ఇల్లంతకుంట, నవంబర్ 25 : ‘కాంగ్రెస్ సర్కార్ ఇస్తామన్న ఆరు గ్యారెంటీలు ఎక్కడ అమలైనయ్? అమలు కాకపోయినా అయినట్టు ఎందుకు ప్రచారం చేస్తున్నరు?’ అంటూ తెలంగాణ సాంస్కృతిక కళాకారులను రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ వాసులు ప్రశ్నించారు. సోమవారం సాయంత్రం కళాకారులు గ్రామానికి వచ్చి ప్రచారం చేస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. అమలు కాని పథకాలను అమలైనట్టు చెప్పడం ఎమిటని నిలదీశారు. ఉచిత బస్సు ఎవరు అడిగారని ఇచ్చారు? అవి సమయానికి రావడం లేదని ఆరోపించారు. రూ.500 సిలిండర్ అమలు చేశామని ఎందుకు పాటలు పాడుతున్నారు? ఎక్కడ అమలు జరిగిందో, ఎవరికి వచ్చిందో చూపిస్తారా? అని ప్రశ్నించారు. మహిళలకు రూ.2500 ఎక్కడ ఇస్తున్నారని అడిగారు. ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యాన్ని కనీసం కొనకపోవడంతో దళారులకు విక్రయించుకునే పరిస్థితి తీసుకువచ్చిందని మండిపడటంతో కళాకారులు వెనుదిరిగారు.