3: ‘ఏ ముఖం పెట్టుకొని మా ఊరికొచ్చినవ్’ అంటూ హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌ను.. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మోత్కులపల్లి గ్రామస్థులు నిలదీశారు. శుక్రవారం రాత్రి పొన్నం ప్రభాకర్ మోత్కుపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారాన్ని గ్రామస్థులు బీఆర్ఎస్ నాయకులతో కలిసి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ.. మెట్ట ప్రాంత వరదాయిని గౌరవెల్లి ప్రాజెక్ట్ పనులు తుది దశలో ఉండగానే.. కాంగ్రెస్ నాయకులు భూ నిర్వాసితులతో కలిసి కేసులు వేయించారని, ప్రాజెక్ట్ పూర్త్తయితే ప్రతిపక్షాలకు డిపాజిట్ దక్కదనే భయంతో కుట్రలు చేశారని విమర్శించారు. రైతులకు రైతుబంధు ఇవ్వొద్దని, పంట రుణమాఫీ చేయొద్దని, ఆసరా పంఛన్లు ఆపాలని ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇలా అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుంటూ.. సంక్షేమాన్ని విస్మరించే పార్టీలకు ఓట్లు వేయబోమని పొన్నం ప్రభాకర్ ఎదుటే తేల్చిచెప్పారు. మా ఊరు ఓట్లు అడగకుండా వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. దీంతో చేసేది లేక పొన్నం ప్రభాకర్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు స్థానికులు తెలిపారు.