చండ్రుగొండ, ఏప్రిల్ 26: ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో భారీగా అవకతవకలు జరిగాయని భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలం పోకలగూడెం పంచాయతీ బాలియాతండా మహిళలు మండిపడ్డారు. జాబితాలో అర్హుల పేర్లు పెట్టేదాకా ఏ ఒక్క అధికారినీ ఊళ్లో కి రానివ్వబోమని హెచ్చరించారు. ఇండ్ల జాబితాలో అనర్హులనే ఎంపిక చేశారని ఆరోపించారు.
శనివారం ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితాతో గ్రామంలో సర్వే కు వచ్చిన పంచాయతీ ప్రత్యేకాధికారి శ్రీనివాసరావు, జీపీ సెక్రటరీ నాగేశ్వరరావులపై గ్రామస్థులు మండిపడ్డారు. గతంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన వారికే మళ్లీ ఇస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల పేర్లే ప్రస్తుత జాబితాలో ఉన్నాయని విమర్శించారు. సర్వేను అడ్డుకొని అధికారులను వెనక్కి పంపారు.